రీనా పుష్కర్ణా.. నలభై ఏండ్ల క్రితం భర్త వినోద్‌తో కలిసి ఇజ్రాయెల్ వెళ్లారు. అప్పటికి అక్కడివారికి భారత్ గురించి అంతగా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దేశం కాని దేశంలో రెస్టారెంట్ తెరిచారు రీనా. అంతేకాదు… సామాన్య ప్రజలతోపాటు అక్కడి ప్రముఖులకూ విందులు ఏర్పాటు చేశారు. ఒక్క భారత్ అనేకాదు, ఇతర దేశాలకూ.. దౌత్య సంబంధాల వేదికగా తన రెస్టారెంట్ (తందూరీ)ను తీర్చిదిద్దారు.
అలా భారతీయ వారసత్వానికి గుర్తింపు తెచ్చిపెట్టినందుకు ఈ ఏడాది ప్రవాస భారతీయ సమ్మాన్ పురస్కారానికి ఎంపికయ్యారు రీనా. ఇండోర్‌లో జరిగే ‘ప్రవాస భారతీయ దివస్’ వేడుకల్ల్లో ఈ పురస్కారం ప్రదానం చేస్తారు. రీనా 1958లో జన్మించారు. తండ్రి భారత సైన్యంలో అధికారి.
తల్లి ఇరాక్-యూదు మూలాలు ఉన్నవారు. 1983లో భర్త వినోద్‌తో కలిసి ఇజ్రాయెల్‌కు వలస వెళ్లారు. అప్పటికి రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు లేవు. ‘నేను నా భారతీయ వారసత్వానికి ఎంతో గర్విస్తాను. ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండేలా ప్రయత్నిస్తాను. భారత్-ఇజ్రాయెల్ బంధానికి నేను సాక్షిని కావడం ఆనందం కలిగించే విషయం. నా భర్త అండగా నిలవడం వల్లే ఇదంతా సాధ్యమైంది’ అంటారు రీనా.