Kriti Sanon | కృతి సనన్.. నటిగానే మనకు తెలుసు. ఆమెలో ఓ ఆంత్రప్రెన్యూర్ ఉంది. సౌందర్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చే కృతి తన అభిరుచినే బిజినెస్ ఐడియాగా మార్చుకుంది. మరో ఆంత్ర ప్రెన్యూర్ వైశాలి గుప్తాతో కలిసి ‘ఎమ్కెఫిన్’ అనే సంస్థను స్థాపించింది. మరొకరైతే పెట్టుబడి పెట్టేసి వ్యాపార వ్యవహారాలు ప్రొఫెషనల్స్‌కు వదిలేసేవారు. కృతి అలా కాదు. తయారీ నుంచి క్వాలిటీ చెక్ వరకు ప్రతి విభాగాన్నీ పర్యవేక్షిస్తుంది. తమ సంస్థ తయారుచేసే సౌందర్య సాధనాలనే వాడుతుంది.
‘చర్మం సున్నితమైంది. ఒక్కో ఉత్పత్తికి ఒక్కోలా స్పందిస్తుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే సౌందర్య సాధనాలను అందిస్తున్నాం’ అంటారామె. వైశాలికి కూడా సహ-వ్యవస్థాపకురాలి చొరవ భలేగా నచ్చింది. ‘తనకు తెలియని విషయం అంటూ లేదు. ఏ అంశం మీద అయినా పట్టు సాధిస్తుంది’ అంటూ ఆకాశానికెత్తేస్తుంది. ఇప్పటికే కృతికి ‘బటర్‌ఫ్లై ఫిల్మ్స్’ అనే చిత్ర నిర్మాణ కంపెనీ ఉంది. ‘ది ట్రైబ్’ పేర ఫ్యాషన్ బ్రాండ్ సృష్టించింది. వెండితెర మీద కూడా తానేమిటో నిరూపించుకుంటూ.. ‘మిమీ’ చిత్రంలో అద్భుత నటనకు ఉత్తమ నటి పురస్కారం అందుకుంది.