తమిళనాడు రాజధాని చెన్నై నగరం అరుంబాక్కంలోని ఓ ఆంగన్వాడి పాఠశాల భవనం దగ్గర సాయంత్రం వేళ వివిధ తరగతుల పిల్లలు నోట్బుక్లు, పుస్తకాల సంచులతో సందడి చేస్తుంటారు. అయితే, ఇది మామూలు ట్యూషన్ల లాంటిది మాత్రం కాదు. ఇక్కడ పిల్లల జీవితాలకు అవసరమైన జీవన నైపుణ్యాల శిక్షణను ఇస్తారు. క్రమశిక్షణ అలవాటు చేస్తారు. దీనిపేరు అరుంబాక్కం పోలీస్ బాయ్స్ అండ్ గర్ల్స్ క్లబ్. దీన్ని 53 ఏండ్ల స్కౌట్మాస్టర్ పి.కృష్ణమూర్తి నిర్వహిస్తున్నారు. దీని కర్త కర్మ క్రియ ఆయనే. కేవలం విద్య సంబంధ అంశాల గురించి కాకుండా మెరుగైన జీవితం కోసం పాఠాలు నేర్పుతూ కృష్ణమూర్తి ఇరవయ్యేండ్లుగా ఎంతోమంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతున్నాడు.
2003లో ప్రారంభమైన ఈ క్లబ్ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం వరకు విద్యార్థులకు నైపుణ్యాల శిక్షణను ఇస్తున్నది. ముఖ్యంగా పిల్లలు చెడ్డదారి పట్టకుండా పాఠాలు నేర్పుతున్నది. మంచి అలవాట్లు, క్రమశిక్షణతోనే మంచి సమాజం నిర్మాణమవుతుందని కృష్ణమూర్తి నమ్ముతారు. “ఒక్కసారి పిల్లలకు మంచి నడవడి, క్రమశిక్షణ అలవడితే మిగిలినవి వాటంతట అవే మంచిగా జరిగిపోతాయి” అంటాడు కృష్ణమూర్తి. ఇక క్లబ్బులో ప్రతి సాయంత్రం పిల్లలు తమ పాఠాలను సుప్రసిద్ధ తమిళ తత్వవేత్త తిరువళ్లువర్ రచించిన తిరుక్కురల్ సూక్తులతో మొదలుపెడతారు. ఆ తర్వాత పిల్లలకు పరిసరాల పరిశుభ్రత గురించి, సమాజ సేవ ప్రాధాన్యం గురించి ప్రయోగాత్మకంగా వివరిస్తారు. ఇంకా కెరీర్‌ను ఎలా అభివృద్ధి చేసుకోవాలో కూడా చెబుతారు. తమ క్లబ్‌కు వచ్చే పిల్లలు పెద్ద చదువులు చదువుకోవడానికి ఆర్థికంగా అండగా నిలుస్తారు.
ఈ క్లబ్‌కు ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నుంచి స్పాన్సర్షిప్ ఉండటం విశేషం. స్థానికులు కూడా తమవంతుగా క్లబ్ తరఫున పిల్లల కోసం తగిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. తమ పెద్దమనసు చాటుకుంటున్నారు. అవసరంలో ఉన్న విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగులు, చదువుకోవడానికి సంబంధించిన ఇతర పరికరాలను కొనిస్తున్నారు. నైపుణ్య పాఠాలతోపాటు పిల్లలతో మొక్కలు నాటిస్తూ పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని పసిమనసుల్లో పాదుకొల్పుతున్నారు. పిల్లలు చిన్నతనం నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లు, క్రమశిక్షణతో పెరిగితేనే భవిష్యత్తుకు మంచి నాయకులు అందుబాటులో ఉంటారు. లేకుంటే పరిస్థితులు దుర్భరంగా ఉంటాయి. పిల్లలూ మొక్కల్లాంటి వాళ్లే… మంచి ఆలోచనలు, అలవాట్లనే విత్తనాలతో గొప్ప భవిష్యత్తుకు భరోసా ఇవ్వొచ్చనే కృష్ణమూర్తి అభిప్రాయం నిజమే.