అగ్రరాజ్యంలో తుపాకుల సంస్కృతి చాలా ఎక్కువ. ప్రపంచాన్ని పిడికిట పట్టాలని చూసే అక్కడి ప్రభుత్వాలు తమ పౌరుల గుప్పిట నుంచి గన్లను తప్పించడానికి నానా తంటాలూ పడుతుంటాయి. అయితే ఈ విధానానికి వ్యతిరేకంగా నోరు మెదిపిన అతికొద్ది మంది రాజకీయ నాయకుల్లో మన హైదరాబాదీ మహిళ గజాలా హష్మి ఒకరు. అసాల్ట్ రైఫిల్ రద్దు, మహిళలకు సంతాన హక్కులు, లింగవివక్ష తదితర సమస్యల మీద తన గొంతును విస్పష్టంగా వినిపించే ఈమె వర్జీనియా గవర్నర్‌గా గెలుపు బావుటా ఎగురవేశారు. అమెరికా రాష్ర్టాల్లోనే ఈ పదవిని తొలిసారిగా చేపట్టిన ముస్లిం మహిళగా రికార్డు సృష్టించిన ఈమె హైదరాబాద్‌లోనే జన్మించారు.
అధ్యాపక వృత్తి ఎంతో బలమైనది. స్ఫూర్తిదాయకమైనది కూడా. విద్యాబోధన అన్నది నాలుగు గోడల మధ్యే జరిగినా సమాజంలోని అడ్డుగోడలను కూల్చివేసే శక్తి దానికి ఉంది. పాఠంతో పాటు విలువలూ నేర్పే బాధ్యతను అధ్యాపకులు తీసుకుంటారు. అందుకే 30 సంవత్సరాలపాటు అధ్యాపక వృత్తిలో పనిచేసిన గజాలా క్రమంగా ప్రజాసేవ బాటపట్టారు. సమాజ ఉన్నతిని ఆకాంక్షించే తన ఆలోచనలను నలుగురితో పంచుకున్నారు. వాళ్ల దన్నునూ పొందారు. అధికారంలో ఉన్న ట్రంప్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడ్డా సరే… స్పష్టమైన ఆధిక్యంతో గెలిచి మహిళాశక్తితో పాటు భారతీయుల సత్తానీ చాటారు.
గజాలా తల్లిదండ్రులిద్దరూ హైదరాబాదీలే. ఆమె తల్లి తన్వీర్ హష్మి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ, బీఈడీ చదివారు. తండ్రి జియా హష్మి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఎంఏ, ఎల్ఎల్బీ చేశారు. ఆమె తాతయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక విభాగంలో ఉద్యోగం చేశారు. గజాలా 1964 జులైలో హైదరాబాద్‌లోనే పుట్టారు. ఇక్కడి మలక్‌పేటలోని అమ్మమ్మ, తాతయ్యల ఇంట్లో నాలుగేండ్ల వయసు వచ్చే వరకూ పెరిగారు. అప్పటికే తండ్రి అమెరికా వెళ్లిపోయారు. ఆయన సౌత్ కరోలినా విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్డీ చేశారు. ఆ తర్వాత అధ్యాపక వృత్తిలో ప్రవేశించి అక్కడి సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్‌కి డైరెక్టర్ స్థాయి దాకా ఎదిగారు. గజాలా నాలుగేండ్ల వయసులో తల్లి, సోదరుడితో కలిసి తండ్రి దగ్గరికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి అక్కడే స్థిరపడ్డారు. ఇప్పటికీ ఆమె బంధువులు హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు. తనకు హైదరాబాద్ అన్నా, తన బంధువులన్నా ఎంతో ఇష్టమని చెబుతుంటారామె.
విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన గజాలా చిన్నతనం నుంచే పాఠశాలలో చురుగ్గా ఉండేవారు. అక్కడి విద్యా సంస్థలు, ప్రభుత్వం నుంచి ఎన్నో ప్రోత్సాహకాలు, స్కాలర్షిప్లను అందుకున్నారు. సదరన్ జార్జియా యూనివర్సిటీ నుంచి బీఏ ఆనర్స్ చదివారు. తర్వాత అమెరికన్ లిటరేచర్‌లో అట్లాంటాలో పీహెచ్డీ చేశారు. భర్త అజార్ రఫిక్. ఇద్దరు కూతుళ్లు యాస్మిన్, నూర్. కుటుంబంతో కలిసి ఆమె రిచ్మండ్లో ఉంటున్నారు. అక్కడి రేనాల్డ్స్ కమ్యూనిటీ కాలేజీలో లిటరేచర్ బోధించారు. అంతేకాదు అక్కడి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్‌కు వ్యవస్థాపక డైరెక్టర్‌గానూ ఉన్నారు. మొత్తంగా విద్యాబోధనలో ఆమెది 30 ఏండ్ల అనుభవం.

తొట్టతొలిగా 2019 ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున పోటీ చేసి వర్జీనియా సెనేట్‌లోకి అడుగుపెట్టారు గజాలా. దక్షిణాసియా నుంచి ఈ స్థానానికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా అప్పుడదొక రికార్డు. ఆ తర్వాత జరిగిన 2023 ఎన్నికల్లోనూ ప్రత్యర్థిని చిత్తు చేస్తూ అవతలి వ్యక్తి కన్నా 60 శాతం ఎక్కువ మెజారిటీతో గెలిచారు. ఈసారి మరింత ప్రభావవంతంగా పనిచేశారు. 2024లో విద్య, వైద్య కమిటీకి చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఇక, 2025 ఎన్నికల్లో ఏకంగా వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు.
ప్రతి వ్యక్తికీ సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాల గురించి ఆమె ఎప్పుడూ మాట్లాడతారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి చేయాల్సిన పోరాటాలెన్నో ఉన్నాయని ఆమె నమ్ముతారు. అందుకే తొలిసారి సెనేట్‌లో అడుగు పెట్టినప్పుడే ‘రైట్ టు కాంట్రాసెప్షన్ యాక్ట్ 2022’ను ప్రవేశ పెట్టారు. గర్భం ధరించాలా వద్దా అన్నది మహిళలు కూడా నిర్ణయించుకోగలిగేలా, వాళ్ల ఆలోచనను బట్టి గర్భనిరోధకాలను వాడే అవకాశాన్ని కల్పించేలా రూపొందించిన చట్టం ఇది. అయితే చట్ట సభలో ఇది ఆమోదం పొందినా, అప్పటి గవర్నర్ దీన్ని తిరస్కరించారు. అయినా మహిళలకు సంతాన హక్కుల విషయంలో ఆమె గొంతుకను వినిపిస్తూనే ఉన్నారు.

అమెరికాలో ఎవరి దగ్గరైనా విచ్చలవిడిగా తుపాకులు ఉండటం వల్ల ఎందరి ప్రాణాలకో నష్టమని, ఈ సంస్కృతిని నిర్మూలించేందుకు తన వంతుగా చేయగలిగినంతా చేస్తానని ఆమె తన హామీల్లో పదేపదే చెప్పారు. దానికి సంబంధించి చేస్తున్న చట్టాల్లో తొలి నుంచీ కీలకంగా వ్యవహరిస్తున్నారు. తుపాకులు జారీ చేసేటప్పుడు వారి నేపథ్యాన్ని పరిశీలించడం మొదలు, దాన్ని జాగ్రత్తగా దాచేందుకు, ప్రమాదకర వ్యక్తుల నుంచి గన్నులను తిరిగి తీసుకునేందుకు, అసాల్ట్ రైఫిల్ (అధిక సామర్థ్యం ఉండే, గుంపులపై దాడికి వాడే గన్) రద్దుకు సంబంధించి తీసుకురావల్సిన చట్టాల మీద ఆమె ఫోకస్ చేస్తున్నారు. మొత్తానికి శాంతియుత సమసమాజాన్ని నెలకొల్పడమే తన ధ్యేయంగా ప్రయాణిస్తున్న ఆమె ఇప్పుడు అందుకున్న కొత్త పదవి ద్వారా దాన్ని సాధిస్తారని ఆశిద్దాం!
డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు 2017 సంవత్సరంలో కొన్ని దేశాలపై అమెరికా ప్రయాణ నిషేధాన్ని విధించారు. వాటిలో ముస్లిం జనాభా అధికంగా ఉండే ఇరాన్, ఇరాక్, లిబియా, సూడాన్, సిరియా, ఎమెన్లాంటి దేశాలున్నాయి. అయితే కేవలం మత ప్రాతిపదికన ఆయా దేశాలపై నిషేధాజ్ఞలు విధించడం అన్యాయమని భావించారు గజాలా! ప్రతి వ్యక్తికీ సమన్యాయం ఉండేలా చట్ట సభలు వ్యవహరించాలనీ, అలా ఉండేందుకు వాటిల్లో తన గొంతుకను తప్పక వినిపించాలనీ ఆమె భావించారు. అదే స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి ప్రవేశించానని చెబుతుంటారు.