ఆమె వచ్చింది. గొంతు సవరించుకుంది. మైకు అందుకుంది. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ప్రపంచం అణువులతోనో, పరమాణువులతోనో నిర్మితం కాలేదు. గెలుపు కథలు, ఓటమి గాథలతో ప్రాణంపోసుకుంది. అలాంటి అనేకానేక జీవితాల్లో ఆమెదీ ఓ కథ. ఇటీవల, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యాన హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ సదస్సులో ‘హౌ టు లివ్ యువర్ బెస్ట్ లైఫ్’ .. జీవితాన్ని అత్యుత్తమంగా జీవించడం ఎలా అనే విషయాన్ని మహిళలకు వివరించారు రాగేశ్వరి లూంబా. ఆమె పాప్ సింగర్, మాడల్, నటి, మైండ్‌ఫుల్‌నెస్ స్పీకర్.
రాగేశ్వరి కెరీర్‌ను కెరటంతో పోల్చవచ్చు. పాప్ సింగర్‌గా యువతరాన్ని ఉర్రూతలూగించింది. ఆమె గొంతుకలోని మార్మికత పాశ్చాత్య సంగీతానికి కొత్త అర్థం చెప్పింది. ఆ గ్లామర్ వెండితెరనూ ఆకర్షించింది. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తొలి చిత్రం ‘అంఖే’ ఓ మెరుపు. ‘మైనే ఖిలాడి తూ అనారీ’ ఓ ఉరుము. అన్నీ అనుకూలించి ఉంటే.. రాగేశ్వరి ముంబైని ఏలేసేది. కానీ పరిస్థితులు వక్రించాయి. బెల్స్ ప్లాస్టీ అనే నరాల వ్యాధి బారిన పడింది. మొహంలో ఓ భాగం పక్షవాతానికి గురైంది. గొంతులో మునుపటి మార్దవం మాయమైంది. “నాకు మద్యం అలవాటు లేదు. ధూమపానం తెలియదు. నా జీవన శైలిలో క్రమశిక్షణా రాహిత్యానికి చోటే లేదు. ప్రపంచంలో ఇంతమంది మనుషులు ఉండగా, ఆ మహమ్మారి నన్నే ఎందుకు వేధించాలి? అని ఎన్నిసార్లు బాధపడ్డానో. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో..” అంటున్నప్పుడు రాగేశ్వరి గొంతులో ఉద్వేగం. ఆ పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదామె.
యోగా, ఫిజియోథెరపీతో రుగ్మతను అధిగమించింది. “సమస్యను ఓ సవాలుగా తీసుకున్నాను. ఆఫ్టరాల్ ఓ వ్యాధిని గెలవలేనిదాన్ని ఈ ప్రపంచాన్నేం గెలుస్తాను? అని నాకు నేను ధైర్యం చెప్పుకొన్నాను. వైద్యానికి నేను స్పందించిన తీరును చూసి నిపుణులు సైతం ఆశ్చర్యపోయారు. వైద్య విద్యార్థులకు పాఠం చెబుతున్నప్పుడు నన్నో కేస్ స్టడీగా తీసుకుంటామన్నారు” అని వివరిస్తారామె. ఆ వ్యాధి తనలోని ఆత్మన్యూనత జాడ్యాన్ని కూడా పోగొట్టిందని చెబుతారు. “ఆకాశం నా హద్దు.. అనుకోవడమూ సరికాదు. ఆకాశానికి పరిమితి ఉంటుంది. కానీ నీ ఆలోచనకు లేదు. ఏ విషయంలోనూ గిరిగీసుకోవద్దు. తలుపులు బార్లా తెరుచుకుని బతకాలి. ఏ క్షణంలో ఏ అవకాశం కుడికాలు మోపుతుందో ఎవరికి తెలుసు?” అంటూ ప్రేక్షకుల్లో స్ఫూర్తిని నింపుతారు. అనారోగ్యం నుంచి పరిపూర్ణంగా బయటపడిన తర్వాత.. అనేక టెలివిజన్ షోస్ చేశారు. కెరీర్ ఊపందుకుంటున్న దశలో లండన్‌లో స్థిరపడిన మానవ హక్కుల న్యాయవాది సుధాంశు స్వరూప్‌తో వివాహమైంది. ఈ దంపతులకు ఓ కూతురు. పేరు సమయ.
తన జీవితంలో థాయ్‌లాండ్ పర్యటన ఓ గొప్ప మలుపని వివరిస్తారు రాగేశ్వరి. ఆ సమయానికి శరీరం కొంత కుదుటపడినా మనసులో మాత్రం అల్లకల్లోలమే. “బ్యాంకాక్‌లో గౌతమ బుద్ధుడిని దర్శించుకున్న తర్వాత నా మనసును తొలిచేస్తున్న సందేహాలన్నీ మబ్బుల్లా తొలగిపోయాయి. దాదాపు నాలుగు వందల ఏండ్ల క్రితం ఇక్కడ ప్రాచీన బౌద్ధారామం ఉండేదట. బంగారంతో చేసిన అతిపెద్ద బుద్ధ విగ్రహం పూజలందుకునేదట. దాన్ని స్వాధీనం చేసుకోవాలని బర్మా సైన్యం కుట్రపన్నింది. ఓ రోజు దాడికి తెగబడింది. ఎంతోమంది సన్యాసులు యుద్ధంలో మరణించారు. అప్పటికే భిక్షువులకు వేగుల ద్వారా విషయం తెలిసింది. విగ్రహంపై నల్లమట్టిని పూశారు. దీంతో బర్మా సైనికులు దాన్ని మామూలు మట్టి బొమ్మగా భావించి వెనక్కి వెళ్లిపోయారు. పోషణ కరువై ఆ బౌద్ధారామం శిథిల స్థితికి చేరుకుంది. మళ్లీ, దాదాపు డబ్భు ఏండ్ల క్రితం తథాగతుని అనుయాయులు ఆ పవిత్ర క్షేత్రాన్ని పునరుద్ధరించే ప్రయత్నం మొదలుపెట్టారు.
ఓ సాధకుడు విగ్రహానికి పూసిన మట్టి పెళ్లలకు బీటలు పడటం గమనించాడు. ఆ వెనకాల పచ్చగా మెరిసిపోతున్నది బంగారమని గుర్తించాడు. ‘మట్టి వెనకాల బంగారం ఉన్నట్టు.. కనిపించే ప్రతి మనిషిలోనూ కనిపించని గొప్పతనం ఉంటుంది. దాన్ని వెలికితీయగలిగితే.. ఎవరికివారు గోల్డెన్ బుద్ధా అవుతారు’ అనే సూక్తి అలా ప్రచారంలోకి వచ్చిందే. ఆ మాట నన్ను మంత్రంలా ప్రభావితం చేసింది. నిజమే, మన చుట్టూ చాలా పరిమితులు ఉంటాయి. వాటి గురించే ఆలోచిస్తూ, ఎవరినో సాకుగా చూపుతూ.. అర్థంలేని ఫిర్యాదులు చేసినకొద్దీ మన మెదడు కుంచించుకుపోతుంది. మనల్ని మనం తెలుసుకోవడానికి విద్య ఓ సాధనం. చదవడం ఆపేస్తే అంతరాత్మ మురికి అద్దంలా మారిపోతుంది. అందుకే, తెల్లవాళ్లు మనల్ని పాలించాలని నిర్ణయించుకోగానే విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం మొదలుపెట్టారు” అంటారామె.
“సర్ రిచర్డ్ బ్రాన్సన్ అనే వ్యాపారవేత్త గురించి మీరు వినే ఉంటారు. సుప్రసిద్ధ వర్జిన్ గ్రూప్ అధినేత అతను. ఆయన కంపెనీల్లో ఎక్కడా ‘నో’ అనే మాట వినిపించదు. బాధ్యతల విషయంలో, ఆవిష్కరణల విషయంలో ఎవరైనా నో చెబితే.. కంపెనీలో అదే చివరి రోజు. ‘ఎస్.. ఎస్.. ఎస్’ అని లక్షసార్లు అనుకుంటారు రిచర్డ్. ఆయనే నాకు స్ఫూర్తి. మన పిల్లల్ని కూడా ఆయనలానే పెంచాలి. పేరెంటింగ్ విషయంలో నేను
ప్రత్యేకించి ఎలాంటి సలహాలూ ఇవ్వను. పిల్లలతో గంటలకొద్దీ గడపమని నేను చెప్పడం లేదు. గడిపిన కొద్ది సమయమైనా.. నాణ్యంగా ఉండాలి. వాళ్లే ప్రపంచం కావాలి. నా బిడ్డ సమయ విషయంలో నేను పాటిస్తున్న సూత్రం ఇదే” .. ఆమె ఉపన్యాసం ముగిసే సమయానికి ప్రతి మహిళా ఓ రాగేశ్వరి
అవుతారు. ప్రపంచాన్ని గెలవడానికి సిద్ధం అవుతారు. చప్పట్ల వర్షం కురిపిస్తారు.. సన్నాహక యుద్ధభేరిలా!