మారథాన్… ఒక సుదీర్ఘమైన పరుగుల పోటీ. శారీరక, మానసిక దృఢత్వం, కఠోర శ్రమ, సమయ నిర్వాహణ, స్థిరమైన అంకితభావం ఉంటేనే ఇందులో విజయం వరిస్తుంది. అలాంటి కఠినమైన మారథాన్‌లో నవ యువకులు కూడా పరిగెత్తలేక అలసిపోతే.. 45 ఏళ్ల వయసులో కూడా అలుపెరగని పరుగుతో ఆదర్శంగా నిలుస్తున్నాడు గుగ్గిలం అశోక్. రవాణా శాఖలో హోం గార్డుగా విధులు నిర్వహిస్తూనే జాతీయ స్థాయి మారథాన్ పోటీల్లో రాణిస్తున్నాడు. అక్టోబర్ 2న పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించ తలపెట్టిన స్వచ్ఛథాన్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన మన తెలంగాణ బిడ్డను ‘బతుకమ్మ’ పలుకరించింది..
చాలామంది పగలంతా ఉద్యోగులు సాయంత్రం ఇంటికి రాగానే.. పగలంతా చచ్చే చాకిరీ అయ్యిందంటూ వాలిపోతుంటారు. ఇంట్లో వాళ్లు ఏ చిన్న పనిచెప్పినా అలసిపోయామని తప్పించుకుంటారు. కానీ గుగ్గిరాల అశోక్ మాత్రం వాళ్లలా కాదు. చెమటలు చిందించడమన్నా.. గ్రౌండ్లో గంటల తరబడి పరిగెత్తడమన్నా ఆయనకు ఎంతో ఇష్టం. అందుకే ఉద్యోగంతో సమానంగా మారథాన్ ప్రాక్టీస్‌కు సమయాన్ని కేటాయిస్తున్నాడు. ప్రతి రోజూ తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర లేచి 10-15 కిలో మీటర్లు పరిగెత్తుతాడు. ఓ వైపు రవాణా శాఖలో విధులు నిర్వహిస్తూనే ఖాళీ సమయంలో పరుగు లంఘించుకుంటాడు. 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, 21 కిలో మీటర్ల హాఫ్ మారథాన్ ఈవెంట్లు ఎక్కడ జరిగినా.. అక్కడ వాలిపోతాడు. కచ్చితమైన పరుగుతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు.
నిజామాబాద్ జిల్లా వేల్పూరుకు చెందిన అశోక్‌కు చదువంటే ప్రాణం. కానీ, కుటుంబ అర్థిక పరిస్థితుల కారణంగా ఆయన చదువు పదో తరగతికే పరిమితమైంది. చదువుకు దూరమైనా క్రీడలకు దగ్గరయ్యాడు. కబడ్డీలో చక్కటి ప్రతిభ కనబరుస్తూ తెలంగాణ నుంచి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. తరువాతి రోజుల్లో రవాణా శాఖలో హోంగార్డుగా ఉద్యోగం చేస్తునే క్రీడలపై తన ఇష్టాన్ని చాటుతూ ఉన్నాడు. తన ప్రతిభతో సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని భావించాడు. ఇందులో భాగంగానే మారథాన్‌ను ఎంచుకున్నాడు. వయసుతో సంబంధం లేకుండా మారథాన్ పోటీల్లో పాల్గొంటూ అందరి మెప్పు పొందుతున్నాడు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించి సత్తా చాటాడు. హోంగార్డుగా పని చేస్తూనే మారథాన్ క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
అశోక్ ఇప్పటి వరకు 40కి పైగా మారథాన్ ఈవెంట్లలో పాల్గొన్నాడు. పాఠశాల స్థాయుల్లో 100, 200, 400 మీటర్ల పరుగు పోటీలతోపాటు కబడ్డీలోనూ తన ప్రతిభను చాటాడు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని చక్కటి ప్రతిభ కనబరిచాడు. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన 5కే రన్ మారథాన్‌లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచిన అశోక్ అలా విజయంతో తన మారథాన్ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, హరియాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కశ్మీర్, మధ్యప్రదేశ్ ఇలా వివిధ రాష్ర్టాల్లో జరిగిన 21, 42 కిలోమీటర్ల మారథాన్ పోటీల్లో పాల్గొని అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
ముఖ్యంగా ముంబయిలో టాటా సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ మారథాన్‌లో పాల్గొని 45 ఏళ్ల కేటగిరిలో విదేశీయులతో పోటీపడి 4వ స్థానం(ఫినిషింగ్ మెడల్) సాధించి తెలంగాణ రాష్ర్టానికి గర్వ కారణంగా నిలిచాడు. ఈ పోటీల్లో అశోక్ ప్రదర్శన ఆయనకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకు వచ్చింది. తన వయసు వాళ్లంతా షుగర్, బీపీలతో సతమతం అవుతూ వాకింగ్ చేయడానికి కూడా బద్ధకిస్తున్న తరుణంలో అశోక్ ఏకంగా పరుగులు తీస్తున్నాడు.
అశోక్ కేవలం క్రీడాకారునిగా కాకుండా సామాజిక బాధ్యతల్లోనూ ముందుంటాడు. గతేడాది కామారెడ్డిలో నిర్వహించిన హాఫ్ మారథాన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి క్రీడల పట్ల యువతలో ఆసక్తిని పెంచేందుకు కృషి చేశాడు. శరీరక శ్రమ వల్లనే జీవనశైలిలో మార్పులొస్తాయని నమ్మే అశోక్ అక్టోబర్ 2న ఏపీలోని అమరావతిలో నిర్వహించే స్వచ్ఛథాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక కావడం మరో విశేషం.
– జూపల్లి రమేష్