చాపకింద నీరులా ఉండే ఉగ్రవాద కార్యకలా పాలు.. ముంబయి పోలీసులకు ఎప్పుడూ తలనొప్పే! నేరాలు- ఘోరాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటాయి. అలాంటి ముంబయిలో లా అండ్ ఆర్డర్‌ను కంటిచూపుతో కంట్రోల్లో ఉంచుతున్నది నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్ అంబిక. ఐపీఎస్‌గా అదరగొడుతూ, అందరి మన్ననలు అందుకుంటున్న అంబిక స్కూల్ డ్రాప్ అవుట్ స్టూడెంట్. బడికి వెళ్లే వయసులోనే ఆమెకు పెండ్లి చేశారు పెద్దలు. టీనేజ్లోనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. తన భర్త కానిస్టేబుల్. ఆయన తన పై అధికారులకు సెల్యూట్ కొట్టడం చూసి ఆశ్చర్యపోయింది. అలాంటి గౌరవం అందుకోవడం కోసం ఐపీఎస్ కావాలనుకుంది. అనుకున్నట్టే ఐపీఎస్ అయింది. జీవితంలో ఆటంకాలను, పోటీ ప్రపంచంలో సవాళ్లను ఆమె అధిగమించిన తీరు అందరికీ ఓ గెలుపు పాఠం.
అంబిక బాల్య వివాహ బాధితురాలు. పద్నాలుగేండ్లు ఉన్నప్పుడు ఓ పోలీస్ కానిస్టేబుల్‌తో ఆమెకు పెండ్లి చేశారు. సంసారమే ఆ అమ్మాయి ప్రపంచం. పద్దెనిమిదేండ్లకే ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది. తన స్నేహితులంతా సరదాగా ఆడుకుంటూ, చదువుకుంటుంటే తాను మాత్రం సంసార బాధ్యతలు మోస్తూ వేరే ప్రపంచం తెలియకుండా బతికింది.
ఓసారి జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఆ వేడుకలు చూసేందుకు అంబిక భర్త వెంట వెళ్లింది. అక్కడ పోలీస్ ఉన్నతాధికారులకు తన భర్త సెల్యూట్ చేయడం ఆమె గమనించింది. ‘వాళ్లకు అలా ఎందుకు సెల్యూట్ చేస్తున్నావ్? వాళ్లు కూడా నీలాగే తిరిగి ఎందుకు సెల్యూట్ చేయట్లేదు!’ అని భర్తను ప్రశ్నించింది. అప్పుడాయన ‘వాళ్లు ఐపీఎస్ అధికారులు. చాలా కష్టపడి చదివి, ఉద్యోగం సాధించారు. పోలీసులందరూ వాళ్ల నిర్ణయాలతోనే పని చేస్తారు’ అని చెప్పాడు. అప్పుడామె ఎలాగైనా ఐపీఎస్ అధికారి కావాలని మనసులో అనుకుంది.
సంసార బాధ్యతలు, ఇద్దరు పిల్లల పెంపకం క్షణం తీరిక ఉండేది కాదు అంబికకు. పైగా సివిల్స్‌కి కోచింగ్ తీసుకునేంత స్తోమత కూడా లేదు. ‘పదో తరగతి కూడా పూర్తిచేయని తాను సివిల్స్ రాయడం ఎలా?’ అని ఆమెకు సందేహం రాలేదు. ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో పుస్తకం పట్టింది. దూరవిద్య విధానంలో పదో తరగతి పూర్తిచేసింది. ఆ తర్వాత రెండేళ్లు కష్టపడి ఇంటర్మీడియెట్ పూర్తిచేసింది.
ఆ వెంటనే డిగ్రీలో చేరింది. డిగ్రీ పూర్తి కాగానే పూర్తిగా సివిల్స్ సాధించే పనిమీదే ధ్యాస పెట్టింది. ‘పిల్లల బాధ్యతను నేను చూసుకుంటాను. నువ్వు సివిల్స్‌పైనే దృష్టి సారించు’ అని భర్త ప్రోత్సహించాడు. తానుండే దిండిగల్ (తమిళనాడు) పట్టణాన్ని వీడి చెన్నై నగరానికి చేరింది. కోచింగ్ తీసుకుంటూ, రాత్రింబవళ్లు కష్టపడి చదివింది. వాళ్లాయన ఉద్యోగం చేస్తూనే ఇద్దరు పిల్లల బాధ్యతలు చూసుకున్నాడు.
యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలు లక్షల మంది రాస్తే.. విజయం వరించేది వందలమందినే! మొదటి ప్రయత్నంలో అంబిక ప్రిలిమ్స్ కూడా దాటలేకపోయింది. రెండో ప్రయత్నం చేయమని ప్రోత్సహించాడు భర్త. చెన్నైలోనే ఉంటూ మరోసారి కష్టపడింది. రెండోసారీ విఫలమైంది. పిల్లలకు దూరంగా ఉంటూ రెండేండ్లు కష్టపడి.. ఇప్పుడు ఉట్టి చేతులతో ఇంటికి వెళ్తే తన ప్రయత్నమంతా వృథా అనుకుంది. ఇంకోసారి ప్రయత్నిస్తానని భర్తతో చెప్పింది. ఆమెకు అండగా నిలిచాడాయన. మూడో ప్రయత్నంలోనూ ప్రిలిమ్స్ గండం దాటలేకపోయింది. ‘ఇక వెనక్కి వచ్చేయ్, పిల్లల్ని చూసుకో’ అన్నాడు భర్త.
సివిల్స్ సాధించే ప్రయత్నంలో మూడుసార్లు విఫలమైనా.. ఆమెలో పట్టుదల సడలలేదు. ‘ఇంకొక్కసారి రాస్తాను. వస్తే వస్తుంది. మరో ప్రయత్నం కోసం అడగను. ఇదే ఫైనల్ అనుకో. ఒకే ఒక్క చాన్స్ ప్లీజ్’ అంటూ భర్తను బతిమాలుకుంది. ఆమె పట్టుదలకు ఆయన పొంగిపోయాడు. ఎంతో కష్టపడిన తన భార్య గెలుపు తీరం చేరడానికి మరోసారి మద్దతుగా నిలిచాడు. ‘సరే నీ ప్రయత్నం నువ్వు చేయి’ అంటూ మరో అవకాశానికి సహకరించాడు.
ఓటమి పాఠాల నుంచి అంబిక కొన్ని గుణపాఠాలు నేర్చుకుంది. మన మెదడు కొన్నిటినే గుర్తు పెట్టుకుంటుందని, అవసరమైనదానినే గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకుంది. కరెంట్ అఫైర్స్ కోసం దినపత్రికలు చదివి, ఏ రోజుకారోజు ముఖ్యమైన సంఘటనలు, వార్తలు నోట్స్ రాసుకునేది. ప్రతి సబ్జెక్టుకు ఏదైనా ఒకే సోర్స్‌ను ఎంచుకోవాలని నిశ్చయించుకుంది. అంతకుముందు రకరకాల సోర్స్‌లను ఎంచుకుని గందరగోళానికి గురైంది.
ఈ దఫా సబ్జెక్టులో ఎవరు నిష్ణాతులో వాళ్లు రాసిన పుస్తకం మాత్రమే చదవడం మొదలుపెట్టింది. అలాగే మాక్ టెస్టులు రాసింది. మాక్ టెస్ట్‌లలో తన బలం, బలహీనతలు అంచనా వేసుకుంది. దానిని బట్టి చదవాల్సిన అంశాలను గుర్తించి, వాటిపై ఎక్కువ శ్రద్ధ చూపింది. రాయాల్సిన పద్ధతులను మెరుగుపర్చుకుంది.
అంబిక నాలుగో ప్రయత్నం (2008)లో ప్రిలిమ్స్ దాటి మెయిన్స్‌కు అర్హత సాధించింది. మెయిన్స్‌లో మంచి మార్కులు తెచ్చుకుని ఇంటర్వ్యూ దాకా వెళ్లింది. ముఖాముఖిలోనూ నిర్ణేతలను మెప్పించి విజయం సాధించింది. ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు ఎంపికైంది. ఆమెను మహారాష్ట్ర క్యాడర్‌కి కేటాయించారు. విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ.. అందరి ప్రశంసలూ అందుకుంది. పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అనడానికి అంబిక కథే ఉదాహరణ. ప్రస్తుతం దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరానికి డిప్యూటీ పోలీస్ కమిషనర్‌గా సేవలు అందిస్తున్న అంబికకు మనమూ సెల్యూట్ చేద్దాం!