‘ఎందుకో తెలంగాణ తల్లడిల్లుతున్నది… ఎందుకో ఈ నేల గోసరిల్లుతున్నది… ఎందుకో నా పల్లెలు మోసపోత ఉన్నవి’ అంటూ ఓ గొంతుక తెలంగాణ కష్టాన్ని ఆలపిస్తున్నది. ఈ గొంతు తెలంగాణ ఉద్యమంలో పాటై ఊరూరూ తిరిగింది. రాష్ట్రం సాకారమైనాంక బతుకు బండి నడుపుకొంటూ తిరిగింది. నేటి తెలంగాణ దుస్థితి.. నాటి ‘పల్లె కన్నీరు పెడుతుందో’ పరిస్థితులను గుర్తుకు తెచ్చింది. అందుకే, గోసరిల్లే తెలంగాణ గొంతుకైండు డెక్క అశోక్. కారు తోలుతూ రైతు కష్టాలు జూసి.. ఆగమైన తెలంగాణ గోసను ఆర్తితో పాడి మళ్లీ మేల్కొలిపే పనికి పూనుకున్నడు. వందకు పైగా గీతాలు రాసి, పాడిన అశోక్ పాటతో పయనం ముచ్చటిది. సదువుర్రి.
చిన్నప్పటి సంది విప్లవ గీతాలు వినుకుంట పెరిగిన. అన్నల పాటలంటే మస్త్ ఇష్టం. గద్దర్ పాటలు బాగ వినేది. గర్జన అన్న ప్రతి పాటా పాడిన. ఆ పాటలతోనే సామాజిక చైతన్యం వచ్చింది. అన్నల పాటలు విని, అదే బాణీలో జనం కష్టాలు పాట కట్టిన.
నా పదో తరగతి అయిపోయింది. తెలంగాణ ఉద్యమం జోరుమీదుంది. అప్పటికే చిన్న చిన్న వేదికల మీద పాటలు పాడిన. రసమయి బాలకిషన్ అన్న ధూం ధాం చేస్తున్నడు. ఆ ప్రభావంతోని మా ఏరియాల గడ్డం సుధాకర్, వెంకటాద్రి, ఎడవెల్లి సూర్యం అన్నలు గూడ ధూం ధాం మీటింగులు పెట్టి పాడుతుంటురి. వాళ్లతో కలిసి పాడుకుంట ఊళ్లు తిరిగిన. జయరాజన్న, సాయిచంద్ అన్నతో కలిసి కొంతకాలం ధూంధాం పాటలు పాడిన. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో వరంగల్ జిల్లా పర్వతగిరి మండంలోని మా ఊరు సోమారంలో ధూంధాం మీటింగ్ పెట్టిన.
పాడితే పడరాని పాట్లు
ఇంటర్మీడియెట్‌లో సొంతంగ పాటలు రాశిన.
‘ఏమైంది అన్నల జాడ.. ఎటుబాయె విప్లవ జ్వాల
నల్లమల అడవుల్లో నెత్తుటి మడుగుల్లో
విత్తనాలు నాటినారా.. పోరాట చరితల్లో పటమైనారా’
పాట బాగుందని ఊరోళ్లందరూ మెచ్చుకున్నరు. డిగ్రీ సెకండ్ ఇయర్లో పార్ట్ టైమ్ జాబ్ చేసి, వచ్చిన డబ్బులతోని నల్లమల పాటని రికార్డ్ చేయించిన. ‘మావోడు పాటవాడిండు. క్యాసెట్ వచ్చింద’ని మా అమ్మానాన్న సంతోషపడ్డరు. గిట్ల పాటలు రాస్తే ప్రాబ్లమ్ అయితదని చానామంది వద్దన్నరు. అన్నట్టే అయింది. మా పెద్దమ్మ కొడుకు ఊళ్లు తిరుగుకుంట కూరగాయలు అమ్ముతుంటె.. ఒక ఎస్ఐ ‘సోమారంలో ఉండే డెక్క అశోక్ తెలుసా? ఎట్లుంటడు? ఏం చేస్తుంటడు?’ అని ఆరా తీసిండు. ‘వాడు మా తమ్ముడే సార్. ఏదో అందరిలెక్క అన్నల పాటలు పాడుతడు. వానికేం తెల్వదు’ అని మా అన్న చెబితే.. ‘వేరే వాళ్ల పాటలు ఎందుకు రాస్తున్నడు? జర జాగ్రత్తగ ఉండమను’ అన్నడంట ఆ పోలీస్. మా అన్న ఇంటికొచ్చి చెప్పిండు. ఆ పాట రిలీజ్ చేయలే. ఇంటెలిజెన్స్ పోలీసోళ్లు వరంగల్ల నన్ను పట్టుకున్నరు. వదిలిపెట్టినా మూడేళ్లు వెంటాడిన్రు. ఎక్కడికి పోయినా వాళ్లకు ముందే చెప్పి పోవాలె. నా పాట రిలీజ్ కాకపోయినా అది అందరి నోళ్లల్ల పడింది. అడవికి చేరింది. ఆ పాట అన్నలకి బాగా ఇష్టమట. అడవి నుంచి వచ్చినోళ్లు ఆ పాట గురించి నాతో చెప్పినరు. ఇక అన్నల పాటలు పాడకుండ, నాకు తోచిన వేరే పాటలు రాసుకుంటున్న.
కారుతో పయనం
కర్ణాటక పోయి రాంకీ కంపెనీల చేరిన. అక్కడ కెవర్ మెషిన్ ఆపరేటర్‌గా పనిచేసిన. కార్ డ్రైవింగ్ నేర్చుకున్న. మల్లా ఊరికొచ్చి.. సొంత కారు తీసుకున్న. అది కిరాయికి తిప్పుతనే పాటలు పాడుతున్న. కొత్త పాటలు రాస్తున్న. ఆపరేషన్ కగార్ అప్పుడు బీశాడి రాజు రాయమంటే ఓ పాట రాసిన.
‘అన్నలు లేకుంట చేస్తరంట
వెన్నెల లేకుంటె ఇక చీకటేగ
ఊరిలోన మీ పేరు తల్సుకోని అన్నలూ
కన్నీళ్లతోని బాధ దాచుకుంటున్నరు గుండెలో’ అని మంచి మంచి చరణాలతో పాట రాసిన. ఆ పాట రికార్డ్ చేసిండు.
ఏ ఊళ్లె చూసినా రైతు గోసే
తెలంగాణ అచ్చిన తర్వాత కేసీఆర్ పాలనల రాష్ట్రం అద్భుతంగ నిర్మాణమైంది. హైదరాబాద్ వచ్చి కారు నడిపిన. ఊళ్ల ఎకరం దున్నుకుని మా వోళ్లు హ్యాపీగా ఉన్నరు. అప్పు చేయలే. రైతుబంధు అచ్చింది. బతుకుతమనే భరోసా ఉండే. ఇప్పుడు కార్ల ఊళ్లు తిరుగుతుంటె.. ఎక్కడ జూసినా రైతు కన్నీళ్లే. ఆ కష్టాలు జూస్తుంటె తెలంగాణ ఉద్యమంల ఉన్నప్పుడు రైతు కష్టాల మీద రాసిన పాట యాదికచ్చింది. ఆ పాటని ఇప్పుడున్న తెలంగాణని చూసి కొంచెం అప్డేట్ చేసిన. తెలంగాణ ఎందుకు తల్లడిల్లుతాంది? ఎందుకు గోసరిల్లుతాంది? ఆశపెట్టి కాంగ్రెస్ మోసం చేసింది. నా పాటల గొప్ప గొప్ప పదాలు లేవు. సామాన్యుడి గోస ఉంది. అందుకే నా పాటల ‘రైతే రాజయ్యే రోజులు రావాలె.. దొంగ నాయకుల పాలన పోవాలె.. బూటకపు మాటల పీఠాలు కదలాలె.. నిజము తెలుసుకుని ముందుకు సాగాలె’ లైన్లు వచ్చినయ్. అది నా ఒక్కడి మాట కాదు. ప్రతీ సామాన్యుడి ఆశా అదే!
రైతు బాగుంటేనే..
పైసల కోసం రాసిన పాట కాదిది. రైతు కోసం రాసిన పాట. రైతు పచ్చగుంటెనే తెలంగాణ బాగుంటది. అందుకే ఈ పాట రాసిన. నా పాట కచ్చితంగ జనాలకు చేరాలె అనుకున్న. ఒకప్పుడు కష్టపడి పది వేలు సంపాదించి నా పాట రికార్డ్ చేయించిన. ఇప్పుడు దాసరి భాస్కర్ (గళం టీవీ భాస్కర్) ఆ కష్టాలు పడుకుంట నా పాటలు రికార్డింగ్ చేసిండు. చిన్నప్పటి నుంచి రాయడం ఇష్టం. ఇష్టపడి రాస్తా, పాడుత. ఎవరికీ పాటను అమ్మలే. పాడేటందుకు పైసలు తీసుకోలే. మందిలోకి నా పాట పోతే చాలు.
– నాగవర్ధన్ రాయల