అమ్మ పెట్టిన ఆవకాయ ఆల్వేస్ అద్భుతః. అన్నంలో ఎర్రగా కలుపుకొని, లొట్టలేసుకొని తింటే.. ఆ క్షణం స్వర్గంలో ఉన్నట్టుంటుంది. అక్కడికే తృప్తిపడలేదు ఆమె! అమ్మ హస్తవాసితో తన చేతి గీతను దిద్దుకుంది. అమ్మ చేసిన సంప్రదాయ వంటకాలను సామాజిక మాధ్యమాల వారధిగా విదేశాలకు ఎగుమతి చేయడం మొదలుపెట్టింది. మారు మూల పల్లె ఘుమఘుమల్ని అమెరికాలోని తెలుగువాళ్లు ఆఘ్రాణించేలా బ్రాండ్
నెలకొల్పింది. ‘ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు’ పేరుతో పచ్చళ్లు, పిండివంటలు, పొడులు తయారు చేయించి ఏడాదికి కోటికిపైగా టర్నోవర్ సాధిస్తున్నది. సాఫ్ట్వేర్ కొలువును వదిలిపెట్టి.. పచ్చళ్ల వ్యాపారంలో పైపైకి ఎదుగుతున్న చిలువేరు సాహితి నయా జర్నీ ఆమె మాటల్లోనే..
మాది మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రం. ఆ ఊళ్లోనే నాన్న సత్యనారాయణ కిరాణా షాపు నిర్వహిస్తారు. అమ్మ కన్యాకుమారి గృహిణి. వంటలు చాలా బాగా చేస్తుంది. నన్ను, మా ఇద్దరు అన్నలను వాళ్లు ఎంతో కష్టపడి చదివించారు. మేడ్చల్‌లోని మల్లారెడ్డి కాలేజీలో 2019లో బీటెక్ చేశాను. అదే సంవత్సరం క్యాంపస్ సెలక్షన్స్‌లో టీసీఎస్‌లో జాబ్ వచ్చింది. ఇంట్లో వాళ్లు హ్యాపీ.. నేను కూడా సంతోషపడ్డా. కానీ, ఎంత కష్టపడ్డా మనసుకు ప్రశాంతత ఉండేది కాదు. 2020లో కరోనా సమయంలో ఇంటికి వచ్చినప్పుడు ఖాళీ సమయంలో ఇంట్లో అమ్మ చేసే వంటకాలతో రీల్స్ చేసేదాన్ని. ఓ రోజు అమ్మ పెట్టిన ఆవకాయ రీల్ వైరలైంది.
చాలామంది అమ్ముతారా అని అడిగారు. అప్పుడు వచ్చింది ఈ ఆలోచన. వెంటనే కొన్ని పచ్చళ్లు చేసి అడిగిన వారికి పంపించాం. అలా నా స్టార్టప్ జర్నీ మొదలైందన్నమాట. కానీ, చాలామంది ‘పచ్చళ్లు అమ్ముకొని ఏం సాధిస్తారు. మీతో ఇది అయ్యే పనేనా?’ అని హేళన చేశారు. ఆ మాటలతో మాలో పట్టుదల ఇంకా పెరిగింది. కేఎఫ్‌సీ చికెన్ ఎక్కడినుంచో వచ్చి మన దగ్గర బిజినెస్ చేస్తున్నది. అలాంటప్పుడు మన తెలుగు సంప్రదాయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా రీచ్ ఎందుకు ఉండొద్దు అనుకున్నా! అలా అమ్మ చేసిన పచ్చళ్లు, పిండి వంటల వీడియోలు ఇన్‌స్టాలో పోస్టు చేయడం మొదలుపెట్టాను. మాకు వచ్చే ఆర్డర్ల సంఖ్య కూడా పెరిగింది. మాకంటూ ఒక బ్రాండ్ ఉండాలని 2022లో ‘ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు’ మొదలుపెట్టాం.
మా వినియోగదారుల్లో సింహభాగం విదేశాలకు చెందినవాళ్లే ఉన్నారు. దేశదేశాల్లో స్థిరపడిన తెలుగువాళ్లు నా ఇన్‌స్టా చూసి ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎప్పుడో విదేశాలకు వెళ్లి అక్కడే ఉంటున్నవాళ్ల పేరెంట్స్ ఇప్పుడు వాళ్లకు కావాల్సిన పిండివంటలు, పచ్చళ్లు పంపించే పరిస్థితిలో ఉండరు. అలాంటి వాళ్లంతా ఇప్పుడు ‘ప్లేవర్స్ ఆఫ్ తెలుగు’ బ్రాండ్ యూజర్లుగా మారారు. మంచి ఫీడ్‌బ్యాక్ కూడా ఇస్తున్నారు. మునుపు వేల సంఖ్యలో ఉన్న నా ఇన్‌స్టా హ్యాండిల్ ఫాలోవర్ల సంఖ్య ఇప్పుడు 2.27 లక్షలకు పెరిగింది. మాకు వచ్చే ఆర్డర్లలో ఇన్‌స్టా నుంచి వచ్చేవే ఎక్కువ! ఒక్కసారి మా బ్రాండ్ రుచి చూసివాళ్లు మళ్లీ మళ్లీ ఆర్డర్ పెడుతున్నారు.
‘మా అమ్మ చేసినట్టు ఉంద’ని, ‘మా నానమ్మను, అమ్మమ్మను గుర్తు చేశార’ంటూ కామెంట్లు చేస్తున్నారు. విదేశాల్లో వాళ్ల స్నేహితులకు సైతం మా ఫ్లేవర్స్ రిఫర్ చేస్తున్నారు. మొదట్లో నెలకు 50 ఆర్డర్లు వచ్చేవి. ఇప్పుడు ప్రతిరోజూ 50కి పైగానే వస్తున్నాయి. అమ్మపెట్టిన ఆవకాయతో మొదలైన మా జర్నీ ఇప్పుడు వంద ప్రొడక్ట్స్‌కు చేరువైంది. పండుగ సమయాల్లో అస్సలు తీరిక ఉండదు. గత సంక్రాంతికి 15 రోజుల్లో దాదాపు 500 కిలోల ఆర్డర్లు డెలివరీ చేశాం. ఇవన్నీ విదేశాలకు ఎగుమతి చేసినవే! యూకే, కెనడా, యూఎస్, జర్మనీ, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ ఇలా తెలుగువాళ్లు ఉండే దాదాపు పదికిపైగా దేశాల్లో మా కస్టమర్లు ఉన్నారు.
ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చుట్టూ ఉన్నవాళ్లు ప్రోత్సహించక పోగా, హేళనగా చూశారు. ‘ఏసీ కింద కూర్చుని ఉద్యోగం చేసుకోక.. ఈ పిల్లకు ఏమైంది’ అనుకున్నారు. కానీ, ఉద్యోగంలో లేనిది, ఈ బిజినెస్‌లో నాకు దొరికింది ప్రశాంతత! ఏడాదికి ఆరు లక్షల ప్యాకేజీ తీసుకున్నా! ఇప్పుడు.. ఆడుతూ, పాడుతూ నెలకు పదిలక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నా! ఖర్చులు, జీతాలు పోగా నెలకు దాదాపు 15 శాతం లాభం వస్తున్నది. మా గ్రామానికి చెందిన పదిమంది మహిళలు మా దగ్గర పనిచేస్తున్నారు. వాళ్లు చేసే పనినిబట్టి వేతనాలు ఇస్తున్నా! పది కుటుంబాలకు ఆసరాగా నిలిచానన్న సంతృప్తి కూడా ఉంది. మా దగ్గర ఆవకాయ, నిమ్మకాయ, ఉసిరికాయ, రేగుపండ్ల పచ్చడి ఇలా 20 రకాల పచ్చళ్లు తయారు చేస్తున్నాం. సీజన్‌ను బట్టి పచ్చళ్లు మారుతుంటాయి. అప్పడాలు, వడియాలు అమ్ముతున్నాం. పులిహోర మిక్స్, పల్లికారం, నువ్వుల కారం, మసాలా కారం, ఇతర పొడులు, స్వీట్లు ఇలా వంద రకాల ఉత్పత్తులు తయారుచేస్తున్నాం. వచ్చిన ఆర్డర్‌ను బట్టి అప్పటికప్పుడు పదార్థాలు తయారుచేస్తుంటాం.
మంచిర్యాల డీటీడీసీ కొరియర్ ద్వారా పంపితే.. వాళ్లు డీహెచ్ఈఎల్, యూపీఎస్ ద్వారా విదేశాలకు చేరవేస్తున్నారు. ఇప్పుడు విదేశాలతోపాటు మనదేశంలో వివిధ రాష్ర్టాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలోనే మార్కెటింగ్ చేస్తుండటం కారణంగా మాకు కలిసివస్తున్నది. ఇప్పటికైతే నెన్నెలలోనే రెండు గదుల్లో వ్యాపారం నిర్వహిస్తున్నా! రానున్న రోజుల్లో మంచిర్యాలలో పెద్దగా ప్రారంభించాలనే ఆలోచన ఉంది. వినియోగదారుల ఆదరణ లభిస్తే వ్యాపారాన్ని మరింత విస్తరిస్తాం. దానిద్వారా మరింత మందికి ఉపాధి కల్పించవచ్చు కదా!
– గుళ్లపెల్లి సిద్ధార్థ గౌడ్
– మాదరబోయిన శ్రీనివాస్