ఇంటి పక్కనున్న దుకాణంలో కావాల్సిన సమాన్లు ఉండగా ఆఫర్లో వస్తుందని చాలామంది 30 కిలోమీటర్ల దూరంలోని డీమార్ట్‌కు వెళుతుంటారు. అంత దూరం వెళ్లాక ఆఫర్ లేకపోతే ఉసూరుమంటారు. సండే వచ్చిందంటే చాలామంది తమ వీధి చివరన రుచికరమైన భోజనం అందించే హోటల్ గురించి తెలియక.. 10 కిలోమీటర్ల దూరంలోని రెస్టరెంట్‌కు పరుగులు తీస్తారు. బోలెడంత సమయాన్ని వచ్చించి అంతదూరం వెళ్లాక.. అక్కడి బిల్లును చూసి బెంబెలెత్తిపోతారు. అలాంటి పరిస్థితే ఎదురైంది ఓ 26 ఏళ్ల యువకుడికి. అన్నీ మన చుట్టే దొరుకుతుండగా దూరం వెళ్లి సాధించేదేముందని తలచిన చెరుకూరి శ్రీహర్ష ‘వైబ్నియర్’ యాప్‌తో ముందుకొచ్చాడు. మన నుంచి పది కిలోమీటర్ల లోపు అందుబాటులో ఉన్న సేవల సమాచారాన్ని అందిస్తున్న ఆ యాప్ విశేషాలను శ్రీహర్ష ‘బతుకమ్మ’తో ఇలా పంచుకున్నాడు..
నా చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. అమ్మానాన్నలిద్దరూ టీచర్లు కావడంతో చదువుతోపాటు క్రమశిక్షణ కూడా నాకు అబ్బంది. ఇటీవలే మాస్టర్ ఇన్ పబ్లిక్ పాలసీలో డిగ్రీ పట్టా పొందాను. పెరిగిందంతా హైదరాబాద్‌లోనే కాబట్టి ఇక్కడి వాతావరణం, ప్రత్యేకతలన్నీ తెలుసు. అదే మా ఒంగోలుకు వెళితే మాత్రం అంతా కొత్తగా అనిపించేది. చుట్టు పక్కలున్న పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలన్నా, హోటల్‌కెళ్లి ఇష్టమైన ఫుడ్ తినాలన్నా చాలా ఇబ్బందిపడేవాన్ని. గూగుల్‌లో వెతికినా లోకల్ అడ్రస్‌లు కనిపించేవి కావు. మేము ఉంటున్న ఇంటికి చాలా దూరంలో ఉన్నవాటి సమాచారం మాత్రమే ఉండేది. ఒకసారి దుస్తులు కొనుక్కోవాలని ఆఫర్ల కోసం వెతుక్కుంటూ చాలా దూరం వెళ్లాను. తీరా కొన్నాక మా ఇంటి చివర ఉన్న షాపులోనూ మంచి డిస్కౌంట్ ఉందని తెలియడంతో తెల్లమొహం వేశాను.
ఇంటి దగ్గర మాత్రమే కాకుండా ఈ విచిత్రమైన సంఘటనలు హైదరాబాద్‌లోనూ ఎదురైయ్యాయి. కాలేజీలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది నాన్ అకాడమిక్ క్లబ్‌లు నిర్వహించేవాళ్లు. కానీ, అవి ఎక్కడెక్కడ జరుగుతున్నాయనే విషయం మాత్రం అందరికి తెలిసేది కాదు. సాంకేతికత ఇంతగా పెరిగిన రోజుల్లోనూ… మనచుట్టూ ఉన్న ప్రదేశాలు మనకే కనిపించకుండా ఉండటం ఏదో లోపంగా అనిపించింది. నాకొక్కడికే కాదు అమెరికాలో ఉన్న నా ఫ్రెండ్స్‌ను అడిగితే కూడా అక్కడ కూడా అదే పరిస్థితి ఉందని వారి అభిప్రాయాలు చెప్పారు.
ఎక్కడెక్కడో ఉన్న ప్రదేశాలను తెలుసుకోవడం కన్నా.. మన పరిసరాల్లో ఉన్న ప్రదేశాలను తెలుసుకోవడం ముఖ్యమని తలిచాను. ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే వైబ్నియర్(vibenear) యాప్. జూన్‌లో యాప్ రూపకల్పనకు అడుగులు పడ్డాయి. ఈ దసరాకు లాంచ్ చేశాం. ప్రధానంగా మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మా యాప్ ఉపయోగపడుతుంది. హైదరాబాద్‌లోని కోకాపేట్, గండిపేట, నానక్‌రాంగూడ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో ఇప్పటివరకు మా యాప్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గూగుల్‌లో వివిధ మాల్స్, హోటల్స్, హాస్పిటల్స్ వివరాలు ఉండవని కాదు! అయితే, మా యాప్ విషయానికి వస్తే.. అక్కడ ఎలాంటి ఆఫర్లు ఉన్నాయి? ప్రత్యేకతలు ఏమిటి? జరుగుతున్న ఈవెంట్లు తదితర వివరాలన్నీ తెలుసుకోవచ్చు.
ప్లేస్టోర్‌లో యాప్‌ను ఇన్స్టాల్ చేసుకొని మనకు కావాల్సిన విభాగాన్ని ఎంచుకోవాలి. ఇందులో ప్రధానంగా ఫుడ్, ఫ్యాషన్, ఈవెంట్స్, కాలేజ్ అండ్ నెట్వర్కింగ్, రీక్రియేషనల్ స్పెసేస్, కిడ్స్ అండ్ ఫ్యామిలీ, పర్సనల్ కేర్ ఇలా ఏడు విభాగాలు అందుబాటులో ఉంచాం. యూజర్ ఉన్న లొకేషన్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఏడు కేటగిరీల్లో దేని గురించైనా పూర్తి సమాచారం యాప్ ద్వారా పొందొచ్చు. ఫలానా హోటల్లో రెసిపీలు, ధరలు, ఆఫర్లు ఇలాగన్నమాట. వినియోగదారుల సమయంతో పాటు డబ్బును కూడా ఆదా చేయడం లక్ష్యంగా ఈ యాప్ పనిచేస్తుంది. ఇప్పుడిప్పుడే ప్లేస్టోర్‌లో ఈ యాప్ పుంజుకుంటున్నది.
ఇప్పటివరకు కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న లొకేషన్లు మాత్రమే అప్లోడ్ చేస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని సేవలందించేందుకు టీ హబ్ సహకారానికి ప్రయత్నిస్తున్నాను. హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన ఈ యాప్‌ను దేశవ్యాప్తంగా విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నా. కేవలం కార్యక్రమాల వివరాలు తెలపడమే కాకుండా, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎవరు విషయాలు కూడా మా యాప్ నుంచి పొందొచ్చు. మొత్తంగా ఈ యాప్ దగ్గరుంటే.. మనకు అత్యంత సమీపంలో ఉన్న సేవల వివరాలు ఇట్టే తెలిసిపోతాయి.
– రాజు పిల్లనగోయిన