‘ఊరు చాలా ఇచ్చింది. తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే లావైపోతాం’ శ్రీమంతుడు సినిమాలో ఫేమస్ డైలాగ్ ఇది. ఊరికి రుణపడ్డ హీరో.. ఆ రుణం తీర్చుకోవడానికి ముందుకొస్తాడు. కానీ, అసలైన శ్రీమంతులు వీళ్లు. ఈ యువకులకు ఎవరూ, ఏదీ ఇచ్చింది లేదు. వాళ్లూ ఏదీ తీసుకుంది లేదు. అయినా.. ఇచ్చేస్తున్నారు. చదువుకుంటూనే ఎక్కడెక్కడి సమస్యలనో తెలుసుకుంటున్నారు. ఆ కష్టాలను కడతేరుస్తున్నారు. కొంతమంది యువకుల ఆలోచనల్లోంచి మొదలైన స్ట్రీట్ కాజ్ సంస్థ నేడు సేవాపథంలో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నది. వారి కృషికి మెచ్చి ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఆ సంస్థకు అడ్వైజర్‌గా ఉండేందుకు ముందుకొచ్చారు. చీకటి జీవితాల్లో వెలుగులు పంచుతున్న జెన్ జీ శ్రీమంతుల అడ్డా.. స్ట్రీట్ కాజ్ ప్రస్థానమిది.
అసమానమైన శక్తిసామర్థ్యాలు కలిగిన విద్యార్థులు సమాజహితం కోసం పాటుపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూడాలనుకున్నాడు అఖిలేష్ జూకారెడ్డి. కనీస అవసరాలకు దూరంగా జీవిస్తున్న వారికి తమవంతుగా చేయూతనివ్వాలని ఓ నలుగురైదుగురు మిత్రులు సంకల్పించారు. అలా 2009లో శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో స్ట్రీట్ కాజ్కు పునాది వేశారు. మొదట్లో తమ పాకెట్ మనీ, సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఇచ్చే కొంత డబ్బుతోనే సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. 2011లో తాము చేసే ఈ సేవలో పెద్ద ఎత్తున విద్యార్థులను భాగస్వామ్యం చేయాలనే ఉద్ధేశంతో పరిమాణా అనే మెగా కాంపెయిన్ ప్రారంభించారు. అందరు కలిసి నిధులను సేకరించారు. క్రమంగా వ్యవస్థాపకులు ఉద్యోగాల్లో స్థిరపడినా కూడా ఈ సేవా కార్యక్రమాలు ఆగొద్దనే భావనతో తరువాతి తరాల విద్యార్థులకు ఆ బాధ్యతలు అప్పగించారు. అలా అది వారసత్వంగా నేటికీ కొనసాగుతున్నది.

చేసే కార్యక్రమాలు పెరగడంతో నిధుల కొరత కూడా వెంబడించింది. తమ అవసరాలకే కుటుంబ సభ్యులపై ఆధారపడే విద్యార్థులు వాళ్లు. అయితేనేం, సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చని నిరూపించారు. స్ట్రీట్ కాజ్‌ను ముందుకు తీసుకువెళ్లడం కోసం రన్ ఫర్ ఏ కాజ్ (ఆర్ఎఫ్సీ) ఈవెంట్లను నిర్వహించడం ప్రారంభించారు. 2015 నుంచి ఫండింగ్ కోసం ఆర్ఎఫ్సీ పేరిట ఈవెంట్లు నిర్వహిస్తూ ఆ డబ్బుతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల ఈ టీమ్ ఎల్బీ స్టేడియంలో ఓ ఈవెంట్ నిర్వహించింది. దీనికి రాక్ స్టార్ అర్మాన్ మాలిక్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా రూ.2.9 కోట్ల నిధులు సమకూర్చుకున్నారు వీళ్లు. దాండియా మహోత్సవ్, ఎకో డాంటా, మ్యూజికాన్, మారథాన్ మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తూ నిధులు సేకరించి.. సమాజ సేవకు వెచ్చిస్తున్నారు.

కష్టాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్లిపోతారు స్ట్రీట్ కాజ్ సభ్యులు. రోడ్డులేని గ్రామాలు, బడిలేని ఊర్లు, నీటి వసతి, కరెంట్ సౌకర్యం లేని తండాలకు తరలి వెళ్తారు. ఆ సమస్యను అక్కడే ఉండి పరిష్కరిస్తారు. అక్కడికి చుట్టుపక్కల ఉన్న సమస్యలనూ చక్కబెడతారు. ఉదాహరణకు ములుగు జిల్లా తక్కెళ్లగూడెంలో నీటి ఎద్దడి వీళ్ల దృష్టికి వచ్చింది. తాగునీరు కోసం అక్కడి ప్రజలు కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి. అంతదూరం వెళ్లలేక సతమతవుతున్న అక్కడి ప్రజలకు వాటర్ వీల్స్ ఇచ్చి ఆదుకున్నారు. అంతేకాదు చీకట్లో ఉన్న ఆ ఊరికి సోలార్ విద్యుత్ వెలుగులు ప్రసాదించారు. పాఠశాలకు మరమ్మతులు చేయించారు. అక్కడితో తమ పని అయిపోయిందనుకోలేదు. మూడు నెలలకు ఒకసారి అక్కడికి వెళ్లి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుంటున్నారు.

ఇప్పటివరకు రూ.6 కోట్ల వ్యయంతో 13 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది స్ట్రీట్ కాజ్. ప్రస్తుతం 4500పైగా విద్యార్థులు వలంటీర్లుగా పనిచేస్తున్నారు. కొంతమంది బృందంగా ప్రారంభించిన ఈ సంస్థ నేడు హైదరాబాద్‌లోని 35 కళాశాలలతో పాటు వరంగల్, ఢిల్లీ, ముంబై, పూణె, విశాఖపట్నం, కోయంబత్తూరు, బెంగళూరు, చెన్నై, కొచ్చి ప్రాంతాల్లోని కాలేజీ విద్యార్థులనూ భాగస్వాములను చేసుకుంది. పూర్వ విద్యార్థులు ఆర్థికంగా దన్నుగా నిలుస్తున్నారు. ఫండింగ్ కోసం ఈవెంట్లు ఉండనే ఉన్నాయి. సేవే లక్ష్యంగా సాగుతున్న స్ట్రీట్ కాజ్ 2030కల్లా దేశంలోని 30 నగరాలకు విస్తరించాలనే సంకల్పంతో ముందుకుసాగుతున్నది.
స్ట్రీట్ కాజ్లో మూడు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకున్నాం. వాటిలో పర్యావరణ పరిరక్షణ, జంతువుల సంరక్షణ, నీటి సంరక్షణ ముఖ్యమైనవి. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు వీటిపై అవగాహన కల్పిస్తున్నాం. నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో భాగంగా ఏటా హైదరాబాద్ యూత్ అసెంబ్లీ నిర్వహిస్తున్నాం. మేము చేసిన సేవకు చేతులు ఎత్తి వాళ్లు దండం పెడుతున్నారు. జీవితానికి ఇంతకంటే ఇంకేం కావాలి. స్ట్రీట్ కాజ్కు కేటీఆర్ అడ్వైజర్‌గా ఉండటం మాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
– విజయ్, వలంటీర్
– రాజు పిల్లనగోయిన