ఇండోర్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఇండోర్‌లో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద నీటి సరఫరా కోసం కొత్తగా వేసిన పైప్‌లైన్‌ను పరీక్షిస్తున్న సమయంలో అక్కడి రోడ్డు కుంగిపోయింది. గోరాకుండ్లో దాదాపు మూడేండ్ల క్రితం రూ.40 కోట్ల వ్యయంతో ఈ రోడ్డును నిర్మించారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలో రోడ్డుపై సాధారణ ట్రాఫిక్ ఉండగా, ఒక్కసారిగా కింద నుంచి నీరు ఉధృతంగా వచ్చి రోడ్డు కుంగిపోవడం స్పష్టంగా కనిపిస్తున్నది.
ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు వెళ్తున్నాయి. ఈ ఘటనలో ప్రమాదమేమీ జరగకపోయినా, ఆందోళనకు గురైన అక్కడివారు తమ వాహనాలను వదిలేసి పరుగులు తీశారు. నీటి పీడనం కారణంగా తారు, బ్లాకులు ఊడిపోయి చాలా దూరం వరకూ ఎగిరిపడ్డాయి. రోడ్డు మధ్యలో భారీ గుంత ఏర్పడింది. గోరాకుండ్ ప్రాంతంలో తాగునీటి పైప్‌లైన్ వేశారు. దీనిని అనుసంధానించిన తర్వాత ఇంజినీర్లు పరీక్షిస్తుండగా, ఈ ఘటన చోటుచేసుకుంది. నాణ్యత లేని రోడ్డు నిర్మించారంటూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్థానికులు ఎండగడుతున్నారు.