శాన్ఫ్రాన్సిస్కో, ఆగస్టు 18: టీనేజర్ల కోసం ఓపెన్ఏఐమొదటి తరం చాట్‌జీపీటీ వెర్షన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే స్కూల్ పని, రోజువారి జీవితం, పాఠ్యాంశ సంబంధ ప్రశ్నలకు వీటిని ఉపయోగిస్తున్న వారిలో కృత్రిమ మేధ స్థాయిని పెంచేందుకు ఈ కొత్త వెర్షన్ ఉపయోగపడుతుందని ఓపెన్ఏఐ తెలిపింది. 13 నుంచి 17 మధ్య వయసు బాలల కోసం మంగళవారం దీనిని విడుదల చేసినట్టు ఈ కంపెనీ వెల్లడించింది. అయితే ఇందులోని కంటెంట్‌పై కొన్ని పరిమితులు కూడా విధించినట్టు తెలిపింది.
ముఖ్యంగా ఆత్మహత్య, స్వీయ హాని, ప్రేమ, లైంగిక సంబంధ చాట్స్‌పై పటిష్టంగా పరిమితులు విధించామని నిర్వాహకులు పేర్కొన్నారు. కేవలం పాఠ్యాంశ ప్రశ్నలకు సమాధానాలు, పాఠశాల వ్యాసాలను యథాతథంగా వల్లెవేయడానికి బదులుగా హోమ్‌వర్క్, పాఠ్యాంశాలు చురుకుగా అభ్యసించేందుకు సహకరించే విధంగా దీనిని తీర్చిదిద్దామని తెలిపారు. కృత్రిమ మేధను ఆరోగ్యకరంగా వినియోగించేందుకు వీలుగా కేవలం బాలల కోసమే దీనిని తయారు చేశామన్నారు.