ఖండ్వా, ఆగస్టు 18: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో ఒక బహిరంగ విచారణ కార్యక్రమానికి ఒక వ్యక్తి శునకం మాస్క్‌తో హాజరై భౌ.. భౌ అని అరుస్తూ అధికారుల తీరుపై వినూత్నంగా నిరసన తెలిపాడు. మున్సిపల్ కార్పొరేషన్ విపక్ష నేత దీపక్ ముల్లు రాథోడ్ నేతృత్వంలో కొంతమంది యువకులు వేదిక వద్దకు వచ్చారు.
అందులో ఒక యువకుడు శునకం మాస్క్‌తో అధికారులపై భౌ బౌ అంటూ అరవడం ప్రారంభించారు. దీంతో అక్కడున్న వారందరూ షాక్ తిన్నారు. నగరంలో జంతువుల స్టెరిలైజేషన్ పేరుతో తీవ్ర అవకతకవలు జరిగాయంటూ మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంజయ్ శుక్లాను ఉద్దేశించి రాథోడ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ పథకం అమలులో పూర్తి పారదర్శకత లోపించిందని విమర్శించారు. కాగా, స్టెరిలైజేషన్‌పై వచ్చిన ఆరోపణలను ఈఈ ఖండించారు. దీనికి సంబంధించిన అన్ని వివరాలతో కూడిన డేటాను ప్రజల ముందు ఉంచుతామని ఆయన తెలిపారు.