పేదలంటే లెక్కలేదు.. అదే పెద్దలంటే ఎక్కడా లేని వణుకు.. సామాన్యులపైకి సర్కార్ బుల్డోజర్లు దండెత్తుతాయి.. అదే బడాబాబులైతే తోకముడుస్తాయి. ‘హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్సిటీ) ప్రాజెక్టులో రేవంత్ ప్రభు త్వం ఇదే రీతిన వ్యవహరించింది. కేబీఆర్ పార్ చుట్టూ 7 ఫ్లై ఓవర్లు, 7 అండర్ పాస్‌ల నిర్మాణానికి ఆర్భాటంగా శ్రీకారం చుట్టి.. పర్యావరణవేత్తలు మొత్తుకుంటున్నా వందలాది చెట్లను అడ్డంగా నరికి, రోడ్డును ఇష్టారీతిన తవ్విపడేసింది.. ఇప్పుడు పార్కు చుట్టూ కాంగ్రెస్ పెద్దలు, బడాబాబుల ఇండ్లు, విలువైన స్థలాలు పోతాయని వెనక్కితగ్గి ఏకంగా ప్రాజెక్టునే రద్దు చేసింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : అభివృద్ధి పేరుతో నిరుపేదలు, సామాన్యుల ఇండ్లపైకి కనికరం లేకుండా రాత్రికిరాత్రి హైడ్రా బుల్జోజర్లు దింపి రోడ్డుకీడ్చిన కాంగ్రెస్ సర్కార్.. ప్రముఖులు, సొంత పార్టీల నేతల విషయంలో మాత్రం వెనుకడుగు వేసింది. ‘చట్టం అందరికీ ఒక్కటే.. ఆక్రమణలు ఎక్కడున్నా బుల్డోజర్లు దిగాల్సిందే, ప్రజాప్రయోజనాల కోసం భూములు ఇవ్వాల్సిందే’ అని గొప్ప గొప్ప మాటలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. చేతల్లో మాత్రం చూపించరని హెచ్ సిటీ ప్రాజెక్టుపై యూటర్న్‌తో తేలిపోయింది. ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించాలనుకున్న 7 ఫ్లై ఓవ ర్లు, 7 అండర్‌పాస్‌లను ప్రభుత్వం అకస్మాత్తుగా రద్దు చేసింది.
ఇటీవల జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలోనూ ఆమోద ముద్ర వేశామని స్వయంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సోమవారం కేబీఆర్ పార్క్ పర్యటనలో వెల్లడించారు. వాటి స్థానంలో పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు ఒకే ఒక్క ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే చాలని నిర్ణయించింది. రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద దుమారం రేపుతున్నది. పార్క్ చుట్టూ ఉన్న ప్రముఖులు ఆస్తులను కాపాడేందుకే డైవర్షన్ వ్యూహాన్ని అ మలుచేస్తున్నది. మూసీ అభివృద్ధి, చెరువుల పునరుద్ధరణ పేరుతో పేదల ఇండ్లను, ఎకరాలకొద్దీ సాగుభూమిని బలవంతంగా లాకొనే సరార్.. హెచ్ సిటీ ప్రాజెక్టు విషయంలో మాత్రం పెద్దల ముందు తోకముడవటంపై నగర జనం భగ్గుమంటున్నది.
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ చికులను తొలగిస్తామని ‘హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్ సిటీ) ప్రాజెక్టు కింద కేబీఆర్ పార్ చుట్టూ 7 ఫ్ల్లై ఓవర్లు, 7 అండర్ పాస్‌ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సరిగ్గా రెండేండ్ల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై యూటర్న్ తీసుకొని కేవలం జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి నాగార్జున సర్కిల్ వరకు ఒకే ఒక ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే చాలు అని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
ప్రారంభం సమయంలోనే ప ర్యావరణవేత్తలు, వాకర్స్ తీవ్ర అభ్యంతరం తెలిపినా సరే, ముందస్తుగా భూ సేకరణ జరుపకుండా ప్రభుత్వం ప్రాజెక్టు వైపే మొగ్గుచూపింది. అధికారంగా 1,500, అనధికారికంగా 3వేల భారీ వృక్షాలను అడ్డగోలుగా నరికేసి పర్యావరణ విధ్వంసానికి తెగబడింది. సర్కార్ చేసిన ఈ విధ్వంసంపై సుప్రీంకోర్టు సైతం మొట్టికాయలు వేసింది. ఈ క్రమంలో ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్ చుట్టూ వన్-వే అమలు చేసింది. ‘చూశారా? వన్-వే పెట్టగానే ట్రాఫిక్ చికులు వీడిపోయాయి. రూ.400 కోట్లకు పైగా ప్రజాధనం ఆదా అవుతుంది’ అని చెప్తూ, ఇప్పుడు ఏడు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల ప్రతిపాదనల స్థానంలో కేవలం ఒకే ఒక ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తే సరిపోతుందని ప్రకటించారు.

కేబీఆర్ పార్ చుట్టూ విస్తరణ చేపట్టాలంటే దాదాపు 450కి ప్రైవేట్ ఆస్తులు, స్థలాలను భూసేకరణ చట్టం ప్రకారం సేకరించాల్సి ఉంటుది. ఇందులో భా గంగానే ఆరు జంక్షన్ల వద్ద చేయాల్సిన స్థల సేకరణతోపాటు విరించి హాస్పిటల్, ఎన్ఎఫీసీ, టీవీ 9 జంక్షన్లతో కలుపుకొని కేవలం స్థల సేకరణకు రూ.1,543.82 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు లెకలు లేశారు. కానీ జీహెచ్ఎంసీ వద్ద వెచ్చించేందుకు అంత మొత్తంలో నిధులు లేవు. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే తప్ప, స్థల సేకరణ అసాధ్యమని తేల్చారు. ఇదే సమయంలో టీడీఆర్‌లకు భూ యజమానులు ససేమిరా అంటూ వచ్చారు. మరోవైపు దాదాపు 50కి పైగా వివిధ న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. అన్నింటి కంటే భూసేకరణే సవాల్‌గా మారింది.
ఇదే సమయంలో సొంత పార్టీ నేతల నుంచే తిరుగుబావుటా ఎగురవేశారు. మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి సంబంధించిన 250 గజాల స్థలం, హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చెందిన 377 గజాలు, మాజీ మంత్రులు సమరసింహారెడ్డి, షబ్బీర్ అలీ, కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డికి సంబంధించి ఒక్కొక్కరిదీ దాదాపు 300 గజాల స్థలాన్ని అధికారులు సేకరించే ప్రయత్నం చేయగా ఏ ఒక్కరూ భూ సేకరణకు ముందుకు రాలేదు. సీఎం కనీసం సొంత పార్టీ నేతలనే ఒప్పించలేకపోయారు. స్వయంగా జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్.. జానారెడ్డి ఇంటికి వెళ్లి ఒప్పించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అడుగడుగునా అవాంతరాలు, న్యాయపరమైన చిక్కుముడులు వెంటాడుతున్న క్రమంలో పార్కు చుట్టూ వన్ వే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అనతికాలంలోనే వన్-వే తోనే ట్రాఫిక్ సమస్య తీరిపోయిందని ప్రచారం చేసుకుంటూ రావడం గమనార్హం.
‘ఫ్లై ఓవర్లు కడుతాం.. ట్రాఫిక్ లేని నగరాన్ని చేస్తాం’ అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, చివరికి చేతులెత్తేసి నగరవాసుల నెత్తిన శాశ్వత ‘వన్ వే’ బండ మోపింది. సరైన ప్రణాళికలు లేకపోవడం, చేతగాని నిర్ణయాలతో ప్రతిష్టాత్మక కేబీఆర్ పార్ చుట్టూ ఉన్న రహదారులను ఆగమాగం చేశారు. పక కాలనీకి వెళ్లాలన్నా కిలోమీటర్ల కొద్దీ చక్కర్లు కొడుతూ నిత్యం పెట్రోల్ ఖర్చు, సమయం వృథా అవుతున్నదని నగరవాసులు మండిపడుతున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి రూపొందించిన ప్లాన్ అట్టర్‌ఫ్లాప్‌గా మార్చారని నిప్పులు చెరుగుతున్నారు.

ముందు గా పర్యావరణ అధ్యయనం చేయకపోవడం, న్యాయస్థానాల నుంచి స్టే రావడం, పర్యావరణ ఉల్లంఘనలు, అన్నింటికీ మించి, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఆస్తుల సంరక్షణ లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రద్దు చేసిందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. ప్రజాధనాన్ని గుల్ల చేసి, గుంతలు తవ్వి పనులు మధ్యలోనే నిలిపివేసి, ఇప్పుడు రూ.400 కోట్లు ఆదా చేశామని గొప్పలు చెప్పుకోవడంపై పర్యావరణవేత్తలు, మేధావులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రణాళికాలోపంతో వృథా అయిన ప్రజాధనానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్ట్ అలైన్మెంట్ మారింది, డిజైన్‌ను మార్చేశారు. అయితే పారదర్శకంగా కొత్త టెండర్లు పిలువకుండా, పాత (మేఘా) కాంట్రాక్టర్లకే గుట్టుచప్పుడు కాకుండా పనులు అప్పగించేందుకు ఉత్సాహం చూపడం వెనుక ఎవరి స్వలాభం దాగి ఉన్నదో చెప్పాలని విపక్షాలు, ప్రజలు నిలదీస్తున్నారు.
హెచ్ సిటీ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ప్రముఖుల ఆస్తుల జోలికి వెళ్లకుండా మినహాయింపు ఇవ్వడం ఏ రకమైన న్యాయమని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. నిధుల లేమి ఒకవైపు, సొంత పార్టీ పెద్దల ఒత్తిళ్లు, కోర్టుల కేసులు మరొక వైపు చుట్టుముట్టడంతో ప్రభుత్వం ఇప్పుడు డైవర్షన్ డ్రామా చేస్తున్నదని మండిపడుతున్నారు. పేదల భూములను గుంజుకోవడానికి లేని కోర్టు చికులు, పెద్దల ఆస్తుల దగ్గరకు వచ్చేసరికి ఎదురవుతున్నాయా? అని నగరవాసులు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ద్వంద్వ విధానాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి, ఆగ్రహానికి దారితీస్తున్నాయి. సామాన్యుడికి ఒక న్యాయం, పాలకపక్ష నాయకులకు మరో న్యాయమా? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.