నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 5: కాంగ్రెస్ సర్కార్‌కు కరెంటియ్యడం కూడా చేతకావడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఓ వైపు వర్షాలు లేక.. మరోవైపు కరెంట్ ఇయ్యకపోతే పంటలు ఎట్లా పండుతాయని ప్రశ్నిస్తున్నారు. పంటలు చేతికొచ్చే టైమ్‌లో కరెంట్ కోతలేంటి అని నిలదీస్తున్నారు. సర్కార్ తీరును నిరసిస్తూ సోమవారం కూడా పలు జిల్లాల్లో రైతులు ఆందోళనలకు దిగారు. సబ్స్టేషన్లను ముట్టడించారు. రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు.
కరెంటు కోతలు, లోవోల్టేజీ సమస్యను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నస్తీపూర్ సబ్‌స్టేషన్ ఎదుట మంగాపూర్ రైతులు బైఠాయించారు. లోవోల్టేజీ కారణంగా బోరుమోటర్లు కాలిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. 12 గంటల విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్పూర్ సబ్‌స్టేషన్ వద్ద గంభీర్పూర్, వెంకటగిరితండా, శిలాజీనగర్, టేకుల తండా గ్రామాల రైతులు ధర్నా చేపట్టారు. అప్రకటిత కరెంట్ కోతలను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల రైతులు ఆగ్రహించారు. సోమవారం లింగాపూర్, మల్లుపల్లి, రాజేశ్వర్‌రావునగర్, గోరంటాల గ్రామాల నుంచి గజసింగవరం చేరుకొని, కామారెడ్డి-సిరిసిల్ల రోడ్డుపై ధర్నా చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఐతోల్ సబ్‌స్టేషన్‌ను, నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు నిరసనకు దిగారు.
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్‌లో, పల్వంచ మం డలం ఫరీద్‌పేటలో రైతులు రాస్తారోకో చేపట్టారు. వ్యవసాయానికి సరిపడా నాణ్యమైన విద్యుత్తు అందించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం గ్రామానికి చెందిన రైతులు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో నిరసన తెలిపారు.
ఎండిపోయిన వరిని తీసుకొచ్చి బైఠాయించారు. అనంతరం విద్యుత్తు ఏఈ దివ్యకు వినతి పత్రం అందజేశారు. ఖమ్మం జిల్లాలో అప్రకటిత విద్యుత్తు కోతలు నివారించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

నాణ్యమైన విద్యుత్తు అందించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం రైతులు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎండిన వరి పంటతో ఆందోళన నిర్వహించారు. ఎండిన వరి పంటను ఎంపీడీవో టేబుల్‌పై ఉంచి నిరసన వ్యక్తంచేశారు. – సంస్థాన్ నారాయణపురం

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామంలో సోమవారం ఉదయం 10 గంటలకే త్రీఫేజ్ కరెంట్ లేదంటూ రైతులు ట్రాన్స్ఫార్మర్ ఎకి కరెంట్ తీగలు పట్టుకొని నిరసన తెలిపారు. రాత్రి కరెంటు ఇవ్వడంలేదని, పగలు మాత్రమే ఇస్తున్నామని అధికారులు అంటున్నారని, కానీ పగలు కూడా సరిగ్గా ఇస్తలేరని వారు తీగలు పట్టుకొని నిరూపించారు.
– ఇచ్చోడ

వ్యవసాయానికి 12 గంటల విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్పూర్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద గంభీర్పూర్, వెంకటగిరితండా, శిలాజీనగర్ , టేకుల తండా గ్రామాల రైతులు ధర్నాకు దిగారు. గంటకు పైగా సబ్ స్టేషన్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. – దుబ్బాక

ఎడాపెడా కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిట్లం మండలం రాంపూర్ గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. రాస్తారోకో చేయడంతోపాటు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. పల్వంచ మండలం ఫరీద్పేటలోనూ రైతులు రాస్తారోకో చేపట్టారు.
-మాచారెడ్డి/పిట్లం

కరెంట్ ఇవ్వలేని దుర్మార్గపు పాలన తెలంగాణలో కొనసాగుతున్నదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని సబ్‌స్టేషన్‌ను సందర్శించి లాగ్‌బుక్‌లను పరిశీలించారు.
-గజ్వేల్

కరెంటు కోతలు, లోవోల్టేజీ సమస్యతో పంటలు ఎండుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేస్తూ సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నస్తీపూర్ సబ్‌స్టేషన్ ఎదుట మంగాపూర్ గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. లోవోల్టేజీ ఇస్తుండటంతో బోరుమోటర్లు కాలిపోయి.. పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు.
– హత్నూర

అప్రకటిత కరెంట్ కోతలపై రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని గజసింగవరం రైతులు ఆగ్రహించారు. గ్రామ స్టేజీ వద్ద కామారెడ్డి-సిరిసిల్ల రోడ్డుపై ధర్నా చేశారు.
– గంభీరావుపేట

నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని ఐతోల్ సబ్‌స్టేషన్‌ను, నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు నిరసనకు దిగారు. రోజుకు 15 నుంచి 20 సార్లు కోతలు పెడుతున్నారని మండిపడ్డారు.
-తాడూరు/దామరగిద్ద

విద్యుత్తు కోతలు నివారించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట సోమవారం రైతులు ధర్నా నిర్వహించారు.
-ఖమ్మం కమాన్‌బజార్