న్యూఢిల్లీ, అక్టోబర్ 5 : దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరింత పెరుగనున్నాయి. బ్యాంకులు, ప్రభుత్వ నామినేటెడ్ ఏజెన్సీలు దిగుమతి చేసుకునే పసిడి, వెండి, ప్లాటినమ్లపై ఇన్నాళ్లూ ఇచ్చిన ఇంటిగ్రేటెడ్ వస్తు, సేవల పన్ను (ఐజీఎస్టీ) మినహాయింపును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి మరి. ఈ మేరకు గురువారం జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. ప్రస్తుతం విదేశాల నుంచి దేశంలోకి వస్తున్న పుత్తడి, వెండి, ప్లాటినమ్ దిగుమతులపై 3 శాతం ఐజీఎస్టీ పడుతున్నది. అయితే బ్యాంకులు, నామినేటెడ్ ఏజెన్సీలకు ఈ పన్ను మినహాయింపుంటున్నది.
కానీ ఈ నెల 8న జరుగబోయే కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఈ ప్రోత్సాహానికి తెరదించాలన్న ప్రతిపాదన ఉన్నట్టు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఇదే జరిగితే ఇక బులియన్ ఎక్సేంజీలతోపాటు బ్యాంకులు, నామినేటెడ్ ఏజెన్సీలకూ ఒకేలా పన్నులు పడనున్నాయి. ఫలితంగా బహిరంగ మార్కెట్లో ధరలు ఆ మేరకు పెరిగే వీలున్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దిగుమతి చేసుకున్న సదరు బంగారం, వెండి, ప్లాటినమ్లను హోల్‌సేల్‌గా జ్యుయెల్లర్స్కు బ్యాంకులు, నామినేటెడ్ ఏజెన్సీలు విక్రయిస్తాయి మరి.
దేశ ప్రజలు బంగారాన్ని కొనవద్దని, కనీసం ఏడాదిపాటైనా కొనుగోలుకు దూరంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కరిగిపోతున్న డాలర్ నిల్వలను కాపాడుకోవడానికి పసిడి కొనుగోళ్లకు కళ్లెం వేయడమే ఇప్పటికున్న ఏకైక మార్గమన్నదే కేంద్ర ప్రభుత్వం ఆలోచన. ఈ క్రమంలోనే 9 ఏండ్లుగా ఉన్న ఐజీఎస్టీ మినహాయింపును ఎత్తివేసే ఎత్తుగడ వేస్తున్నారని నగల వ్యాపారులు అంటున్నారు. ఈ ఏడాది మే నెలలో బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచిన సంగతి విదితమే. ప్లాటినమ్పైనా 6.4 శాతం నుంచి 15.4 శాతానికి పెంచారు. దీంతో నగల పరిశ్రమ గట్టిగానే ప్రభావితమైంది. ఈ పరిశ్రమపై ఆధారపడేవారికి ఉపాధిని దూరం చేశారన్న విమర్శలూ వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో బ్యాంకులు, ప్రభుత్వ-నామినేటెడ్ ఏజెన్సీలు దిగుమతి చేసుకునే బంగారం, వెండి, ప్లాటినమ్లపైనా జీఎస్టీ బాదుడు.. ఇండస్ట్రీకి ఇంకా ఇబ్బందేనన్న ఆందోళనలు కనిపిస్తున్నాయి. కాగా, దేశీయ దిగుమతుల్లో ముడి చమురు తర్వాత స్థానం బంగారానిదే. ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) ఏప్రిల్-ఆగస్టులో పసిడి దిగుమతులు 3.38 శాతం వృద్ధి చెంది 17.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. మొత్తానికి పసిడి కొనుగోళ్లను వృథా పెట్టుబడిగా కేంద్రం చూస్తున్నదని, అందుకే పన్నుల భారం పెంచుతూపోతున్నదని జ్యుయెల్లర్స్ అంటుండటం గమనార్హం. ఈ రకమైన ధోరణి సరికాదని, నిజానికి తమ పరిశ్రమపై ఆధారపడి ఎంతోమంది జీవిస్తున్నారని వారంతా గుర్తుచేస్తున్నారు.