ఒకరోజు మేము బడి నుంచి ఇంటికి వచ్చేసరికి.. ఇల్లంతా హడావుడిగా ఉంది. ఎవరికి వారు ఏదో పెద్దపనిలో ఉన్నట్టు తిరుగుతున్నారు. నేను వెళ్లి ఏమిటని అమ్మను అడిగాను. అమ్మ “మనింటికి గురువులవారు ఒస్తున్నరు” అన్నది. అత్తయ్యలు, మామయ్యలు, చిన్నమ్మలు, చిన్నాయనలు.. ఇలా చాలామంది తెలుసు గానీ, ఈ గురువులవారెవరో అర్థం కాలేదు నాకు.
అమ్మను మళ్లీ అదే అడిగాను. “గురువుల వారంటే శాన గొప్ప! బాగ చదువుకున్నోళ్లు అన్నట్టు! మనకు మంచి, చెడ్డ చెప్తరు. దేవుని పూజలు చేస్తరు. ఎట్ల చేయాల్నో చెప్తరు” అంటూ చెప్పింది అమ్మ. “మనకు నర్సయ్యగారు, శేషయ్యగారు ఉన్నరుగద.. పూజలు చేసేటందుకు?!” అన్నాను నేను.. పెద్ద లాజిక్‌తో. ఇక లాభం లేదనుకున్నట్టుంది అమ్మ.. ‘నీకెందుకు అన్ని పిచ్చి ప్రశ్నలు?!’ అనలేదు. నన్ను పక్కన కూర్చోబెట్టుకుంది. “నువ్వు నాల్గో తరగతి దాక మనింటి ముందరి బళ్లె చదువుకున్నవు గద! మరి ఇప్పుడు వేరే బడికి ఎందుకు పోయినవ్?!” అడిగింది. “ఎందుకంటె.. ఇక్కడ అయిదో తరగతి లేదు. ఆ బడిల ఉన్నది గనుక!” మనకు రెడీమేడ్ జవాబులుంటాయి ఎప్పుడైనా. “మరి ఇక్కడ ఇద్దరు సార్లున్నరు గద! వాండ్లు చెప్పరా అయిదో తరగతి పుస్తకాలూ?!” అమ్మ లాజిక్ క్వచ్చన్. “ఎమ్మో! నాకు తెలువదు. కానీ, మా అప్పర్ ప్రైమరీ స్కూల్ల సార్లు ఎక్కువమంది ఉన్నరు. ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్కరు మంచిగ చెప్తున్నరు” అన్నాను ఆలోచించి. “మరి ఇదిగూడ గంతే! ఈ గురువులవార్లు ఎక్కువ చదువుకున్నరు. బాగ జ్ఞానవంతులు!” అన్నది అమ్మ. అప్పటికి నోరు మూసుకుని, అమ్మ పెట్టిన అప్పాలు తిని ఆడుకోవడానికి పరిగెత్తాను.
మా ఇంట్లో నాలుగు మనసాలలు, నాలుగు గదులు బూజులు దులిపి, నేలలు, గోడలు ఎర్రమట్టితో అలికి.. గోడలకు సున్నంతో ముగ్గులు పెట్టారు. మా నాన్న.. అమ్మమ్మ గారింటికి దత్తత వచ్చాడు గనుక, ఆ ఇంటి పద్ధతులే పాటించేవారు. వాళ్ల గురువులు తిరుపతికి చెందిన ‘ప్రతివాది భయంకర’ అనే ఇంటిపేరున్న అయ్యంగార్లన్న మాట. వారినే తెలంగాణలో అయ్యగార్లు అంటారట. రెండు రోజుల తరువాత మా ఇంటికి గురువులవారి పెద్ద సమూహం వచ్చింది. మా ఇంటికి వచ్చిన గురువు పేరు వేదాంతాచార్యులవారు. తిరుపతి నుంచి రైల్లో వచ్చినవాళ్లు అందరికీ కనిపించాలని సవారీ కచ్చడంలో కాకుండా.. పూలదండలతో, మామిడాకులతో బాగా అలంకరించిన మొద్దుబండిలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. వాళ్ల వెంట ఛత్ర, చామర, వింజామరల కోసం ముగ్గురు, ఇద్దరు శిష్యులు, ఒక సహాయకుడు, గురువుగారి భార్య, కొడుకు.. ఇలా మొత్తం పదిమంది దాకా వచ్చారు. వాళ్లకు కాళ్లు కడిగి లోపలికి తీసుకొచ్చారు.
గురువుగారికి పడమటి గది ఇచ్చారు. శిష్యులంతా వంటింటి వైపున్న గదిలోనూ, మనసాలలోనూ సర్దుకున్నారు. మాకందరికీ కలిపి ఓ గదీ, ఓ మనసాల మాత్రం మిగిలాయి. వంటిల్లు మొత్తం కలిపి ఓ హాలు, మూడు గదులు ఉండేవి. వాటిల్లోకి మమ్మల్నెవర్నీ అనుమతించలేదు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వస్తే ఆ ఏరియా అంతా బ్లాక్ క్యాట్ కమాండోలు తమ అధీనంలోకి తీసుకున్నట్టుగా.. ఇల్లంతా వాళ్ల కంట్రోల్లోకి వెళ్లిపోయింది.
వంటంతా వాళ్లే చేసేవారు. ముడిసరుకులు అందించడమే అమ్మవాళ్ల పని. మా అమ్మ వంట చేయకుండా ఉన్నది అప్పుడే! అయితే, వాళ్లు వంటలు చాలా రుచిగా చేసేవారట. మాకు మా అమ్మ వంటే నచ్చేదనుకోండి. అయినా కొన్ని వంటలు వాళ్లవీ బావుండేవి. వాళ్లు తెలుగుతోపాటు తమిళంలోనూ మాట్లాడేవారు.
దప్పళం (చిక్కటి చింతపండు పులుసు), తొహి (రోటిపచ్చడి), ఇంజుపుళి (చింతపండు, అల్లం, బెల్లం వేసిన సాస్ లాంటి పచ్చడి), కళుహు (పచ్చి కూరగాయ ముక్కలు కారం, ఆవపిండిలో కలిపి చేసే సలాడ్ లాంటిది).. ఇలా ఈ జాబితా అనంతం. వీటికి అమ్మ తొందరగానే తెలుగు అనువాదం నేర్చుకుని అన్నీ అందించేది గానీ, నానమ్మకు తెలిసేది కాదు. ఇక మాకైతే ఒక్క పులిహోర తప్ప ఏదీ తెలియకపోయేది. దాంతో, వాళ్లు వడ్డించేటప్పుడు మాకు అర్థం తెలియని వాటిని వాళ్లు వేసుకోమని అడుగుతుంటే.. మేము తెల్లమొహం వేసేవాళ్లం. ఎందుకైనా మంచిదని వాటిని వద్దని చెప్పేవాళ్లం. వాళ్లేమో.. “ఇది వేసుకోండమ్మా! బాగుంటుంది” అనేవాళ్లు.
గురువులవారు గంభీరంగా ఉన్నా , అప్పుడప్పుడూ చిరునవ్వు నవ్వేవారు. పొద్దున్నే తయారయ్యాక మా నానమ్మ తీసికెళ్లి నాతో దండం పెట్టిస్తే ఆశీర్వదించి ఓ అరటిపండు ఇచ్చేవారు. ఇక నేను ఖుష్ అయేదాన్ని. ఇక గురువులవారి భార్య అయితే చక్కటి జరీ అంచు, కొంగు ఉన్న పట్టుచీర గోచీ పోసి (దాన్ని మడిచారు అనేవారనుకుంటా) కట్టుకుని, ముఖాన పెద్దబొట్టుతో, తెల్లగా, అందంగా ఎప్పుడూ నవ్వుతూ క్యాలెండర్లో లక్ష్మీదేవిలా ఉండేది. ఆమె నన్ను దగ్గరికి పిలిచి గారాబం చేసేది. “మాతో తిరుపతి వస్తావా?!” అనడిగేది. “మా అమ్మ ఒస్తే నేనొస్తా..” అనగానే నవ్వేది.
ఒక్కోసారి ఉదయం నుంచే హడావుడిగా ఉండేది. గురువులవారి చుట్టూ ఊరివాళ్లు, బయటి నుంచి వచ్చిన మగవాళ్లు ఓ పదిపన్నెండు మంది చొక్కాలు విప్పి కూర్చునేవారు. ఆడవాళ్లు కూడా ఒకరిద్దరు జాకెట్టు చేతులు పైకి మడిచిపెట్టుకుని ఉండేవారు. శిష్యులు ఒక మట్టి పాత్ర నిండా నిప్పులు తెచ్చి గురువులవారి ముందు పెట్టగానే.. ఆయన తన చేతిలో చివర నలుచదరంగా ఉన్న ఇనుప కాడలను ఆ నిప్పుల్లో ఆరనిమిషం ఉంచి తీసి వాళ్ల భుజాలపై ఇటొకటి, అటొకటి ముద్రలేసేవారు. చాటునుంచి చూస్తున్న నేనూ, అక్కా.. ‘అంత ఉడుకువి వాళ్లకు కాలవా?!’ అని భయపడేవాళ్లం. పైగా వాళ్లే గురువుగారికి డబ్బులిచ్చి దండం పెట్టేవాళ్లు.
గురువులవారు ఉన్నన్నాళ్లూ చుట్టుపక్కల ఊర్లనుంచి కొన్ని కుటుంబాల వారు వచ్చేవారు. వారు కొంచెం డబ్బో, ధాన్యమో తెచ్చి ఇచ్చేవారనుకుంటా. వాళ్లల్లో కొందరు మా ఇంట్లోనే భోజనం చేసేవారు కూడా. సాయంత్రం వేళల్లో మా వాకిట్లో ఆయన ఓ బల్లపీట మీద ఒక వస్త్రం వేసుకుని కూచుని కాలక్షేపం చెబుతుంటే (ఇప్పుడు ప్రవచనం).. ఊర్లోవాళ్లు చాలామంది వచ్చి వినేవారు. ఎవరైనా మరీ బలవంతపెడితే ఆ ఊరు దగ్గరలో ఉంటే బండిలో వెళ్లివచ్చేవారాయన. అమ్మగారు మాత్రం కొడుకుతోసహా మా ఇంట్లోనే ఉండేది. వారం పది రోజులుండి గురువులవారు వెళ్లిపోయాక.. మా ఇల్లంతా సందడి లేక చిన్నబోయేది. మా నాన్నకు ఎంత ఖర్చయ్యేదో తెలియదు. అలా వాళ్లు రెండుమూడు సార్లు వచ్చినట్టు జ్ఞాపకం ఉంది. 1976లో చివరగా వచ్చాక.. మళ్లీ రాలేదనుకుంటాను.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి