నేను ఎనిమిదేళ్ల పిల్లగా ఉన్నప్పుడు మా కజిన్ పెళ్లికోసం రాయపర్తి వెళ్లాం. ఆ ప్రయాణంలోమా అమ్మ సందూక మిస్ అయ్యింది. బస్సు దిగేటప్పుడు అమ్మ బ్యాగు పట్టుకుని దిగితే.. పైనున్న పెట్టెను నర్సి తీసుకొచ్చాడట. ఇంటికి వచ్చాక తెలిసింది.. అది మనది కాదని.
ఇక అందరూ నర్సిని.. “ఏంది పిలగా! గది తెల్వలేదా?! పదహారేండ్ల పిలగానివి. ఎందుకొచ్చినట్టు? పెట్టె సరిగ్గ దింపుకోవద్దా? గిప్పుడు చూడు, అండ్ల ఉన్నవి ఎవరు తెచ్చిస్తరు? నువ్వు తెస్తవా?” అని నేరం అతనిదేనని నిర్ధారించారు. “వాడెవడో వానిపెట్టె మీరు దింపుకోని ఇటు రాంగనే.. వాడుకూడా మజ్జల ఎక్కడ్నో దిగిపోతె అయిపాయె! మీరు ఎతికినా వాణ్ని ఎక్కడ దొరుకబడ్తరు?!” అని మరో అపశకున పక్షి అనడం.. ఇలా ఎవరికి తోచింది వాళ్లు మొదలుపెట్టారు.
దాంతో అమ్మకు బాగా ఏడుపు వచ్చింది. ఆ పెట్టెలోనే అమ్మ పట్టుచీరలు, మా కొత్త బట్టలతోబాటు నగలన్నీ ఉన్నాయి మరి. అంత నిస్సహాయతలోనూ.. “నర్సిగాడినేం అనకండి. వాణి తప్పేమున్నది. నేనే చూసుకుంటే అయిపోయేది” అన్నది. మా అత్తమ్మ వచ్చి కూడా ఏం చేయాలో ఏం చెప్పాలో తోచక.. “ఏం కాదులేవే శకుంతలా! నా బట్టలు కట్టుకుందువు. నువ్వు ముందుగాల మొహం కడుక్కోని చాయ్ తాగు” అన్నది. అక్కడున్న వాళ్లందరికీ మంచి టాపిక్ దొరికినట్టయి.. తమ తెలివితేటలతో రకరకాల ఊహాగానాలు చేసి చక్కటి స్క్రీన్‌ప్లేతో వివరించడం, చర్చించడం చేశారు. కాసేపటికి పెళ్లి కూతురు తండ్రి భద్రాద్రి మామయ్య (మేము ఆయన్ని రాయపర్తి మామయ్య అనేవాళ్ల్లం) పెళ్లి పనుల్లో ఉన్నవాడల్లా వచ్చి.. “ఏం గాదు! నేను పొయ్యి ఎట్లనన్న వాణ్ని పట్టుకొని.. నీ పెట్టె నీకు తెచ్చిస్త! నువ్వు భయపడకు చెల్లే!” అని.. అందరితోటి “మీరంత చుట్టుచేరి దాన్ని ఏడిపిస్తున్నరా! ఏం గాదు, రేపు పొద్దున సూర్యుడు పొడిచే లోపల నేను తేకుంటె.. నా పేరు తీసి వేరే పేరు పెట్టుకుంట” అని అందర్నీ నవ్వించాడు.
వెంటనే తన పరపతిని ఉపయోగించి ఖమ్మంకు ట్రంక్‌కాల్ బుక్‌చేసి బస్‌స్టాండుకు ఆ బస్సులో పెట్టె సంగతి సమాచారం అందించాడు. పోలీసులకు కూడా చెప్పి ఉంచాడు. ఆ పెట్టెలో ఏమేం ఉన్నాయో అమ్మను అడిగితే.. అమ్మ ఆ బాధలో, కంగారులో వెంటనే ఏమీ చెప్పలేక పోయింది. దాంతో సూర్యం చిన్నాన్న (మా అమ్మకు మేనమామ కొడుకు.. కానీ, అక్కా – తమ్ముళ్లలా పెరిగారు) తనకు గుర్తున్నవన్నీ చెప్పాడు. మొత్తానికి మామయ్య తన కూతురు పెళ్లి ఆ మర్నాడు ఉన్నా, కొన్ని పనులు వేరేవాళ్లకు అప్పజెప్పి వెంటనే.. వీళ్లు తెచ్చిన సందూక తీసుకొని జీపులో బయల్దేరి ఖమ్మం వెళ్లాడు.
అప్పటికే బస్సు ఖమ్మంలో ఆగగానే కంట్రోలర్ బస్సు దగ్గర రెడీగా ఉన్నాడట. మా పెట్టె తీసుకుని అతనెవరో దిగబోతుంటే ఆపి.. “ఈ పెట్టె గురించి తారుమారైందని కంప్లయింట్ ఒచ్చింది. మీరు కొంచెం సేపు ఆగండి” అన్నాడట. “ఎందుకైతది? ఈ సందూక నాదే!” అన్నాడట అతను.
“అయితే అండ్ల ఏమున్నయో చెప్పండి! వేరేవాళ్లు గూడ ఒస్తున్రు. వాళ్లు ఒచ్చినంక వాండ్లనుగూడ అడుగుతం. మీ ఇద్దరి ముంగటనే పెట్టె పలగ్గొట్టి చూద్దాం. ఎవరు చెప్పింది కరెక్ట్ అయితె వాళ్లకు ఇచ్చేస్తం!” అన్నాడట కంట్రోలర్. ఆ ప్రయాణికుడు కొంచెంసేపు గునిసి.. “మొదలు వాళ్లు చెప్పనియ్యండి” అన్నాడట.
ఈలోగా మామయ్య వెళ్లడం.. తను పట్టుకెళ్లిన లిస్టు ఇవ్వడం చేసేసరికి ఇద్దరు పోలీసులు కూడా వచ్చారట. అతడు మొదట తన దాంట్లో డబ్బు ఉందని అన్నాడు గానీ.. పోలీసులను చూసి మారు మాట్లాడకుండా తన పెట్టె తీసుకుని వెళ్లిపోయాడు. సహాయం చేసినందుకు వాళ్లకు మామయ్య దావత్ (ఇప్పటి రోజుల్లో ట్రీట్) ఇచ్చి.. ఆ మధ్యరాత్రి పెట్టె తీసుకుని విజయవంతంగా ఇంటికి వచ్చాడు.
ఆ మర్నాడు మామయ్య.. “చూసిన్రా.. ఏడు సముద్రాల అవతల ఉన్నా సరే, సూర్యోదయం లోపల సందూక పట్టుకొని ఒస్తానన్నానా లేదా?! ఏం లాభం.. ఈ దేశపు మహారాజు అర్ధరాజ్యం, అందమైన రాజకుమారిని ఇస్తానని ఇంకా ఒస్తులేడేంది?!” అని తన సహజ ధోరణిలో అందర్నీ నవ్వించాడు. “చాలు.. సంబడం! బిడ్డ పెండ్లి చేసుకుంట అవ్వేం మాటలు?!” అని జానకి అత్తమ్మ చురచురా చూసింది. “లేకపోతే.. మా చెల్లెలి ఆభరణముల పేటిక పోవుటయా?! అదియునూ నేనుండగానే ?!” అని మామయ్య ఇంకా నవ్వాడు. పెళ్లిలో కూడా ఎవరో ఒకరు.. “నీ పెట్టె పోయిందటగద !” అని అమ్మను అడుగుతూనే ఉన్నారు.
అమ్మ ఓపిగ్గా.. “అవును! పోయి భద్రాద్రి అన్నయ్య వల్ల దొరికింది” అని చెబుతూనే ఉంది. ఆ పెళ్లి మహా వైభవంగా జరిగింది. మధ్యాహ్నం భోజనాల తాలూకూ ఆఖరి బంతి అయ్యేసరికి రాత్రి భోజనాల వేళయ్యి వండేవాళ్లు, వడ్డించేవాళ్లు తీరిక లేకుండా పని చేస్తూనే ఉన్నారని చెప్పుకొన్నారు. పిల్లలమంతా పెళ్లి కూతురైన మా వదిననూ, పెళ్లి కొడుకునూ, ఆ పెళ్లి తంతునూ చూస్తూనే ఉన్నాం తప్ప.. ఆటలాడుకోవడానికి కూడా వెళ్లలేదు. ఆ పెళ్లిలోనూ, ఆ తరువాత వారం రోజులకే మా ఊళ్లో జరిగిన మా మేనత్త కూతురి పెళ్లిలోనూ బ్యాండ్ వాళ్లు మొత్తం ‘దసరా బుల్లోడు’ పాటలే వాయిస్తూ హోరెత్తిస్తుంటే.. వింతగా అనిపించింది.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి