జరిగిన కథ : రాజప్రాసాదంలోని అంతఃపురంలోకి వెళ్లబోతూ..ఆ ద్వారాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఒక్కటే ద్వారం! మొన్న
వచ్చినప్పుడు అక్కను చూడాలన్న తొందరలో అప్పుడు గుర్తించలేదు.అంటే.. బావగారు రెండు అంతఃపురాలు ఏకం చేశారన్నమాట. గతంలో
హరిహరుని మరణవార్త అందినప్పటి సంఘటన గుర్తొచ్చింది. అద్దంకి, పాకనాడు రాజ్యాల మత గొడవల సమయంలో..ఆ దుర్వార్త తెలిసి, భారంగా కుప్పకూలిపోయాడు జాయపుడు. అక్కకు,బావగారికి గర్భశోకం!
అస్థిరం జీవనంలోకే అస్థిరం యౌవనం ధనం
అస్థిరం దారాపుత్రాది ధర్మ కీర్తి ద్వయం స్థిరం ॥
(ఈ జీవితం, యవ్వనం, ధనం, భార్యాబిడ్డలు కూడా శాశ్వతం కాదు. ధర్మం.. తద్వారా పొందిన
కీర్తి మాత్రమే శాశ్వతం!)
ఎవ్వరికీ చెప్పకుండా హుటాహుటిన అనుమకొండకు వెళ్లాడు. దీర్ఘకాల జబ్బుతో ఉన్న పార్థివదేహం కాబట్టి అప్పటికే హరిహరదేవుని దహన సంస్కారాలు చేసేశారు.
అంతఃపురంలోకి వెళ్లాడు. ఆశ్చర్యంగా సవతులిద్దరూ ఒకే అంతఃపురంలోనే కాదు.. ఒకే మందిరంలో వేర్వేరు గదులలో ఉంటూ ఆప్యాయంగా కనిపించారు. ఇంకా ఆశ్చర్యమేమిటంటే.. సోమలదేవి అనారోగ్యంతో మంచాన పడగా, ఇన్నేళ్లుగా ఎవరినైతే అసహ్యించుకున్నదో ఆ సవతి నారాంబే సపర్యలు చేస్తున్నది. గర్భశోకాన్ని భరిస్తూ. జాయపుడు వెళ్లేసరికి మందిరమంతా భరించలేని దుర్గంధం. తల్పం వద్ద సోమలదేవికి వైద్యం చేస్తున్న రాజవైద్యుడు అన్నంభట్టు.. దగ్గరగా నారాంబ, కాస్త ఆవలగా చక్రవర్తి గణపతిదేవుడు, పక్కన పెద్దకుమార్తె గణపాంబ. అందరూ ముక్కులకు గుడ్డలు కట్టుకుని ఉన్నారు.
జాయపుడు ప్రవేశించగానే అందరూ తలతిప్పి చూశారు. జాయపుడు చక్రవర్తికి నమస్కరించగా వైద్యుడు జాయపునికి నమస్కరించాడు. సోమలదేవిని పలకరించాలంటే కాస్త తటపటాయించాడు జాయపుడు.
అప్పుడు వినిపించింది ఘొల్లుమన్న సోమలదేవి గొంతు. ఆమె వెక్కివెక్కి ఏడుస్తున్నది. గణపతిదేవుడు గబగబా దగ్గరికి వెళ్లాడు.
“సోమలా.. ఎందుకా దుఖం? తగ్గిపోతుంది. వైద్యులు మంచి చూర్ణాలు, మూలికలు వాడుతున్నారు. కాస్త ఓపిక చేసుకో! భరించాలి కదా!?”.
“భరిస్తాను. నా ఒంట్లో జబ్బు, దాని నొప్పి భరిస్తాను. కానీ నా మనసులో జబ్బు.. దాని నొప్పినే భరించలేక పోతున్నాను స్వామీ! నారాంబకు నేను చేసిన ద్రోహం నన్ను దహిస్తున్నది. ఆమెను చిత్రహింసలు పెట్టాను. ఆమె కొడుకుల్ని చూసి నా కళ్లలో నిప్పులు పోసుకున్నాను. వాళ్లను చంపించడానికి కూడా ప్రయత్నించాను. ఆమె గర్భశోకానికి నేనే కారణం. నా వల్లనే ఆమె కొడుకు చనిపోయాడు. అయినా ఆమె నా బాగు కోరింది. నేను మంచాన పడితే అంత బాధలో కూడా ఆమె నాకు సపర్యలు చేస్తున్నది. నారాంబా.. నన్ను క్షమిస్తావా!?” సోమలదేవి దుఖంతో కుమిలిపోవడం జాయపుణ్ని చకితుణ్ని చేసింది.
ఆమె ఏదో నిగూఢమైన జబ్బుబారిన పడింది. ఆమె శరీరం నుంచి దుర్గంధం వస్తున్నది. పరిచారికలు, దాసీలు కూడా ఆమె సామీప్యంలో ఉండలేక పోతున్నారు. అయినా నారాంబ ఆమెకు సపర్యలు చేస్తున్నది.
ఆమె మందిరంలో రెండు తల్పాలు. ఒకదానిపై హరిహరదేవుణ్ని, మరో తల్పంపై సోమలదేవిని ఉంచి ఇద్దరికీ వైద్యులు చెప్పిన చూర్ణాలు, ద్రవాలు చెప్పిన ఘడియల్లో అందిస్తూ.. నిద్రాహారాలు మాని సపర్యలు చేసింది. అయినా భగవంతుడు అక్కకు అన్యాయం చేశాడు. ఆమె కడుపున పుట్టిన హరిహరదేవుడు మరణించాడు. ఆ దుఃఖాన్ని కూడా దిగమింగి నారాంబ సవతికి సపర్యలు, సేవలు చేస్తూనే ఉంది.
అంతా చూసిన జాయపుడు నిరుత్తరుడయ్యాడు. అప్పట్లో గణపతిదేవుని మాటలు గుర్తొచ్చాయి.
‘ఇద్దరి మధ్య అడ్డుగోడలు తొలగించి పరస్పరం సంఘర్షించుకునే పరిస్థితులు కల్పిస్తే.. ఒకనాటికి ఇద్దరూ సంఘటితమవుతారు!’ అని ఆయన అన్నది ఇప్పుడు కళ్లముందు కనిపిస్తున్నది. ఆయనవైపు అభినందనగా చూశాడు. గొప్ప ఓపిక వీరుడు బావగారు!!
కానీ, ఆయన కొడుకును పోగొట్టుకున్నాడు. ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్న భార్య.. తెలియని జబ్బుతో సతమతం అవుతున్నది. సోమలదేవికి దగ్గరగా వెళ్లి..
“అక్కా.. అక్కగారూ!” అన్నాడు జాయపుడు.
ఆమె జాయపుణ్ని చూడలేనన్నట్లు కళ్లు మూసుకుని ఘొల్లుమంది.
“ఆ రుద్రదేవుడ్ని నమ్ముకోండి అక్కా! మీ బాధలు తీరిపోతాయి..” అన్నాడు అనునయంగా.
“నీబోటి మంచివాణ్ని నానా దుర్భాషలాడిన ఫలితం ఈ మందులేని జబ్బు జాయా! నా కూతురు కూడా నన్ను తాకడానికే భయపడుతున్న సమయంలో మీ అక్క.. నావల్ల ఎన్నోబాధలు అనుభవించిన తోటి మహారాణి.. ఇవ్వాళ నాకు సపర్యలు చేస్తున్నది. ఇంతకంటే నాకు ప్రాయశ్చిత్తం ఏమి కావాలి తమ్ముడూ!”..
ఆమెను అనునయించడం ఎవ్వరివల్లా కావడంలేదు!!
ఆ రాత్రి గణపతిదేవుని వెంట ఉన్నాడు. ఇద్దరూ నిశ్శబ్దంగా, భారంగా ఆయన ఆంతరంగిక మందిరంలో ప్రవేశించారు. ఆయన తల్పంపై కౌమార యువతి గణపాంబ ముడుచుకుని చిన్నబాలికలా నిద్రిస్తున్నది. సోమలదేవి శరీర దుర్వాసన వల్ల ఆమె బలవంతంమీద గణపాంబ పినతల్లి నారాంబ మందిరంలో గానీ, తండ్రి ఆంతరంగిక మందిరంలోగానీ పడుకుంటున్నది.
నిద్రపోతున్న ప్రియపుత్రికను తృప్తిగా చూస్తూ ఆమె మోముపై ఊపిరికి కదలాడుతున్న ముంగురులను ప్రేమగా సవరించాడు.
యవ్వనవతి అయినా.. తండ్రికి కూతురెప్పుడూ చంటితల్లే!
వెనుదిరిగిన జాయపుడు గణపాంబ పలవరింత వినిపించి ద్వారంవద్ద ఆగిపోయాడు.
“నాన్న గారూ!”..
“అమ్మా!”..
“మామ.. జాయ మామ విశ్రమించారా నాన్నా?”..
“ఆ.. ఆ.. విశ్రమించాడు. నువ్వు నిద్రపో!”..
కదిలిపోయాడు జాయపుడు. సోమలదేవి చాటునున్న గణపాంబ ఎప్పుడూ జాయపుణ్ని పలకరించేది కాదు. పలకరించినా ముఖం తిప్పుకొనేది. తల్లి నేర్పిన విద్వేషం ఆ బాలిక ముఖమంతా విప్పార్చుకుని ఉండేది. పెద్ద మేనల్లుడు రుద్రమదేవుడ్ని తను చూడలేదు. అతణ్ని చిన్ననాడే విద్యా గురుకులానికి పంపివేయడంతో.. ఎప్పుడైనా గణపాంబ మాత్రమే కనిపించేది. అలాంటి గణపాంబ తనను ‘మామ’ అంటూ నిద్రలోకూడా తన గురించి తండ్రిని అడుగుతున్నది.
మనసంతా ప్రఫుల్లమయ్యింది. తనకిప్పుడు ఇద్దరు అక్కలు. ఒక్క మేనకోడలు. ఇద్దరు మేనల్లుళ్లు. చాలు..
ఇక తనకు వివాహం.. కుటుంబం.. ఆ జంజాటం ఎందుకు. వీళ్ల జీవితాలను చక్కబరిస్తే చాలు!
భార్య అనే బంధమూ.. ప్రేమ నిండిన జీవిత సహచరి.. ఓ కుదురైన కుటుంబం.. ప్చ్! ఆ మధురత జీవితంలో లేదు కాబోలు. అడిగిఅడిగి చెప్పిచెప్పి అక్క, బావగారు.. పెళ్లి సంగతి ప్రస్తావించడం మానేశారు. వాళ్లేకాదు.. ఇప్పుడెవ్వరూ అడగడం లేదు. అది కాలంచెల్లిన అంశం. జాయపునికి కూడా. విషాదంగా నవ్వుకున్నాడు.
కనురెప్పల మాటున ఉబికిన నీటి ఊటను ఎవరో తుడుస్తున్నారు.. తన చేలాంచలముతో.
మూర్చనలు పోయిన అతని పెదవుల కదలికలను మాటలుగా మార్చితే అది.. ‘కాకతీ!!’
అప్పుడే ఓ ఆలోచన మెరవడంతో కళ్లు తుడుచుకుని వెనుదిరిగి అన్నాడు.
“బావగారూ.. గణపాంబకు వివాహం చేస్తే..??”.
కుమార్తెకు కంబళి కప్పుతున్న గణపతిదేవుడు క్షణకాలం అలాగే ఆగిపోయాడు.
హరిహరదేవుని కర్మకాండలు అయ్యాక వెలనాడు వచ్చేశాడు జాయపుడు. తిరిగి మతయుద్ధ పనుల్లో నిమగ్నుడయ్యాడు.
రాత్రి రెండవజాములోకి ప్రవేశిస్తున్నది.
అనుమకొండ కాస్త కాస్త సద్దుమణుగుతున్నది. పాదచారులు తప్ప బండ్లు, రథ, అశ్వ, గజ పదఘట్టనలు దాదాపు వినిపించడం లేదు. ఎవ్వరో ఎక్కడో తత్వాలు పాడటం వినిపిస్తున్నది. ఈ తత్వాలు ఎక్కువగా నిమ్నవర్గాల దాసరులే ఆలపిస్తుంటారు. దినమంతా తలొంచుకుని, తమ నిర్దేశిత పనేదో తాము మౌనంగా చేసుకునే ఈ నిమ్నవర్గాలు.. ప్రశాంత రాత్రివేళ బిగ్గరగా గొంతెత్తి పాడటం కులీనవర్గాల ఆధిపత్య భావనలను ధిక్కరించడం ఎందుకు కాకూడదు?!
నిజమే నిజమే! కళాకారులే కదా తొలి సామాజిక యుద్ధవీరులు! అద్దంకి కళాయుద్ధం అదే కదా నిరూపించింది!
మొదటి అంతర్వులో తన మందిరంలో వెలనాడు నుంచి పృథ్వీశ్వరుడు పంపిన తన వ్యక్తిగత వస్తువులు.. ముఖ్యంగా తాళపత్ర గ్రంథాలను సరిచూసుకుంటున్నాడు జాయచోడుడు. సేకరించి దాచుకున్న ప్రసిద్ధ, ప్రామాణిక గ్రంథాలే కాకుండా, పరాశరుడులాంటి వర్తమాన మిత్రకవుల, లిఖిత రచయితల, పండితుల రచనలు.. కొంగొత్తవి ఆసక్తిగా చూస్తున్నాడు.
అరె.. ఇవి మువ్వ రాసిన గేయాలు!? శతకం??
ఎవరో మెట్లు ఎక్కి వస్తున్నట్లు శబ్దం..
తలతిప్పి చూశాడు. చివ్వున లేచి నిలబడ్డాడు. ఒడిలో ఉన్న తాళగ్రంథాలు కింద పడిపోయాయి.
ఎదురుగా గుమ్మం నిండుగా మహామండలీశ్వరుడు శ్రీశ్రీశ్రీ గణపతిదేవ చక్రవర్తి!!
కళ్లు చికిలించి ఆసక్తిగా, కొత్తగా జాయపుని ముఖంలోకి చూస్తున్నాడు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ఆయన కళ్లలోకి చూడటానికే ఇబ్బందిపడే జాయచోడుడు.. తొలిసారి కళ్లెదుట సాక్షాత్కరించిన తన దేవుడు!
ఆయనపై చిన్నపాటి అసంతృప్తితో, కొద్దిపాటి ఆగ్రహంతో ఉన్న జాయచోడుడు తన నివాసానికి ఆయనే స్వయంగా వచ్చి ఎదురుగా నిలబడి నిశితంగా చూస్తుంటే.. గందరగోళమైపోయి చటుక్కున లేచి ఆయనకు పాదాభివందనం చేశాడు. జాయచోడుని ముఖకవళికలను మౌనంగా చూస్తూ వెళ్లి అక్కడున్న ఉచితాసనంపై విశ్రాంతిగా కూలబడ్డాడు చక్రవర్తి.
మౌనం.. జాయచోడునికి కరచరణాలు కొద్దిగా కంపిస్తున్నాయి. ప్రభువు ముందు చేతులు ఎక్కడ పెట్టుకోవాలో తెలియని సమస్య మొదటిసారి వచ్చింది. వంగాలా.. బిర్రబిగదీసుకుని నిలబడాలా.. కిందికి చూడాలా.. ఆయన కళ్లలోకి చూడాలా.. ఏ భంగిమ.. త్రిభంగినా??.. ఎలా ఉండాలి??
“ఊ..” అంటూ గణపతిదేవుడు శబ్దించి..
“వెలనాడు నుంచి వచ్చి పదిరోజులయ్యింది. తమరు మా కంటపడకుండా ఉండటం..?” ముగింపులో ప్రశ్నార్థకాన్ని సంధించాడు.
“బె.. బే.. అబ్బే! ఏమీ లేదు బావగారూ..” అమాయకుడిలా తల అటూ ఇటూ.. మళ్లీ ఇటూ అటూ.
“అద్దంకి, పాకనాడుపై యుద్ధాలతో బాగా అలసిపోయినట్లున్నావు..”
ఏదో అనబోయాడు. కానీ, ఆయనే తన ధోరణిలో బాణాలు వదులుతున్నాడు.
“అద్భుతం! ఓ మతసమస్య పెరిగి పెరిగి యుద్ధం వరకూ వస్తే దానిని చాకచక్యంగా నీ కళారూపాలతో పరిష్కరించడం.. నిజంగా అద్భుతం! అందుకు నీకు గొప్ప ఘనస్వాగతం పలకాలని మేము ఏర్పాట్లు చేసి ద్వారసముద్రం వెళ్లినప్పుడు.. తమరు తుర్రుమని వచ్చేశారు. పృథ్వీని అడిగితే.. కోటలోకి కూడా కాలు పెట్టకుండా అప్పటికప్పుడే వెనుదిరిగావని చెప్పాడు. ఏం.. అనుమకొండ అంటే అంతిష్టమా!? కనీసం రాచమర్యాదలు, వీడ్కోలు సంప్రదాయాలు ఉంటాయి కదా. అవి కూడా పాటించడం తెలియదా!? అసలు అలాంటి సంప్రదాయాలు ఉంటాయని తెలుసా తమరికి..?!” ఆపాడు.
సంప్రదాయాలు!? నృత్తంలో తెలుసు. యుద్ధంలో అంతో ఇంతో.. కానీ రాజాస్థానాలలో.. అబ్బే!!
మళ్లీ అదే సమస్య. తల ఎటు ఊపాలో తెలియడం లేదు. ఊపాడు కానీ ఎటు ఊపాడో ఏమో.. బుర్ర మొత్తం తిరుగుతున్నది. బావగారు చాకిరేవు పెట్టి మరీ ఉతుకో.. ఉతుకు..
“సరే.. పెద్దవాడివయ్యావ్. వెలనాడు మండలీశ్వరునిగా ఇన్నేళ్లు వెలగబెట్టావని నీకు స్వాగతం చెప్పే అవకాశం మాకు ఇవ్వలేదు సరే. గతంలో వచ్చినప్పుడు మాకొక పని అప్పగించావ్. అది ఏమైందో ఏవైనా తెలుసుకున్నావా!? మీ అక్కనైనా అడిగావా!? నిన్ను చూడగానే ఆవిడకు గుర్తొచ్చేది.. ‘బిడ్డ ఏం తిన్నాడో!?’ అని.. నలభై ఏళ్లొచ్చినా తమ్ముడు ముద్దులబిడ్దే ఆమెకు. తమరు ఆసనంలో కూలబడేసరికి ఆవిడ పళ్లెరంతో సిద్ధం. పెద్దపెద్ద ముద్దలు ఎగరేసి అందించడం.. దాన్ని తమరు బుగ్గల్లోకి తోసి ఆనందంగా కుమ్మడం”..
(సశేషం)
“అద్భుతం! ఓ మతసమస్య పెరిగి పెరిగి యుద్ధం వరకూ వస్తే దానిని చాకచక్యంగా నీ కళారూపాలతో పరిష్కరించడం.. నిజంగా అద్భుతం! అందుకు నీకు గొప్ప ఘనస్వాగతం పలకాలని మేము ఏర్పాట్లు చేసి ద్వారసముద్రం వెళ్లినప్పుడు.. తమరు తుర్రుమని వచ్చేశారు. పృథ్వీని అడిగితే.. కోటలోకి కూడా కాలు పెట్టకుండా అప్పటికప్పుడే వెనుదిరిగావని చెప్పాడు”.
-మత్తి భానుమూర్తి
99893 71284