జరిగిన కథ : జాయపుని కళల కళాక్షేత్రం.. కూసెనపూండి కళాక్షేత్రం. కళాకారులకు ఇప్పుడొక తీర్థయాత్రా స్థలం. వెలనాడులోని సమస్త కవి పండిత వాద్య గాయక ప్రదర్శన కళాకారులకు స్వర్గధామం. సాధారణ పౌరులు కూడా కళాస్వర్గంలో ఉన్నామా!? అన్నట్లు.. కళ్లు తిప్పుకోలేనంత రమణీయ శిల్పశోభలతో అలరారుతున్న ప్రాంగణం. అన్ని సాహితీ కళా రంగాలలో కొత్త కొత్త సంప్రదాయాలను సృష్టిస్తున్న వాగ్గేయకారుల ఆవాసం. ఆ క్షేత్రంలో ఆరోజు విద్వత్ గోష్ఠి జరుగుతున్నది.
అప్పుడే లోనికి ప్రవేశించిన ఇద్దరు పండితులు జాయపునికి నమస్కరించి కూర్చున్నారు.
చర్చలో పాల్గొన్నారు.
అప్పుడే ఒకరు లేచి..
“తమరిని ఎక్కడో చూసినట్లుంది స్వామీ..” అన్నాడు.
గతుక్కుమన్నాడు జాయపుడు.
“బహుశా అనుమకొండ ప్రభువుల ఆస్థానంలో చూసి ఉంటారు తమరు..” అన్నాడు మరొకరు.
‘ఓహో.. ఈయన గారికి అలా అర్థమయ్యిందా!?’.. నోరు కట్టేసుకున్నాడు జాయపుడు.
“సాక్షాత్తూ గణపతిదేవుల వారి రాజబంధువులు అంటే సామాన్యమా..?!” మరో పండితుడు చేతులు జోడించాడు కూడా.
మహారాజులపై స్తోత్రపాఠాలు రాయడంతో మొదలవుతుంది.. ఎక్కువమంది పండితుల సాహిత్య రచన. కాబట్టి పొగడ్తలకేమీ తక్కువ కాదు.
“కాదుకాదు.. ఇక్కడే మన వెలనాడు ప్రభువుల ఆస్థానంలో చూసినట్లు గుర్తు..” మొదటివాడు వదలడం లేదు.
“అవును! వెలనాడు ప్రభువులు వారి బంధుగణం మహాదొడ్డ ప్రభువులు. వారు అన్నదమ్ములు, జ్ఞాతి సోదరులు ఒక్కలా ఉంటారని విన్నాను!”.
“అసలు వెలనాడు ప్రభువులను చూశావా!?”.
“అబ్బే! రోజూ దర్శించుకోవడానికి వారేమైనా గుడిలో విగ్రహాలా.. మహారాజులు! వారి పట్టాభిషేకానికి వెళ్లాను. కానీ అప్పటికే ఆలస్యం అయ్యింది. ఆ శుభకార్యం పూర్తయ్యి వారు లోపలికి వెళ్లిపోయారు. కానీ, సంభావన ముట్టింది లెండి!”.
మహారాజులను చూడటం సామాన్యులకే కాదు.. ప్రముఖులకు కూడా సాధ్యం కాదు. మహారాజును చూడటానికి గ్రామాల నుంచి, పురాల నుంచి వెళ్లడం సాధ్యపడదు. కొన్ని పండుగలలో, ఉత్సవాలలో మాత్రమే చాలామంది సామాన్యులు మహారాజులను, రాజబంధువులను చూడటం జరుగుతుంది.
“సరే సరే.. అసలు చర్చ పక్కదారి పట్టించకు కవివర్యా..” అంటూ జాయపుని వృత్తాంతం వదిలేశారు.
అయితే ఎప్పుడో ఒకప్పుడు గోష్ఠులలోనే తన పేరు, వివరాలు చెప్పాల్సి వస్తుందని జాయపుడు సిద్ధంగానే ఉన్నాడు.
“అలసిపోతిని చాలుసామి నీ చాతుర్య రతికి పలకరింపకు నన్ను పవ్వళింపనిమ్ము నేటికి చేర రమ్మని పిలిచి చెక్కిలి ముద్దాడి సురతకేళుల దేల్చి సొలియజేసితి వెంతో సరసాల రాయుడా సరిలేరు నీసాటి ధీరుడా సమరతులింకేల చాలును పోరా..”
నర్తిస్తూ పాడుతూ చక్కని పాదాల కదలిక.. హస్త ముద్రలు.. కరణలు.. మొత్తంగా ఓ అబ్బురం! రెప్పవేయకుండా చూస్తుండి పోయాడు జాయపుడు.
అతను వరదయ. అతణ్ని భాగవత సిద్ధయ గోష్ఠికి తీసుకుని వచ్చి జాయపునికి పరిచయం చేశాడు.
“స్వామీ.. ఇతను వరదయ. మా కూసెనపూండి వాడు. ఎక్కువగా దక్షిణాదిరాజ్యాలలో పర్యటిస్తుంటాడు. నాట్యం, గానంలో ఎంత పట్టున్నదో రచనలో అంతకంటే ఎక్కువ ప్రావీణ్యం సంపాదించాడు. మీ అనుజ్ఞ అయితే ఒక్కసారి.. వరదయ కాలు కదుపుతాడు!”.
అంత పొడగరి కానీ, పీల శరీరుడు. పూర్తి వైష్ణవ బ్రాహ్మణ ఆహార్యం. నీరుకావి పంచె వెలనాడు పద్ధతిలో కట్టి, నడుముకు చేనేత ఉత్తరీయం బిగించి.. ఫాలభాగాన వైష్ణవ తిరునామాలు, చెవులకు వేలాడుతున్న లోలకాలు. మొత్తంగా సౌమ్యంగా సుకుమారంగా గోచరించాడు జాయపునికి.
“ఊ.. రంగస్థలం అధిరోహిస్తానంటే ఆమోదమే కదా సిద్ధయా..” అన్నాడు జాయపుడు.
ఆ సుకుమార శరీరుడు ఏమి నర్తిస్తాడో చూడాలని అతనికి ఉబలాటంగా ఉంది.
పల్లవి : ఎవ్వడే వాడు ఓ భామ.. వాడెవ్వడే వాడు
అనుపల్లవి : ఎవ్వడే నేను పవళించిన వేళ..
పువ్వు బాణమువేసి రవ్వచేసి పాయె..
ఎవ్వడే వాడు ఓ భామ వాడెవ్వడే వాడు..
“పల్లవి, అనుపల్లవి తర్వాత చరణాలు.. ఇది నా రచనా శైలి. నేను వీటిని పదాలు అంటాను స్వామీ!”..
తన ప్రయోగాన్ని వివరించాడు వరదయ.
“ఓహో.. బావుంది. పల్లవి, అనుపల్లవి చరణాలు.. కొత్త ప్రయోగం. మధురభక్తి తత్వపు వైష్ణవ వాగ్గేయకారులన్నమాట తమరు!”.
ధాతువు (సంగీతం), మాతువు (సాహిత్యం) ఈ రెండిటిని మేళవించి.. దానికి నాట్యం కలిపి గేయంగా రచించి స్వయంగా ప్రదర్శనకారులైతే వారిని వాగ్గేయకారులు అంటున్నారు.
జాయపుని అభినందనకు పులకించాడు వరదయ.
“నివాసం ఏ గ్రామం?”.
“జన్మభూమి కూసెనపూండి. దక్షిణాది క్షేత్రాలన్నీ పర్యటిస్తుంటాను స్వామీ!”.
“మన కవిపండితులంతా ఏ రాజ్యంలో పర్యటించినా తాము వెలనాడు కళాకారులమని చెప్పుకోవాలి. తెలుగువారి నాట్య సంప్రదాయాన్ని రూపొందించాలని చక్రవర్తులవారి అభిలాష. మీరు కోరిన అగ్రహారం, అడిగిన సుక్షేత్రాలు.. కోరిన వెండిబంగారు వస్తువాహన ఏర్పాట్లు నాకు విడిచిపెట్టండి. ఇకపై వెలనాడు నివాసి అంటేనే తమరు మా క్షేత్రయ్య.. కాకుంటే.. పరక్షేత్రయ్య!”.
గోష్ఠిలోని యావన్మంది గొల్లున నవ్వారు. వరదయ వంగి చేతులు జోడించాడు.
“తప్పకుండా! వెలనాడువాసిగా.. తెలుగు కళాకారుడిగా వెళ్లినచోటల్లా చాటి చెప్పుకొంటాను స్వామీ..” అన్నాడు నిండు మనస్సుతో.
మరొకరోజు మరో ప్రతిభావంతుడు సారంగుడు అట. కూసెనపూండి వాడే. తాతలనాడే పర్యాటక పండితులు. అతను కూడా దక్షిణాదిరాజ్యంలో ఎక్కడో నివశిస్తున్నాడని భాగవత సిద్ధయ పరిచయం చేస్తూ చెప్పాడు. అయితే ఈ సారంగుడు వీణా వాద్యకారుడు కూడా.
పిలుచుక రావమ్మ సామి నీవేళ ॥ పల్లవి ॥
నెలతా ఈ పండువెన్నెల తాళజాలనిక.. ॥ అనుపల్లవి ॥
పాలు మాలుచు కమ్మ విల్తుని..
పాలు సేయక మేని సొమ్మక..
పాలు నీకిచ్చేను గూట దీ.. పాలు బెట్టే వేళకయినా
॥ పిలుచుక ॥
వీణ వాయిస్తూ ఆయన రచించి, అభినయంతో పాడుతూ గోష్ఠిలోని పండితపామరులను విస్మయపరచాడు.
“ఎక్కడో దక్షిణావర్తరాజ్యంలో మా కూసెనపూండి కళాక్షేత్రం గురించి చెప్పుకోవడం విని సంతోషంతో పరిగెత్తుకు వచ్చాను స్వామీ..” అన్నాడు సారంగపాణి.
“మీ ప్రతిభ వెలనాడుకి, కాకతీయ సామ్రాజ్యానికి వన్నెతేవాలి. మీకు సమస్త వనరులు నేను ఏర్పాటు చేయిస్తాను..” అభయమిచ్చాడు జాయపుడు.
“అంతకంటే మహద్భాగ్యం ఏముంటుంది స్వామీ! ఎక్కడున్నా వెలనాడువాడిగా చెప్పుకొంటాను” అన్నాడు సారంగుడు.
ఇలాంటి ఎందరెందరో వెలనాడు జన్మస్థానంగా కలిగిన సాహితీ మహామహులు కళాక్షేత్రం గురించి విని వచ్చి కలుస్తున్నారు. కళాక్షేత్రంలో నాట్యరూపక, యక్షగాన ప్రదర్శనలు ఇతర రాజ్యాలలో, ఇతర దేశాలలో సైతం గుర్తింపు పొందుతున్నాయి. జాయపుడు, పరాశరుడు, వరదయ, సారంగుడు మరెందరో రచించిన నాట్య రూపకాల ప్రదర్శనను తిలకించడం వెలనాడువాసులకు లభించిన ఓ మహద్భాగ్యం.
సోమాంబిక, భాగవత సిద్ధయ, పరాశరుడు, కంకుభట్టు, జాయపుడు.. వీళ్లంతా నటులు, నాట్యాచార్యులు, నాట్యప్రయోక్తలు కూడా. నాట్య విధివిధానాలలో పూర్తి అవగాహన కలిగి కొత్త కొత్త ముద్రలు, రేచకాలు, కరణులు, పిండిబంధాలతో కొత్త నాట్య సంప్రదాయాలను సృష్టించగలరు. సృష్టిస్తున్నారు కూడా.
కూసెనపూండి గోష్ఠిలో వీళ్లు ఉన్నారంటే నాట్య ప్రయోగాలపై చర్చలు ఎన్నో..
ఓరోజు గోష్ఠిలో హస్తలక్షణాలపై సోమాంబిక మాట్లాడుతున్నది.
“హస్తములు అసంయుతాలు, సంయుతాలు, నృత్తహస్తాలు.. అని మూడు వర్గాలు..” అంటూ హస్తాన్ని ఏ భావానికి అనుగుణంగా ఎలా పెట్టాలి, చూపాలి, వేళ్లను ఎలా ముడివెయ్యాలో నర్తిస్తూ చెబుతున్నది సోమాంబిక.
“ఈ హస్తముద్ర నిజానికి దేవతార్చనలో వాడతారు. కానీ, ఒక్కొక్కసారి ఏకాగ్రత తప్పి..” చెబుతూ టక్కున ఆగిపోయింది.
“ఊ.. ఊ.. వివరించండి పెద్దమ్మగారూ! ఆరోజు నా చెంప చెళ్లుమనిపించిన నా తప్పు ఏమిటో..” అన్నాడు జాయపుడు హస్యస్పోరకంగా. గోష్ఠిలోని కవిపండితులంతా ఆశ్చర్యపోయారు.
‘జగన్నాథులవారిని ఈమె చెంపపై కొట్టిందా??’.
“నాట్యభోగంలో నేను ఆరాళ హస్తం; పతాకహస్తం పట్టి చూపుడు వేలు వంచితే అది ఆరాళ హస్తం. ఆరోజు ప్రదక్షిణానికి ఈ ముద్రను పట్టాను. తమరేమో కటకముఖ హస్తం పెట్టారు..” ఆమె ఆపింది.
జాయపుడు భళ్లున నవ్వేశాడు.
సోమాంబిక చెప్పింది..
“కపిద్దహస్తం పట్టి చూపుడు వేలిని బొటన వేలుమీద నొక్కిపడితే.. అది కటకముఖ హస్తం అవుతుంది!”.
నాట్యాచార్యులైన అందరూ పగలబడి నవ్వుతున్నారు.
“కటకముఖ హస్తమా?! అది పళ్లు తోముకోవడానికి చూపుతాం కదా జగన్నాథా.. అదెలా చూపారు?!”.
నవ్వులే నవ్వులు..
పదం, పదకవిత, పాట, గేయం.. దేశీ సాహిత్యంగా చెప్పుకొంటున్నారు. యక్షగానాలు మధుర కావ్యాలుగా అనుకుంటే.. జాజర పాట, వెన్నెల పాట, అర్ధ చంద్రికలు, త్రిభంగులు, మటిమరేకులు, విరాళ పదములు, అల్లో నేరళ్లు, గొబ్బిపాటలు, ధవళములు, ఏలలు, సువాలలు, చిలుకపదాలు, తుమ్మెద పదాలు, ఏకతాళి (ఎగతాళి), తందాన పాటలు, జోలలు, జక్కుల రేకులు, దరువులు, చందమామ పదాలు, నట్తోట్లు, సుద్దులు, కూన రాగాలు, చిందులు, జక్కిణి, మంగళ హారతులు, జావళీలు, గీతార్థములు, కందార్థములు, సీసార్థములు.. ఇలాంటివి ఎన్నెన్నో స్వరతాళానుగుణమై, నిబద్ధానిబద్ధమై, శృంగార, నీతి, వైరాగ్యాది వస్తు గర్భితమైన పద సాహిత్యం పుంఖానుపుంఖంగా పుడుతున్నది. పామరులను అలరిస్తున్నది. కొందరు పండితులు సణుక్కున్నా గొణుక్కున్నా.. వీటిని గుర్తించక తప్పడంలేదు.
జాయపునికి అత్యంత ఇష్టమైన ఈ దేశీ సాహిత్యమంతా కూసెనపూండి కళాక్షేత్ర గ్రంథాలయం సేకరిస్తున్నది. ఆయా అంశాల్లో ప్రతిభావంతులైన కళాకారుల వివరాలు కూడా గ్రంథాలయంలో దొరుకుతాయి. అలాగే ప్రేరణి, రాసకం, చర్చరి, బహురూపం, భాండిక, కొల్లాటం, ప్రేంఖణం, గొండ్లి, దండరాసకం, ఘటసరి, శివప్రియం.. లాంటి వేరువేరు ప్రదర్శన కళలలో ప్రఖ్యాతులైన కళాకారులు ఇక్కడ ప్రదర్శనలివ్వడం ఓ అదృష్టంగా చెప్పుకొంటున్నారిప్పుడు.
అన్ని ప్రాంతీయ భాషలలో సాహిత్యం – కళలు వినూత్నంగా విరగబూస్తున్నాయి. తెలుగులో కూడా. ఒకప్పుడు పూర్తిగా సంస్కృతమయమైన పండిత సమాజం తెలుగు భాషను పరిపుష్టం చేస్తూ అన్ని రంగాల్లో సాహిత్య, గేయ, నాట్య రూపక సృష్టి బహుముఖాలుగా జరుగుతున్నది. సంస్కృతం పాతిక శాతం, తెలుగు ముప్పావువంతుగా సాహిత్యం వెలువడుతున్నది. సంస్కృతప్రియుడిగా ముద్రపడిన జాయపుడు.. ఇప్పుడు తెలుగు.. ముఖ్యంగా దేశీ తెలుగు అంటే ప్రాణం పెట్టడం కాలమహిమ.
వెలనాడు ఇప్పుడు సంస్కృత, తెలుగు దేశీ సాహిత్యానికి, నాట్యప్రదర్శనా కళలకు ప్రధానక్షేత్రంగా ఎదిగింది.
తెలుగువారి నాట్యకళా ప్రాభవాలకు ఘంటస్తంభంలా భాసిస్తున్నది. మార్గి, దేశీకావ్యాలు, గ్రంథాలు, నీతిప్రబోధాలు, పాట, పదం, కీర్తన, జావళి.. సమస్త సాహిత్యం, కవిపండితులు, నాట్య వాద్యకారులు జాయపుని కళాక్షేత్రంలో చేరిపోయారు. వెలనాడు రాజ్యపు సమస్త కవి పండితులతో ఏర్పడిన ఈ కళాసైన్యం త్వరలోనే ఓ కొత్త చరిత్ర లిఖించబోతున్నది.
‘యుద్ధ మంత్రాంగ మందిరానికి విచ్చేయవలసిందిగా జాయపులవారికి పృథ్వీశ్వరుల వారి విన్నపం!’..
వచ్చిన వేగులు లేఖ అందించారు. ఆశ్చర్యపోయాడు. భృకుటి ముడివడింది. దీని భావమేమి కైలాసవాసా?
ధనదుపురం చేరేవరకు కించిత్ సంభ్రమం.. మంత్రాంగ మందిరంలోకి ప్రవేశించాడు.
మండలేశ్వరుడు కూర్చునే రత్నఖచిత సింహాసనం ఖాళీగా ఉంది. పక్కనున్న మరో ఉన్నతాసనంపై పృథ్వీశ్వరుడు కూర్చుని ఉండగా.. ఆ పక్క ఆసనంపై సంధివిగ్రహి మాంకనభట్లు, అటు ఇటుగా మహామంత్రి దేవోజు, సర్వసైన్యాధ్యక్షుడు సూరమ దేవుడు, పది పన్నెండుమంది సైన్యాధ్యక్షులు, మరికొందరు మంత్రులు, కొందరు వేరువేరు నాడుల పాలకులు. కాస్త అవతలగా పల్యంకాలపై కొందరు శైవపండితులో, సాహితీవేత్తలో, పూజారులో, పౌరోహితులో, ఉపాధ్యాయులో.. పూర్తి శైవమత ఆహార్యంతో కనిపిస్తున్నారు. పైగా విచారగ్రస్తులై అవమాన భారంతో తలవంచుకుని కూర్చొని ఉన్నారు.
మందిరమంతా కాస్త గంభీరంగా ఉంది.
(సశేషం)
-మత్తి భానుమూర్తి
99893 71284