జరిగిన కథ : నందనరాయని చెరసాలలో మురారిదేవుడు బందీగా ఉన్నాడంటూ జాయచోడునికి లేఖ పంపాడు చక్రవర్తి. ఆ లేఖను చదివి దిగ్భ్రమ చెందాడు జాయచోడుడు. వెంటనే కదిలాడు. ధనదుప్రోలులో సైనిక పటాలాన్ని సిద్ధం చేయించి.. పొలిమేరల్లోనే ఉంచాడు. పెద్దసేనతో దండెత్తి వస్తాడని ఊహించిన నందనరాయడు.. జాయచోడుడు ఒంటరిగానే రాజధానిలో ప్రవేశించడంతో ఆశ్చర్యపోయాడు. పూర్ణకుంభ స్వాగతంతో ఆహ్వానించి.. ఆయనతో సమావేశమయ్యాడు.
“ఆ నీచుడు తమరి మేనల్లుడు అయినందుకు మేము ఆశ్చర్యపోతున్నాం జాయచోడదేవా!” అన్నాడు రాయడు. “క్షమించాలి నందనరాయా! మురారిదేవుని తప్పు ఏమిటో మీరు చెప్పలేదు. మహామండలేశ్వరులు శ్రీ గణపతిదేవుల సంతానం మురారిదేవుడు. అనుభవం కోసం చక్రవర్తి పాకనాడు రాజ్యానికి పాలకుడుగా నియమించారు. మురారి అక్కడ చేస్తోన్న పరిపాలన ఏమిటో.. మీపట్ల అనుచిత ప్రవర్తన ఏమిటో.. ఎందుకు మీరు కారాగారంలో బంధించారో నాకు తెలియదు. చెబితే మురారిపై తగినశిక్ష మహామండలేశ్వరులే నిర్ణయిస్తారు కదా..”“మా ఇంటి ఆడపడచును అపహరించాడు. తనను వివాహం చేసుకోవాలని బలవంతపెడితే మేమే వెళ్లి ఆమెను విడిపించి అతణ్ని బంధించి తెచ్చాం. ఇప్పుడు చెప్పండి. అతనికి తమరైతే ఏ శిక్ష విధిస్తారు?” అన్నాడు.
నిర్ఘాంతపోయాడు జాయచోడుడు.ఏదో కుటుంబ కలహాలు, అక్కా తమ్ముళ్ల మధ్య అంతఃకలహాలుగా ఉన్న మురారి వ్యవహారం ఇప్పుడు బహిరంగమై అతడొక కొరకరాని కొయ్యగా నిరూపితం అవుతున్నాడు. జాయచోడుడు ఏమీ చెప్పలేకపోయాడు.“మీ ప్రజ్ఞాపాటవాలు సామ్రాజ్యమంతా తెలుసు. మీరు గతంలో ఇక్కడ మతంపై నిర్వహించిన కళాయుద్ధంలో నేనూ పాల్గొన్నాను. నన్ను మన్నించి ఈ సమస్యను మీరే పరిష్కరించండి..” అన్నాడు రాయడు.“మనం యుద్ధభూమిలో లేము. ఇది పండిత సభ. నన్ను చూడటానికి ఇందరు కవిపండితులు ఇక్కడకు వచ్చారు. ఆ శిక్ష ఏమిటో ఈ సభ నిర్ణయిస్తే శిరసావహించడానికి సిద్ధంగా ఉన్నాను..” చెప్పాడు జాయచోడుడు.సభలో చర్చలు మొదలయ్యాయి. ఆలోచించి ఆలోచించి ఆస్థాన పండితుడు ఉరువేలశర్మ లేచాడు.“మహానాట్యకారులు మీరు. మురారిచేసిన తప్పుతో.. నిజానికి పెద్ద యుద్ధం జరిగి అటూఇటూ పెద్ద ప్రాణనష్టం జరిగేది. తమరు దానిని తప్పించి శిక్షకు సిద్ధమయ్యారు. అతను చేసిన తప్పునకు కనీసం ఆరునెలలు కారాగార శిక్ష ఉండాలని, మరోసారి ఆ తప్పు చేయనని అతడు అగ్నిపట్టి ప్రమాణం చెయ్యాలని మా తీర్పు..”
అందరి కరతాళ ధ్వనులతో సభ దీనిని ఆమోదించింది.
అప్పుడన్నాడు నందనరాయడు.
“మాది ఓ కోరిక. మీరు మా నాట్యమండపంలో నాట్యం చెయ్యాలి. అపర నటరాజైన తమరి ప్రదర్శన కోసం, మేము చాలా కుతూహలంగా ఉన్నాం..”
“మేనల్లుణ్ని విడిపించుకోవాలని వచ్చినవాణ్ని. నన్ను సన్మానంతో జయించారు నందనరాయడు. సభల్లో.. ముఖ్యంగా పండితసభల్లో మాట్లాడగల ప్రజ్ఞ నాకు లేదు. అందువల్ల భర్తృహరి సుభాషితం ఒకటి చెబుతాను.మూర్ఖోపి శోభతే తావత్సభాయాం వస్త్రవేష్టితఃతావచ్చ శోభతే మూర్ఖో యావత్కించన్నభాషతే..
(చక్కగా అలంకరించుకుని మాట్లాడకుండా కూర్చున్న నాబోటి వాడిని పండితులుగా భ్రమపడతారు. అది మాట్లాడనంత సేపే. మాట్లాడితే వాడి బండారం బయటపడి పోతుంది)
జాయచోడుడు వినమ్రతతో సందర్భానుసారంగా పద్యం చెప్పినప్పుడు కరతాళధ్వనులతో సభ మారుమోగిపోయింది.“నాకొక అభ్యంతరం. నేను రాజాస్థాన నాట్యమండపాలలో నాట్యం చేసే వయస్సు దాటిపోయాను. దేవాలయాల నృత్యమండపాలలో మాత్రమే నర్తిస్తాను”రాజధానిలోని చెన్నకేశవ దేవాలయంలో జాయచోడుని నాట్య ప్రదర్శన ఏర్పాటయింది.“మీకోసం ఓ కొత్త నాట్యం చేస్తాను. ఇది నటరాజ నృత్తం. దయచేసి మీరాజ్యంలోని ఓ నాట్యబృందాన్ని పిలిపించండి. నాట్యమండపమంతా పసుపు, కుంకుమ, ముగ్గుసున్నం కలిపి మిశ్రమం నిండుగా పోయించండి..” అన్నాడు.ఆయన సూచనలపై మండపమంతా మిశ్రమం నిండుగా పోశారు. నాట్యబృందంలోని నట్టువాంగ గాయకులకు, వాద్యకారులకు ప్రత్యేక సూచనలు చేసి నటరాజనృత్తం అనే కొత్త నృత్తాన్ని ప్రదర్శించాడు. ఆ మిశ్రమంపై ఆయన నటరాజుకు కైమోడ్పులిచ్చి గంటన్నర నర్తించాడు. వాద్య గాయకులు ఆయన వేగంతో పోటీ పడలేకపోయారు. దేహమంతా మిశ్రమంతో నిండిపోయి అర్చించిన నటరాజ విగ్రహమూర్తిలా భాసించాడు జాయచోడుడు. నాట్యం ముగిసిన వెంటనే మండపం నేలపై చూసి.. మహారాజు నందనరాయడుతో సహా ప్రేక్షకులంతా మ్రాన్పడిపోయారు. ఆయన నర్తించినచోట నేలపై పసుపు కుంకుమల మిశ్రమంతో చిదంబర నటరాజరూపం ఏర్పడింది.
అద్భుతం.. విభ్రమం! అనితరసాధ్యం!
ఆ నటరాజరూపాన్ని ఎన్నోఏళ్లు అలాగే ఉంచేశాడు నందనరాయడు. నటరాజ రాజధాని మొత్తం తరలివచ్చి ఆ నటరాజ మూర్తిని దర్శించింది.
ఆ నాట్య ప్రదర్శన గురించి దేవాలయ ప్రాంగణంలో శాసనం వేయించాడు రాయడు.
మేనమామను చూసి తల దించుకున్నాడు మురారి. మూర్తీభవించిన రాజరికపు మూర్ఖత్వంలా ఉన్నాడు.మురారితోపాటు జాయచోడుడు కూడా పాకనాడు వెళ్లాడు. అక్కడ మురారి ఏర్పరచుకున్న రాజవ్యవస్థను చూసి అవాక్కయ్యాడు. తండ్రి వద్ద తన విధానాలు చెల్లని మురారి.. ఇక్కడొక చిన్న సామంతరాజ్యాన్ని తన సామ్రాజ్యంగా రూపొందించుకుని ఇష్టారాజ్యంగా పరిపాలిస్తున్నాడు. ఆదిమకాలపు గణనాయకునిలా పూర్తి నిరంకుశపాలనతో ఆనందంగా జీవిస్తున్నాడు. గణపతిదేవుని ప్రజాస్వామ్య రాజ్యపాలనకు పూర్తిగా విరుద్ధం. కొడుకు పాలన చూస్తే ఆయన గుండె ఆగిపోతుందని అనుకున్నాడు జాయచోడుడు. అప్పటికే మురారి వివాహం ఏదో చేసుకున్నాడు. పట్టమహిషి కామితాంబ వేశ్యయువతి అట. ఆమెతోపాటు పదిమంది భార్యలు. మళ్లీ కందెనవోలు యువరాణిని చెరపట్టాడు. నందనరాయడితో యుద్ధంలో గెలవలేక చెరసాల పాలయ్యాడు.
“చేసిన నిర్వాకం చాలు మురారీ. ఇక అనుమకొండకు పద. తండ్రిగారికి ఏదో చెప్పి ఒప్పిస్తాను..”అక్కడున్న ప్రధానిని తాత్కాలిక పాలకుడిగా ప్రకటించి మురారిని భార్యతోసహా అనుమకొండకు తీసుకువచ్చాడు.అక్కడ ఏం జరిగింది? ఎలా తీసుకువచ్చావు? అన్న ప్రశ్నలన్నీ.. కొడుకు కంటికి కనిపించగానే తల్లిదండ్రులకు పక్కకుపోయాయి. గణపతిదేవుడు తేలికైన హృదయంతో జాయచోడుణ్ని అభినందనగా చూడగా.. నారాంబ కొడుకును హత్తుకుని గుండెలు పగిలేలా ఏడ్చింది. అతని రాకను తిరస్కారంగా చూసింది రుద్రమదేవి! మురారి తిరిగి రావడం.. అనుమకొండను రావణకాష్ఠం చేయడానికేనని ఆమె అభిప్రాయం. ఇప్పుడు రుద్రమకు కూడా జాయచోడుడు శత్రువు కాదేమో కానీ.. అయిష్టుడు!
కొడుకు, కూతురు ఇద్దరూ రాజ్యపాలనలోనూ, యుద్ధాలలోనూ తగినంత అనుభవజ్ఞులయ్యారు కాబట్టి గణపతిదేవుడు ఇద్దరికీ బాధ్యతలను పంచాడు. తనకు బాసటగా సామ్రాజ్యస్థాపన, యుద్ధాలు, సరిహద్దుల వివాద పరిష్కారం రుద్రమదేవికి ఇచ్చి, స్థానిక పరిపాలన మురారికి అప్పగించాడు.జాయచోడునిలాగే తండ్రికి ఏనాడూ ఎదురుచెప్పదు రుద్రమ. మురారి కూడా ఎదురు చెప్పిన సంఘటన లేదు. చేసే వెధవ పనులు చేస్తూనే ఉంటాడు. చేసేవాటిలో పరిపక్వత, జనామోదం ఉండవు. స్వతంత్ర పాలన అతని అభీష్టం. తిరిగి అనుమకొండ ప్రవేశించాడు కాబట్టి ప్రస్తుతానికి అంగీకారంగానే కొనసాగుతున్నాడు.
కళింగ రాజ్యంలోని తెలుగు ప్రాంతాలను తన సామ్రాజ్యంలో కలుపుకొన్న గణపతిదేవుడు.. ఈసారి కింద తొండమండలంపై దృష్టి పెట్టాడు. కంచి నగరాన్నిదాటి తెలుగు భాషీయులు ఉన్నారు. అటు నైరుతిలో హొయసల రాజ్యంలో కింది భాగం తెలుగువారే. ఒకప్పుడు మహాపాలకులైన పల్లవులు మహాబలిపురం దగ్గర చిన్నరాజ్యం పాలిస్తుండగా.. ప్రపంచ ప్రఖ్యాత చోళులు తంజావూరును ఆలంబన చేసుకుని నామమాత్రమై మిగలగా.. ఇప్పుడు అక్కడ ప్రచండంగా వెలిగిపోతున్నవారు పాండ్యులు, దేవగిరి యాదవులు.
పాండ్యరాజు విజయగండ గోపాలుడు కూడా పల్లవులు, చోళుల తీరులోనే సింహపురిని కబళించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తిక్కన మహాకవి చాకచక్యం, గణపతిదేవుని సహకారంతో అతని ప్రయత్నాలు సాగడంలేదు. ఈ దక్షిణావర్తంలోని తెలుగు ప్రాంతాలను కాకతీయ సామ్రాజ్యంలో కలపాలన్నది గణపతిదేవుడు, తిక్కనా మాత్యుల తీవ్రమైన వాంఛ.పొత్తపినాడు వద్ద స్కంధావారం ఏర్పరచి సుదీర్ఘయుద్ధానికి కాకతీయ చక్రవర్తి తరఫున రుద్రమదేవ మహారాజు సిద్ధం. ఇది త్రిముఖ యుద్ధం. యుద్ధతంత్రంలో భాగంగా కాకతీయ మహాయోధులతో మూడు ప్రత్యేకబృందాలు నిర్ణయించింది రుద్రమాంబ. ఒకబృందం దేవగిరిరాజుపై.. వాళ్లు ఆక్రమించుకున్న కంపిలి రాజ్యభాగాల కోసం. మరో బృందం కంచిపై.. మరో బృందం మార్జువాడిపై. అటు కన్నడ, తెలుగు ద్విభాషీయుల హద్దుల కోసం, ఇటు తెలుగు, తమిళ ద్విభాషీయుల హద్దుల కోసం, మూడోవైపు సరిహద్దుల మధ్యనున్న తెలుగు ప్రజలను సామరస్యంతో కలుపుకోవడం కోసం.
రెండవ మనుమసిద్ధి, గంగయ సాహిణి కలిసి సంయుక్తంగా పొత్తపినాడును ఆక్రమించిన రక్కస గంగడిపై విరుచుకుపడగా, గోన గన్నారెడ్డి, ముమ్మడిరెడ్డి ప్రభృతులు యాదవుల మీద దండెత్తారు. రుద్రమదేవి, సామంత భోజుడు తదితర కాకతీయ సైన్యం కంచి పాలకుడైన విజయగండ గోపాలునిపై యుద్ధం ప్రకటించారు.
ముప్పేటగా యుద్ధం చాలా భారీగా ప్రారంభమైంది.వృద్ధయోధుడు గణపతిదేవుడు అనుమకొండలో యుద్ధ సమన్వయం చేస్తున్నాడు.ఈ త్రిముఖపోరు దాదాపు రెండేళ్లు పరమ బీభత్సంగా సాగింది. ఎందరో సైనికులు మృత్యువాతపడ్డారు. మరెందరో సేనానులు క్షతగాత్రులయ్యారు. అందరూ తమతమ శక్తికొలది పోరాడారు. కత్తులతో కుత్తుకలను ఉత్తరించారు. కాళ్లు నరికేశారు. కళ్లు పెరికేశారు.ఎటు చూసినా కాళ్లు విరిగిన అశ్వాలు, తొండాలు తెగిన మత్తగజాలు, విరిగిన రథాలు. అంతా భీతావహం!!తాత్కాలికంగా యుద్ధం ఆపి ఇరువర్గాల చర్చలు.. ప్రాంతాల మధ్య పంపకం కుదరక మళ్లీ యుద్ధం.. మళ్లీ చావులు.. మళ్లీ చర్చలు.. మళ్లీ విఫలం. తిరిగి కత్తులు సానబెట్టడం..రుద్రమ కుడికన్ను పైభాగాన గంటుపడింది. ప్రసాదిత్య మూర్చపోయాడు. చెరకురెడ్డి వీరస్వర్గం అలంకరించాడు. ముమ్మడిదేవుడి చెయ్యి తెగింది. ఇరువర్గాలలో ఎందరో సేనానులు, మహాయోధులు నేలకొరిగారు.
అయినా ఎవ్వరూ వెనక్కు మళ్లలేదు. రక్కస గంగడు నేలకొరగగా.. ముందుగా పొత్తపినాడు పూర్తిగా కాకతీయుల వశమైంది. కంపిలి యుద్ధం కూడా కాకతీయపక్షాన్నే ముగిసింది. ఇరుపక్షాలూ చర్చలతో రాజ్యభాగాలను పంచుకుని స్నేహభావంతో యుద్ధం ముగించారు. గోన గన్నారెడ్డి, ముమ్మడి, గంగయ సాహిణి నేతృత్వంలోకి కాకతీయ సైన్యం కంపిలి రాజ్యాన్ని సాధించింది.అంతిమంగా అందరూ కలిసి మొత్తంగా కంచిపై దాడి చేశారు. విజయమో వీరస్వర్గమో అన్నట్లుగా సాగిన కంచియుద్ధం.. ఎట్టకేలకు విజయవంతంగా గెలుపుతో ముగిసింది. మార్జువాడి, మొరసనాడులో అనేక ప్రాంతాలు, కంచి రాజ్యంలోని ముఖ్యమైన తెలుగు గ్రామాలు కాకతీయ సామ్రాజ్యంలో భాగమైనట్లు కంచిలో విజయ శాసనం వేసింది రుద్రమ. దీంతో పరిపూర్ణ ఆంధ్ర సామ్రాజ్యం ఏర్పడినట్లయ్యింది.
జీవితంలో ఓటమి ఎరుగని గణపతిదేవుని ఆనందానికి హద్దులు లేవు. తెలుగు ప్రజలనంతా ఏకం చేశాడు. భాషలే ప్రధానంగా దక్షిణావర్తంలో ప్రాంతీయ భాషా రాజ్యాలు రూపుకట్టాయి. తమిళం మాట్లాడే రాజ్యమంతా తమిళదేశంగా, మలయాళం మాట్లాడే ప్రజలంతా మలయాళ దేశంగా, కన్నడభాష మరింత స్పష్టమై కన్నడ దేశంగా రూపొందాయి.
స్పష్టమైన సరిహద్దులతో ఆంధ్రరాజ్యం రూపుకట్టిన శుభవేళ.. కొత్త రాజధాని ఓరుగల్లుకు భారత అనువాదకర్త, తెలుగుభాషా రాజ్యంకోసం అహర్నిశలు తపించి పోరాడిన మహాకవి, రాజకీయ ధురంధరుడు తిక్కనామాత్యుని సలహామేరకు ఆంధ్రనగరి అని పేరు నిర్ణయించాడు గణపతిదేవుడు.మొత్తంగా ఆంధ్రులంతా ఏకమైనామని.. తెలుగుమాట్లాడే ప్రజలంతా ఒక్కటై సంబరాలు జరుపుకొన్నారు. తెలుగు కవులు, పండితులు, సంగీతజ్ఞులు, నాటకకర్తలు, విద్యావేత్తలు, వణిజ ప్రముఖులు, సమయ సెట్టిలు, నకర ప్రముఖులు, సమస్త సేనానులు, రాజవంశీయులు.. ఒకరేమిటి సమస్తజనులు ఓ సంయుక్త ఆత్మీయతతో పరవశించారు. తెలుగువారిని ఒక్క నుడిముడిలో, ఒక్క భావబంధంలో పొదిగి ఆంధ్రత్వం అనే భావన సమారూఢమైనది.“మేము ఆంధ్రులం. మా భాష తెలుగు. మేము తెలుగు ప్రజలం. మా తెలుగు చక్రవర్తి గణపతిదేవుడు. మేము చరిత్రకే గర్వకారణమైన కాకతీయ ప్రజలం. ఆంధ్రనగరి నివాసులం!!”
యుద్ధంలో సాటిలేని మహావీరురాలుగా పురుష సైన్యాధ్యక్షులతో సరిసమానంగా కొండొకచో ఓ బెత్తెడు ఎక్కువగా.. శత్రుదుర్భేద్యంగా ఇప్పుడు రుద్రమ వెలిగిపోతోంది. రాణి రుద్రమగా అఖండ భారత జననీరాజనాలు అందుకుంటోంది.మరి యుద్ధాలకు వెళ్లని మహానేతగా మురారిదేవుని పాలన ఎలా ఉందో చూడాలి!
(సశేషం)
విజయమో వీరస్వర్గమో అన్నట్లుగా సాగిన కంచియుద్ధం.. ఎట్టకేలకు విజయవంతంగా గెలుపుతో ముగిసింది. మార్జువాడి, మొరస నాడులో అనేక ప్రాంతాలు, కంచి రాజ్యంలోని ముఖ్యమైన తెలుగు గ్రామాలు కాకతీయ సామ్రాజ్యంలో భాగమైనట్లు కంచిలో విజయ శాసనం వేసింది రుద్రమ.దీంతో పరిపూర్ణ ఆంధ్ర సామ్రాజ్యం ఏర్పడినట్లయ్యింది.
-మత్తి భానుమూర్తి
99893 71284