చారిత్రక కాల్పనిక నవల జరిగిన కథ : ఓ పూర్తిస్థాయి నాట్యమేళంతో దక్షిణరాజ్య యాత్రకు కదిలాడు జాయపచోడుడు. వివిధ రాజ్యాలగుండా పోయిపోయి చేరరాజ్యం దక్షిణ సముద్ర అంచులవరకూ వెళ్లింది ఆ మేళం. అక్కడి నుండి కదిలి దేవాలయాలు, శిల్ప, నాట్య, సంగీత సంప్రదాయాలు చూస్తూ, పోల్చి, బేరీజు వేసుకుంటూ చేర రాజ్యాలు, తమిళ రాజ్యాల్లోని రాజాస్థానాలు, దేవాలయ స్థానాపతులు బలవంతం చేస్తే నృత్తం ప్రదర్శిస్తున్నాడు. కానీ, ఎందుకో మనసు లగ్నం కావడం లేదు. ఏదో చేశాడు అంటే చేశాడు!
చేర రాజ్యంలోని కథాకళి నృత్తం జాయచోడుణ్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అసలు సిసలు నృత్తంగా దానిని హృదయానికి హత్తుకున్నాడు. తమిళరాజ్యాలలోని దేవాలయాలు జాయచోడుణ్ని విస్తుగొలిపాయి. వాటిని ఎంత విశాలంగా నిర్మించారంటే.. రానున్నకాలంలో వాటిని పడగొట్టడం, పూర్తిగా తొలగించడం దాదాపు అసాధ్యం. భవిష్యత్తులో ఎవరు పాలకులైనా.. అవి అజరామరంగా నిత్య ధూపదీప నైవేద్యాలతో కళకళలాడుతూనే ఉంటాయి. అన్నిటినీ చూస్తూచూస్తూ చిదంబరం చేరుకుంది జాయచోడుని నాట్యమేళం.
చిదంబరం!!
ప్రపంచ అద్భుతాలలో అద్భుతం చిదంబర క్షేత్రం! భారతీయ మతవిశ్వాసాలు, జ్ఞానసంపన్నత, శాస్త్ర పరిణతి.. అన్నిటి సమ్మేళనమే ఈ నటేశ నాట్యక్షేత్రం.శివ రూపాలలో నటరాజ రూపం ఓ అద్భుతం.. ఊహాతీతం. ఎక్కడైనా లింగరూపమే స్థూపాకారంగా ఉంటుంది. పెద్ద కాకపోతే చిన్న. మరే శైవక్షేత్రంలోనైనా, అసలు ఏ దైవక్షేత్రంలోనయినా, ఏ దేవుడైనా నాట్యరూపంలో చూడలేదు. ఇక్కడ మానవరూపం.. పైగా నాట్యరూపం.. అంటే కళాత్మకతతో ఆధ్యాత్మికత.. ఇదొక గొప్ప రూపకల్పన. మహామహా శివభక్తులు, మఠపెద్దలు, శాస్త్ర సాంకేతిక విజ్ఞులు వచ్చి చూసి నిర్ఘాంతపోతున్నారు. భగవంతుని మొత్తం కార్యకలాపాలన్నిటినీ గుదిగుచ్చి నటరాజ రూపం కల్పించారనిపించింది జాయచోడునికి. అదే నృత్తం. అదే తాండవం. అది పూర్తి జీవితానికి ప్రతీక. అది ఆనంద తాండవంతో మొదలయ్యి ప్రళయ తాండవంతో అంతం అవుతుంది. బతుకంతా లయాత్మకమే. ఈ లయబద్ధమైన మొత్తం విశ్వంతరాళాన్ని నటరాజ విగ్రహరూపం చెబుతోంది. ఇది ఒక్కరోజులో రూపకల్పన పూర్తయిన రూపం కాదు. ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నెన్నో ఆలోచనలతో సృష్టి – స్థితి – లయ సమ్మేళనానికి ఓ ఆకారం కల్పిస్తున్నారు.
ఎవ్వరో తెలియని ఆ మహాస్రష్టలకు కోటి దండాలు!
ఈ గుడి అదేదో భూమధ్యరేఖపై ఉన్నదట. ఈ రేఖపొడవునా పైన మరెన్నో గుడులు ఉన్నాయట. వాటిపై ఆసక్తి లేదు జాయచోడునికి. ఆ నటరాజమూర్తి! పెద్దలు, ఆలోచనాపరులు శివునికి నాట్యరూపం కల్పించడంలో పరమార్థమేమిటి.. అదే జాయచోడుణ్ని రంజింపజేస్తోంది. రగిలింపజేస్తోంది. ఓ మూల కూర్చుని తదేకంగా ఆ నాట్యమూర్తినే చూస్తుంటాడు. అప్పటికి చిదంబరం వచ్చి రెండు మాసాలయ్యింది. ఏదో స్తబ్ధత.. కాదు కాదు. అయోమయం!
వెళ్లాలని లేదు. ఉండాలని కూడా లేదు. అన్నిటినీ, అందరినీ వదిలి ఇక్కడే ఉండిపోతే!?
ఊహు!! అది తన తత్వం కాదు. సమాజం నుండి పారిపోవడం తనకు అంగీకారం కాదు. ఆ ప్రాంగణంలోనే నారాయణుడి గుడి కూడా కట్టారు. బహుశా వైష్ణవ ప్రభావం లేదా తిక్కనామాత్యులు తెలుగు రాజ్యాలలో ప్రచారం చేస్తున్న హరిహరతత్వం ప్రబలినాక కట్టారేమో.. అసలు తనెవ్వరు? శైవుడా వైష్ణవుడా? లేక హరిహరుడా? ఊహు.. తను నటరాజు అంతే! నటేశుడు!! నిత్యమూ ప్రదక్షిణ చేస్తాడు. ఒక్కసారి కాదు.ఎన్నోసార్లు. ఓసారి రెండు ఓసారి వంద.. మరోసారి నూటెనిమిది. ప్రదక్షిణ వెంట ఏదో ఒక లౌకిక విస్మయం.. ఓ అలౌకిక ఆర్తి.. ఓ పారలౌకిక తృప్తి.. ఆ మూర్తిని చూస్తుంటే తననే చూస్తున్నట్లు. తనకు ఆయన చిన్మయ నృత్తాన్ని చూపుతున్నట్లు. ‘నువ్వు కూడా ఆడు’ అన్నట్లు.నిత్యమూ అక్కడ కొందరు గాయక నాట్యకారులు తాము రాసిన.. ప్రముఖులు రచించిన కీర్తనలను, స్తోత్ర స్తవాలను పాడుతుంటారు. వాటిని విశ్లేషిస్తూ వ్యాఖ్యానిస్తూ మరికొందరు ఉపన్యసిస్తారు. జైమిని మహర్షి రచించిన వేదపాద స్తవం.. వ్యాఘ్రపాదుడు రచించిన వందన స్తోత్రం.. పాడతారు. పాడుతూ ఆడుతుంటారు మరికొందరు.
ఆ స్తోత్రాలను వింటుంటే ఓ జలదరింపు ఏదో ఊపు!!
ఓరోజు ప్రదక్షిణ చేస్తున్నాడు. ఎవరో గొంతెత్తి దీర్ఘశ్రుతిలో తీవ్రధ్వనితో ఏదోగానం చేస్తున్నారు. అది అద్భుతంగా మనసును శరీరాన్ని చుట్టేసి ఊపేస్తోంది. అందులో ఏదో లయ ఉంది. కదలిక ఉంది. నాట్యకారుణ్ని కదిపి కుదిపేసే మాహాత్మ్యం ఏదో ఉంది. గుర్తించాడు.. అది పతంజలి మహర్షి రచించిన నటేశ నవకం. సదంచిత ముదంచిత నికుంచిత పదం.. ఝల ఝలం చలిత మంజు కటకమ్ పతంజలి దృగంజన మనంజన మచంచలపదం.. జనన భంజనకరమ్ కదంబరుచిం అంబరవసం పరమ మంబుద కదంబక విడంబక గళమ్ చిదంబుధిమణిం బుధహృదంబుజ రవిం పరచిదంబర నటం హృది భజ ॥
(సత్పురుషుల చేత పూజింపబడేవి, దేవతల ఆనంద నటనంలో ఘల్లుఘల్లుమనే అందియలున్న ఆ శివుని పాదాలు నృత్తమాడుతున్నాయి. పతంజలి హృదయ జ్ఞానాన్ని తెరచినవాడు, జనన మరణచక్ర నాశనకారి, కదంబవృక్ష పరిమళం కలిగి ఆకాశాన్ని వస్త్రంగా ధరించినవాడు, నీలిమేఘపంక్తిని పోలిన కంఠధ్వని కలవాడు, జ్ఞానసముద్రంలో మణి వంటివాడు, పండితుల హృదయ కమలాలకు వెలుగునింపే సూర్యునివంటివాడు, నటనలో అద్వితీయుడై చిదంబర నివాసి అయిన నటేశుని హృదయంలో భజించు)
అలా తొమ్మిది శ్లోకాల అనంతరం పదవ శ్లోకంలో ఫలశ్రుతి చెప్పాడు పతంజలి మహర్షి. కళ్లుమూసి చేతులు జోడించి ప్రదక్షిణ పథంలో నడుస్తూ వింటున్న జాయచోడునికి అందులోని అర్థం కంటే.. లయ ఎక్కువగా ఊపేస్తోంది. దగ్గరగా ఓ శైవుడు ఉద్విగ్నంగా పాడుతుంటే కాళ్లు తడబడుతున్నాయి. అవి రానురానూ నాట్య పాదముద్రలుగా మారుతున్నాయి. అది జాయచోడునికి తెలియడం లేదు.వాద్యకారులు పరుగుపరుగున వచ్చి ఆయన చుట్టూ చేరి, తమ వాద్యాలతో ఆ నటేశ నవకాన్ని వాయిస్తున్నారు. ఆ నటేశ నవకానికి అనుగుణంగా జాయప శరీరం నృత్తమాడుతోంది. ఉద్వేగంతో నేలపై పడి పాకుతూ నృత్తిస్తున్నాడు. ఆ శ్లోకంలోనే సర్ప లయ, కుండలిని జాగరణ జరిగి సర్పంలా అది పైకి పాకుతోంది. తెలియకుండానే ప్రాణాయామం జరుగుతోంది.
పదవ శ్లోకంలో ఫలశ్రుతి పాడుతున్నప్పుడు జాయచోడుడు నటరాజ విగ్రహం ముందుకు వచ్చాడు. ఆ నటరాజు ముందు ఎడమకాలు ఎత్తి కటిభాగం వద్ద నిలిపాడు.. అచ్చం నటరాజ స్వామిలా!అదొక కరణి.. భుజంగత్రాసిత కరణి. స్వామి కూడా సంతుష్టుడై చిన్మయంగా ఆశీర్వాదంగా చూస్తున్నట్లు భావన.. శరీరమంతా వణుకుతుండగా ఏదో సుషుప్తిలోకి జారిపోయాడు. స్పృహ తెలియదు.చాలాకాలంగా విభూతిని నుదుట దాల్చడం మానేశాడు. కానీ, ఇప్పుడు నటేశ నవకానికి నృత్తమాడుతూ విభూతిలో దొర్లడంతో శరీరమంతా విభూతి. చివ్వున లేచి నిలబడ్డాడు. విభూతి నాగునిలా..తాను శైవుడు కాదు.. వైష్ణవుడు కాదు.. తానే ఆ నటేశుడు. సాక్షాత్తూ నటరాజమూర్తి!!
ఉద్వేగంతో చివ్వున నుదుట విభూతి పెట్టుకున్నాడు!!మతయుద్ధ సందర్భంలో వదిలేసిన విభూతి మళ్లీ ముఖాన వెలసింది.. జీవితాంతమూ ఉండిపోయింది. జీవితంలో మళ్లా ఆయన నాట్య శాస్త్రీయతలో.. తన్మయత్వంలో ఎలాంటి లోటూలేదు! రాలేదు!!
రాజధాని అనుమకొండ హడావుడిగా ఉంది.ప్రవేశిస్తూ జాయచోడుని బృందమంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. పరాశరుడు పక్కగా పోతున్న వ్యక్తిని అడిగాడు.
“ఏమిటి.. సందడి?”వాడు రోతగా చూశాడు.“ఎక్కడున్నావ్ పెద్ద మడిసి.. యుద్ధమయ్యా.. యుద్ధం!!”మరి రెండు గంటలకు జాయచోడునికి పిలుపువచ్చింది చక్రవర్తి నుండి.“నీ రాక కోసమే చూస్తున్నాం. కొలనిపై యుద్ధం చేయక తప్పడంలేదు. పిల్లలను కొంతకాలం తర్వాత యుద్ధానికి సిద్ధం చేయాలనుకున్నాం. కానీ, యుద్ధంలో పాల్గొనాలని రుద్రమ ఉవ్విళ్లూరుతోంది. ఆమెకు సరైన మార్గదర్శనం చేస్తారని తమరిని శూన్యపాలకునిగా నియమిస్తున్నాం!”తల ఊపడం తప్ప మరో ఆలోచనలేదు. ప్రయాణ బడలిక కూడా తీర్చుకునే సమయంలేదు. అప్పటికే యుద్ధ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నిడుదప్రోలు పొలిమేరల్లోని కాకతీయ స్కంధావారానికి చేరాడు జాయ చమూపతి.యుద్ధ హడావుడి.. గొల్లెనలో కవచం తొడుగుతున్న జాయచోడునికి ఏదో అలికిడి అయ్యి తలతిప్పి చూశాడు.రుద్రమదేవుడు!!పూర్తి యుద్ధ సంసిద్ధతతో వచ్చిన రుద్రమాంబ. పోతపోసిన కంచువిగ్రహం లాంటి శరీరానికి నడుము వరకు నిండు కవచం, శిరస్ర్తాణం, నడుముకు ఖడ్గం, నడికట్టులో చురకత్తి, వీపున డాలు, బరిసె, అమ్ములపొది, కుడి చేతిలో ధనుస్సు, మరో చేతిలో ఇనుపతీగెల రక్షణ వల.నొసట విభూతి అడ్డగీతలపై నిప్పుకణికలా వెలిగిపోతున్న ఎర్రని బొట్టు..
నిలువెత్తు ఏకవీరాదేవి. కాకతీయవీరత్వం మూర్తీభవించిన మహిళా యుద్ధస్వరూపం!
“ఆశీర్వదించు మామా! తొలిసారి యుద్ధక్షేత్రంలో అడుగు పెడుతున్నాను” అన్నది.వంగింది.. పాదాలవైపు. ఆపి హత్తుకున్నాడు. ఉద్వేగంతో కళ్లు నీటి చెలమలయ్యాయి. భర్తృహరి శ్లోకం చెప్పాడు.“సింహః శిశురపి నిపతతి మదమలిన కపోల భిత్తిషు గజేషు ప్రకృతి రియం సత్వవతాం నఖలు వయస్తేజసాం హేతుః ॥
(మదమంతా స్రవించి గోడల్లా కట్టిన నుదురు కలిగిన మహా మత్తగజాన్ని చూసి పిల్ల సింహం భయపడదు. యుద్ధానికి దూకుతుంది. సింహానికి వయసుతో పనేముంది?)
పోరాడు చిన్నతల్లి.. పోరాడు! కాకతీయ సామ్రాజ్యం కోసం పోరాడు. ఆంధ్ర సామ్రాజ్యం కోసం పోరాడు. గణపతిదేవుని కూతురునని నిరూపించు..
విజయోస్తు!!”
మొదటిరోజే యుద్ధరంగంలో బీభత్సం సృష్టించింది రుద్రమ. వెంట ఉన్న సేనానులకు చెప్పాడు జాయచోడుడు. “ఆమె తొలిసారి యుద్ధరంగంలోకి వచ్చింది. ఉద్రేకం, ఉత్సాహం తీవ్రంగా ఉన్నాయి. జాగ్రత్త. రుద్రమకు రక్షణ వలయంగా ఉండండి” రుద్రమ తన యుద్ధవిద్యా ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ శత్రుమూకలను చెల్లాచెదురు చేస్తోంది. ఓ మహిళా యోధురాలు యుద్ధం చేస్తుండగా చూడటం ఇరువర్గాల సైనికులకు అబ్బురంగా తోచి కళ్లప్పగించి చూస్తున్నారని వార్తలు.. స్కంధావారంలోనూ, అనుమకొండ సమన్వయ కేంద్రంలోనూ, రాజప్రాసాదంలోనూ ఆనందం నింపాయి. శత్రు యుద్ధ ప్రముఖులు రుద్రమ దూకుడును కొన్నిరోజులపాటు జాగ్రత్తగా గమనించారు. ఆమె ఖడ్గ ప్రహారం, విల్లంబు సంధించే ఒరవడి పరిశీలించారు. పక్షంరోజుల తర్వాత ఆమెపై మూకదాడి చేశారు. తనపై ఒక్కసారిగా చుట్టుముట్టిన శత్రుసైనికులను నిలువరించడానికి ఆమె శక్తి సరిపోలేదు. మంద దాడి చేస్తే ఎలా తప్పించుకోవాలో ఆమెకు తెలియలేదు. శత్రుసేనానులు ఆమె కాళ్లకు గురిచూసి బాణాలు వేసి, కత్తులతో దాడిచేశారు.అప్పుడొక యువ సేనాని అడ్డుకున్నాడు.
లేకపోతే ఆమె రెండు కాళ్లనూ నరికివేసేవారే. ఓ యువవీరుడు శత్రు ఖడ్గ ప్రహారాల నుండి ఆమెను రక్షించాడు. కానీ అప్పటికే చాలా బాణాలు ఆమె రెండుకాళ్లలో దిగబడిపోయాయి. ఆ వీరుడు ఆమెను గభాలున ఎత్తి తన రథంలో పడుకోబెట్టగా.. ఆ రథం వేగాతివేగంగా యుద్ధభూమి నుండి అదృశ్యమైపోయింది. కాకతీయ సైన్యంలో కలవరం.. రథం ఎటు వెళ్లినట్లు? అప్పటికే జాయసేనాపతికి సంగతి తెలిసింది.
ఆమెను శత్రు సేనానే మాయం చేశాడా?
ఆ యువ సేనాని ఎవ్వడు?(సశేషం)
-మత్తి భానుమూర్తి
99893 71284