Jaya Senapathi | జరిగిన కథ : అనుమకొండలోలాగే వెలనాడు సమాజంలో తిరగాలనీ, ప్రజలతో మిళితం కావాలని అనుకున్నాడు జాయపుడు. చతుష్పథాల వద్ద, వెలివాడల్లో.. తిరుగుతూ లోకధర్మి, నాట్యధర్మి.. రెండూ అవలోకించాలని నిర్ణయించాడు. అందుకే.. సాధారణ దుస్తులలో తలగడదీవికోట దాటి బయటికి వచ్చాడు. చేతులు వెనక్కు కట్టుకుని వీధులను, అంగళ్లను చూస్తూ ప్రధానవీధిలో నడుస్తున్నాడు. అప్పుడే..
‘ఓయ్.. తప్పుకో తప్పుకో!’ అని ఎవరో అరవడంతో ఒక్కసారిగా పక్కకు జరిగాడు.
ఏరువనాడు గిత్తలతో కైలాసదేవుని రథంలా ఉరికురికి వస్తోన్న ఎడ్లబండి!!
అడ్డం నిలబడినవాణ్ని కొమ్ములతో సున్నితంగా పక్కకు నెట్టేసి వెళ్లిపోయే వృషభ రాజాలతో.. వెలనాడురాజ్య ఉన్నతత్వానికే ప్రతీకగా ఉన్న ఆ బండి సాగిపోయింది ముందుకు. రెండు ఎడ్లబళ్లు నడుస్తుంటే చాలు.. ఆ వీధి వీధంతా శివుని నాట్యపు ఘలంఘలలతో పరిమళిస్తుంది. అలాగే గుర్రాలు, ఏనుగులు కూడా అత్యుత్తమ జాతివి. ఎంత సొమ్మయినా పెట్టి అన్న పృథ్వీ దిగుమతి చేస్తున్నాడు కాబోలు అనుకున్నాడు. వీధులు, డొంకలు, వాడలు.. అంతటా ప్రవహించే ఉన్నత జీవిత కెరటాల సవ్వడి.
అప్పుడే దగ్గరలో ఏదో సంగీత ధ్వని.. రుచి తెలిసిన గజ్జెలఘోష! పసిగట్టాడు. వీరనాట్యం. దగ్గరలో జరుగుతున్నది. ఆ శబ్దాలు వినవచ్చే వైపు శరీరం లాగుతున్నది. వినవచ్చిన సందు మలుపు వైపు చూశాడు. ఆ సందులో ఏదో దేవాలయం ఉండొచ్చు. అక్కడ ఏదో నాట్య ప్రదర్శన జరుగుతూ ఉండవచ్చు. అటుగా చూస్తున్నాడు.
ఆ సందు మలుపువద్ద ఉన్న దుకాణం ముందు ఒకరిద్దరు కదులుతుండగా వాళ్ల చాటున ఎవరో స్త్రీ తననే చూస్తున్నట్లు చూసి మాయం!!
అరె.. కాకతి.. ఆమె ఆమె.. కాకతి కదూ!?అటు పరుగు పెట్టాడు. రెండు అంగల్లో ఆ సందుమలుపు వద్దకు చేరాడు. ఎవ్వరూ లేరు. కానీ దూరంగా ఏదో దేవాలయం. దాని ముందు పెద్దగా గుమికూడిన జనం. ఊగుతున్నారు. ఎగురుతున్నారు. చేతుల్లో శూలాలు, బరిసెలు.. వాటిని తిప్పుతూ రౌద్రవంగా నాట్యమాడుతున్నారు. డప్పులు.. రుంజలు.. సన్నాయిలు.. డోలు.. కాహళి.. నాట్యం కనిపిస్తూ వినిపిస్తున్నది.
అక్కడ కాకతి ఉన్నదేమో!?
దగ్గరకు వెళ్తున్న కొద్దీ ఒళ్లు ఝల్లుమంటున్నది. అది ప్రేరణ నృత్తం. ఎవరో బృందం ఉధృతంగా నృత్తమాడుతున్నారు. అందులో తను ఏర్పరచిన నాట్యధర్మం కించిత్ కూడా లేదు. అప్పుడు హఠాత్తుగా వెన్నున చరిచినట్లు గుర్తొచ్చింది. అనుమకొండ స్వయంభూ దేవాలయం వద్ద భైరవ ఉద్వేగంతో కత్తి పట్టి నర్తిస్తున్నట్లు!!
ఆ దృశ్యం ఇన్నాళ్లకు మళ్లీ ఇక్కడ ప్రత్యక్షమయ్యింది. నటులంతా భైరవుల్లాగా.. కత్తులతో బరిసెలతో శూలాలతో.. శ్రుతిమించి నాట్యమాడుతూ.. అచ్చం భైరవలాగే ఇప్పుడో మరుక్షణమో.. తల నరుక్కుంటారేమో!. భయవిహ్వాలతతో వణికిపోయాడు. ఏదో చెయ్యాలి.. ఆత్మాహుతి చేసుకోకుండా ఆపాలి. కళ్లు గిర్రున తిరుగుతున్నాయి. ఒళ్లు చెమటతో తడిసిపోతున్నది.
అప్పుడు చూశాడు. దూరంగా కాకతి.. లాంటి స్త్రీ. ముందు పరిగెడుతున్నది. తనను చూస్తూ పారిపో పారిపో అన్నట్లు చేతులు ఊపుతూ పరుగుపెడుతున్నది. అచ్చంగా అప్పుడు కూడా.. భైరవ తలనరుక్కున్ననాడు.. ఇలాగే భయవిహ్వాలతతో పరుగులు పెట్టింది.
భైరవ తల నరుక్కున దృశ్యం మళ్లీ మళ్లీ ఆ వాయిద్యాల హోరులో కంటిముందు పునరావృతం అవుతున్నది.
చటుక్కున ఆమె వెళ్లినవైపు తనూ పరుగుపెట్టాడు. ఆమె కనిపించలేదు కానీ జాయపుడు పరుగు ఆపలేదు. పోయి పోయి ఎదురుగా మరో గుడి ముందు మరో నాట్యదృశ్యం కనిపించడంతో అక్కడ ఆగిపోయాడు. ఇదేమిటి.. ఇక్కడ ఈ ధనదుపురంలో ఎక్కడ చూసినా అదే ఉద్రేక నాట్య బీభత్సమా!? శివా.. ఎలా బతకాలి ఇక్కడ?? రొప్పుతూ నిలబడిపోయాడు. అయితే అప్పుడు గుర్తించాడు. ఆ సంగీతం సౌమ్యంగా ఉంది. ఆహ్లాదంగా చెవికి సోకుతున్నది. నాట్యం తిలకిస్తూ పౌరులు మృదువుగా నవ్వుతున్నారు. చిన్నగా కరతాళధ్వనులు చేస్తున్నారు.
చిత్రంగా ఆ ప్రదర్శన ఆహ్లాదంగా, కనులకింపుగా ఉంది. డోళ్లు, సన్నాయి శబ్దాల కంటే నటుల కాలిగజ్జెల ధ్వని ఎక్కువగా చెవికి ఆనుతున్నది. నాట్య సంగీత విశారదుడైన జాయపుడు క్షణికంలో ఆ నాట్యాన్ని, అక్కడ గుమికూడిన జనులను గుర్తించాడు.
భయం భయంగానే ఒక్కొక్క అడుగు వేస్తూ దగ్గరికి వెళ్లాడు. అదొక లాస్య ప్రధాన నాట్యకలాపం. కాస్త ముందుకెళ్లి ప్రేక్షకులలో కలిసి పరిశీలనగా చూడసాగాడు. మగ ఆడనటులంతా ముఖాన నామాలు, తిరుచూర్ణపు నిలువుబొట్లు పెట్టుకున్నారు. నాట్యం లలితంగా, సరళంగా ఉంది. లాస్య నాట్యాలు గురుకులంలో అభ్యసించాడు.. చేశాడు. రాజాస్థానంలో చూడటమే ఎక్కువ కానీ, బయట వాటి ప్రదర్శన చూసింది తక్కువ. ఆ శివాలయం వద్ద ప్రేరణ నాట్యం కలిగించిన భయానక ఉద్వేగం ఈ నాట్యం చూశాక పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు ప్రశాంత చిత్తంతో ఈ నాట్యాన్ని పరిశీలించసాగాడు. గాయకులు పాట ఎత్తుకున్నారు. ధీర సమీరే.. యమునా తీరే.. సంస్కృత గీతం. గతంలో విన్నట్లు.. మరింత కళ్లు చికిలించి చూస్తూ గుర్తు తెచ్చుకోడానికి యత్నించాడు.
గుర్తొచ్చింది. అప్పుడెప్పుడో నీలాంబ అక్కతో.. ఇదే పాటకు నర్తించాడు. పూర్తిగా గుర్తొచ్చింది. పద్మాక్షి అక్క పెళ్లిలో.. చౌండ బాబాయగారి గృహంలో!
మార్గి నాట్యప్రదర్శన వీధులలో చేయడం బహు బాగుంది. ఉత్సాహంగా ముందుకు వెళ్లబోయాడు. పక్కనున్న పెద్దమనిషి చికాకు పడిపోయాడు.
“ఎవడ్రా నువ్వు??” పెద్ద గొంతుతో అరిచాడు.
అతని అరుపుతో జాయపుడు ఆగిపోయాడు.
“ఇది నాట్టెం.. గొడ్లు కాయడం కాదు!” ఆ పక్క ప్రేక్షకుడు మరింత గొంతు పెంచాడు. అనుమకొండ ప్రజలు ఎప్పుడూ ఇంత గడుసుగా మాట్లాడటం వినలేదు. ‘నేనెవరో తెలుసా!?’ అనబోయి ఆగిపోయాడు. తానిప్పుడు ఇక్కడ సామాన్యుడు. తననెవ్వరూ గుర్తించలేదు. కావాల్సింది అదే కదా.. మౌనంగా ఉండిపోయాడు. నాట్యకార్యక్రమం పూర్తయ్యింది. వెంటనే మరో బృందం గోలగోలగా రంగమండపం పైకి వచ్చింది. నిర్వాహకుడు ముందుకొచ్చి అందరినీ కూర్చోమని కోరాడు. జాయపునికి అటూ ఇటూ నిలుచున్నవాళ్లు కూడా కింద కూర్చున్నారు. జాయపుడు కూడా మొదట సంశయించినా.. నేలపై కూర్చోక తప్పలేదు.
“గొల్లవారి వాడాలకు కిష్టమూరితి నువ్వూ..
ఏమి పనులకొచ్చినావూ కిష్టమూరితి..
పాలు గొన వచ్చినానే గొల్లభామా..
మంచి పాలుపోసి నన్ను బంపు గొల్లభామా..”
కాళ్లకు గజ్జెలు.. చేతుల్లో పొడవైన చెక్క చిడుతలు.. పాటతో చిడుతల శబ్దం, గజ్జెల శబ్దం కలగలిసి.. ఒక్కక్క చోట గాత్రాన్నిమించి.. చిడుతల శబ్దం.. తదనుగుణంగా సున్నితమైన చిందు.. గెంతు.. కాళ్ల లయబద్ధ కదలిక.. ‘వహ్వా వహ్వా.. భలే ఉందే!’ అనుకున్నాడు జాయపుడు. సాధారణ ప్రేక్షకులైతే రసానందంలో ఓలలాడుతున్నారు. కృష్ణమూర్తిని కిష్టమూరితి అనడం.. స్థానిక మాండలిక నుడికారం.. కించిత్ ఛందోజ్ఞానం..
తగినట్లు పదాలను సంగీత లయలోకి మలచుకోవడం.. గొల్ల స్త్రీకి, కొనుగోలుదారుకి సంవాద విధానంలో పాట. బాగా నచ్చింది జాయపునికి.
ఎన్ని గ్రంథాలు చదివినా.. కొత్త రూపకల్పనా లోకాలలో విహరించినా.. కళల ప్రదర్శన చూడటం ఎప్పుడూ నయనానందకరమే.. మనోహరమే!
ఇది గుండయా మాత్యవర్యులు చూసినా తనలాగే ముచ్చట పడతారు గదా అనిపించిందతనికి.
“కొత్త కోడలునయ్యా కిష్టమూరితీ..
అత్తగారి నడుగదవయ్యా కిష్టమూరితీ..
కొత్త కోడలువైతే గొల్లభామా..
నే నాణాలిత్తు పుచ్చుకొనవే గొల్లభామా..”
కృష్ణమూర్తి, గొల్లభామ సంభాషణ. అందులోని సరసత, ముఖ్యంగా సంక్లిష్టంకాని తియతియ్యని జాను తెలుగు కొత్త అనుభవం జాయపునికి. అయితే ఇదే పాటకు దండరాసకంగా కర్రలు మోయిస్తూ ఆడవచ్చు. ఇక్కడేం అంటారో ఈ నాట్య సంప్రదాయాన్ని..?!
అప్రయత్నంగా పక్కన కూర్చున్నవాణ్ని అడిగాడు.
“ఇదేం నాట్యం మిత్రమా?” అని.
వాడు మళ్లీ వింతగా చూశాడు.
“ఇది తెలవదా.. చిందు భాగోతం!” అన్నాడు అదే పెద్ద గొంతుతో.
“నాణాలు మాకు వద్దయ్యా కిష్టమూరితీ..
కోటప్ప కన్నా ఇయ్యవయ్యా కిష్టమూరితీ..”
గానం.. చిందు మరింత ఉధృతం అవుతున్నది.
కింద కూర్చున్న జాయపునికి ఎదురుగా కార్యక్రమం జరుగుతుంటే.. అక్కడున్న దివిటీల కాంతి నటులపై పడుతుండగా, వాటినీడ వెనుక నిలబడిన పౌరులపై పడుతున్నది. వారిలో కొందరు స్త్రీలు.. అందులో కాకతి ఉన్నట్లు మసకమసకగా తెలుస్తున్నది.
చటుక్కున లేచాడు. వేగంగా కదిలి చుట్టూ నిలబడిన పౌరులను దాటుకుని దేవళంలోకి పరిగెత్తాడు.
అందరినీ పట్టి పట్టి చూశాడు. లేదు కాకతి!
కానీ, ఎదురుగా అంతరాలయంలో కాగడాల వెలుగులో పిల్లనగ్రోవి ఊదుతున్న భంగిమలో గోపాలకృష్ణుడు.. ఆ పిల్లనగ్రోవి నాదమేదో తన చెవులకు తాకుతుండగా రెప్పవేయకుండా ఆ స్వామిని చూస్తూ వెనుక్కు నడిచాడు జాయపుడు!!
ధనదుపురం.. మరికొన్ని పురాలు, కరపట్టణాలు, ప్రముఖ దేవాలయాల వద్దే కాదు, అతిచిన్న గ్రామాలలో కూడా ఏదో ఒక ప్రదర్శన జరుగుతుండటం అతణ్ని ఆనందపరచింది. ధనమే కాదు.. సాహిత్య, సంగీత, నాట్య ఘోష ఈ వెలనాడు నిత్యనైమిత్తిక జీవనంలో ప్రధాన పాయలుగా ప్రవహిస్తున్నాయా అన్నట్లుంది జాయపునికి.
భైరవ ఉదంతంవల్ల ఉధృత ప్రదర్శనలు చూడలేకపోతున్నాడు. సాత్విక ప్రదర్శనలు కాస్త ఊరటనిస్తున్నాయి. పైగా అక్కడ కాకతి సంచరిస్తున్నదన్న భావన. లాస్య ప్రధాన నాట్యాలు అభ్యసిస్తున్నప్పుడే కదా భైరవ ఉదంతం జరిగింది. ఆమె కూడా భైరవ జ్ఞాపకాలతో ఆ ఉధృత ప్రదర్శనలు భరించలేక ఆమెకు తెలిసిన లాస్యప్రధాన నాట్యప్రదర్శనలు చూస్తున్నదని, తనను కూడా అక్కడికి లాక్కుపోయిందని అనిపించింది.
ఆ ప్రదర్శనలు చూస్తూ చూస్తూ ఇలాంటివి అనుమకొండలో లేవా అని ఆశ్చర్యపోయాడు.
తర్వాత గతం మననం చేసుకుంటే అలాంటివి అక్కడ కూడా చాలా ఉన్నాయి. ప్రసన్న కేశవాలయం!!
అవును. తను ఆ దేవాలయ రంగమండపంలో నాట్యమాడాడు. అవునవును. ఆ స్వామివిగ్రహం లింగం కాదు. ఇలాగే మానవమూర్తి. ఇప్పుడు గుర్తొస్తున్నది. అలాగే మరికొన్ని దేవాలయాలు, అక్కడ తను చేసిన సాత్విక నాట్యాలు.
వేయిస్తంభాల దేవాలయం గుర్తొచ్చింది. నిజానికి అది త్రికూటాలయం. అంటే శివుడే కాదు.. వాసుదేవుడు, సూర్యుడు కూడా పూజలు అందుకుంటున్నారు. అంటే కాకతీయరాజ్యంలో కేవలం శైవం మాత్రమే కాదు ఇతర దేవతలు, ఇతర నాట్య సంప్రదాయాలు కూడా గౌరవం అందుకుంటున్నాయని ఇప్పుడు గుర్తించాడు.
“అవును. మేమంతా వైష్ణవులం. ఆ శైవులు అరచి ఎగిరిదూకి చేసే నాట్యాలు మావల్ల కాదు. పూర్తిగా భక్తి భావనతో మనసులోంచి పుట్టినట్లుంటాయి మా పాటలు, పద్యాలు, శ్లోకాలు.. అన్నీ కళారూపాలు.. మనసు పెట్టినట్లుంటాయి..” అన్నాడు పరాశరుడు.
పరాశరుడు జాయపునికి కొత్త స్నేహితుడు.
ఓనాడు ఓ గ్రామచావడి వద్ద మరేదో నాట్యప్రదర్శన జరుగుతున్నది. ఇవన్నీ వీధి ప్రదర్శనలు. దేశీ నాట్యాలతో, దేశీ పాటలతో, దేశీ సంగీతంతో కలగూరగంప ప్రదర్శనలు. చాలా గ్రామాలలో గుళ్ల వద్ద కంటే గ్రామచావళ్ల వద్ద ప్రదర్శనలు ఎక్కువగా జరుగుతాయి. ప్రదర్శన ప్రాంతం నిర్ణయించి దానిచుట్టూ గొయ్యి తవ్వుతారు. ఆ మట్టి అంతా మధ్యలోవేస్తే.. అదే ఎత్తయిన రంగస్థలం. ఆ గోతుల పల్లంలో కూర్చుని గ్రామీణులు ప్రదర్శన చూస్తారు.
(సశేషం)
– మత్తి భానుమూర్తి
99893 71284