Jaya Senapathi | జరిగిన కథ : కాకతీయ రాజధానిలో తిరుగుబాటు! సూత్రధారి మురారిదేవుడు!! తను ఎప్పుడూ చూడనిది, విననిది ఈ ముదిమి వయసులో చూస్తున్నాడు జాయసేనాపతి. తన బొందిలో ప్రాణం ఉండగా గణపతిదేవుని మాటకు ఎదురు ఎవ్వరు చెప్పినా బతకనివ్వనని తీర్మానించుకున్నాడు. పౌరులందరినీ ఏకం చేసి.. రాతికోట మహాద్వారం వద్దకు చేరుకున్నాడు. అక్కడున్న మురారిదేవుడు.. జాయసేనాపతిని, ఆయన వెంట ఉన్న పౌరసైన్యాన్ని చూసి తత్తరపడ్డాడు.
రెండు చేతులతో కరవాలాన్ని గట్టిగా బిగించి పట్టుకున్నాడు జాయసేనాపతి. ‘కాకతీయ సామ్రాజ్యంలో పుట్టిన కలుపుమొక్కను తొలగించాల్సిందే!’ జీవితంలో తొలిసారి తనవారిపై.. తను ఎత్తుకుపెంచిన మేనల్లుడిపై కత్తి దూయక తప్పలేదు జాయసేనాపతికి. జాయప, మురారి.. ఇద్దరూ కత్తులతో తలపడ్డారు. ద్వారం లోపల జాయపుడు మురారితో యుద్ధం.. ద్వారం బయట రుద్రమ, మురారి సేనానులతో యుద్ధం. ప్రజలు నిబిడాశ్చర్యంతో మేనమామ, మేనల్లుళ్ల యుద్ధాన్ని చూస్తున్నారు. నాట్యకళ, యుద్ధకళ సమపాళ్లలో రంగరించిన డబ్భు ఐదేళ్ల జాయసేనాపతి మహా కౌశలం.. దుర్మార్గమూ, అర్హతలేని సింహాసనం కోసం అర్రులు చాస్తున్న కుటిలత్వమూ కలబోసిన మురారి కౌశలం ముందు గెలవలేకపోతోంది. హరిహరుణ్ని చంపిన ఉద్రేకంలో ఉన్న పురజనులు ఉద్వేగంతో మామ అల్లుళ్ల యుద్ధాన్ని ఉత్కంఠతో చూస్తున్నారు.
అవతల రుద్రమ యుద్ధం.. ఇవతల జాయసేనాపతి యుద్ధం.. న్యాయంకోసం.. నీతి కోసం..
కాకతీయ సామ్రాజ్యం కోసం. పోరాడుతున్న వృద్ధ సింహం జాయసేనాపతి.. యువ దుర్మార్గం మురారిదేవుని ముందు నిలబడలేకున్నాడు. అంతా గమనిస్తున్న ప్రజలు అరిచారు.
“జాయసేనాపతి.. రక్షించు.. కాకతీయ సామ్రాజ్యాన్ని రక్షించు!”
“రుద్రమదేవిని రక్షించు..”
“గణపతిదేవుణ్ని రక్షించు..”
“కాకతీయ సామ్రాజ్యాన్ని రక్షించు”
“ఆంధ్ర సామ్రాజ్యాన్ని రక్షించు”
“తెలుగు సామ్రాజ్యాన్ని రక్షించు”
మళ్లీ మళ్లీ అదే హోరు.. అదే పిలుపు.. ముక్తకంఠంతో.. దిక్కులు పిక్కటిల్లేలా..
ప్రజల నినాదాలు ఇస్తున్న శక్తితో ఓపిక తెచ్చుకుని వేగంగా కత్తి తిప్పుతున్నాడు జాయసేనాపతి.
అప్పటికే తన కరవాలంతో ఆయన మీదికి దగ్గరగా వచ్చాడు మురారి. జాయపునికి శక్తి సరిపోవడం లేదు.
పైచేయి సాధిస్తున్నాడు మురారి.. ఏదైనా చేయాలి.. హరహర మహాదేవ.. నటరాజా.. కరుణించు!
హఠాత్తుగా ఏదో కొత్త శక్తి ఆవహించినట్లు చటుక్కున నడికట్టులో ఉన్న చురికను మరోచేతితో తీసి.. లిప్తపాటులో మురారి గుండెల్లో పొడిచాడు జాయపుడు. చివ్వున పొంగుతోంది రక్తం. మురారితోపాటు రక్తసిక్తం అయిపోతోంది జాయపుని శరీరం. ఏదో అయిపోతోందని.. ప్రాణాలు తనను వదలిపోతున్నట్లు గుర్తించాడు మురారి. గజగజ వణుకుతున్న చేతులను ఓపిక కూడదీసుకుని రెండు చేతులతో ఖడ్గం పట్టి ఎత్తి జాయసేనాపతి మీదికి ప్రహారం చేశాడు.
అది తగలకముందే తప్పుకొని కరవాలంతో లాఘవంగా మురారి డొక్కలో గుచ్చాడు జాయపుడు. గుండెలోంచి, కడుపులోంచి ఉవ్వెత్తున రక్తం ఉబుకుతుంటే.. మురారి శరీరం నిలబడలేక తూలి, వణుకుతూ కూలిపోయింది. రెండు మూడు లిప్తలు గిలగిల కొట్టుకుని అచేతనమయ్యింది.
పౌరులు వేగంగాపోయి కోట ప్రధాన ద్వారం తీశారు. పూర్తి రక్తసిక్తమైన శరీరంతో తడిసి కరవాలం పట్టి నిలబడి ఉంది రుద్రమదేవి! చుట్టూ పది పదిహేను శవాలు!!
మహాద్వారం అవతల రుద్రమ.. ఇవతల జాయసేనాపతి!! శత్రువుల రక్తంతో తడిసి రొప్పుతున్న శరీరాలు.. ఒకరినొకరు చూసుకుని విజయచిహ్నంగా కత్తులు ఎత్తి పట్టారు. జనులు జయజయధ్వానాలు చేశారు. జనం ప్రవాహంలా పరుగుపరుగున వస్తున్నారు. కొందరు పిడికిళ్లు పట్టి రుద్రమదేవి వైపుగా పోతూ జయజయధ్వానాలు చేస్తున్నారు. ఆంధ్రనగరి సింహద్వారం వద్ద పిడికిళ్లు గాలితో ఎగసిపడుతుండగా.. కాకతీయ ప్రజానీకపు సింహనాదాలు మారుమోగుతున్నాయి.
“కాకతీయ సామ్రాజ్యానికి.. జై..”
“తెలుగు రాజ్యానికి.. జయ జయ..”
“ఆంధ్ర నగరి.. జయ జయ జయ”
అప్పటికి యుద్ధావేశం కొంత తగ్గింది. కాళ్ల వద్ద కింద పడి ఉన్న ముద్దుల మేనల్లుడి పార్థివ శరీరం చూడలేక కళ్లు మూసుకున్నాడు. మురారి ఊపిరి తీసిన చురకత్తిని బుగ్గకు ఆనించుకుని తలవొంచుకుని గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు మేనమామ జాయచోడ మహారాజు. రుద్రమదేవి పరుగున వచ్చి వచ్చి కత్తి పారవేసి జాయసేనాపతి కాళ్లపై పడిపోయింది రొప్పుతూ.
ఆమె కన్నీరు ఆయన పాదాలను తడుపుతున్నాయి.
“కాకతీయ యోధుడివి నువ్వే మామా.. నేను కాదు.. నువ్వే!!”
గుండెలు పగిలేలా పెద్దపెట్టున ఏడుస్తున్నారు ఇద్దరూ.. వారితో గొంతు కలిపి ఏడుస్తోంది అనుమకొండ!!
* * *
నిశ్శబ్దంగా ఉంది అంతఃపురం. విశాలమైన మందిరాలు విషాదంగా.. చెప్పలేని బాధ అంతటా వ్యాపించినట్లు.. లోలోపలి బడబాగ్ని ఏదో పెటిల్లున పగిలినట్లు.. వ్యాకులిత అంతరంగం కల్లోలితమవుతూ తల్లడిల్లిపోతున్నట్లు.. వేల శవాలు కాలుతున్న శ్మశానమేదో లోలోపల మండుతున్నట్లు..
మెల్లగా నిశ్శబ్దంగా లోపలికి వచ్చాడు జాయసేనాపతి.
శరీరమంతా రక్తసిక్తం. చెయ్యరానిది చేసినట్లు.. రక్తంతో తడిసిన చేతులు, వేళ్లు వణుకుతున్నాయి. కాళ్లు స్వాధీనంలో లేవు. అయినా బలవంతంగా నడిచివచ్చినట్లు నిస్సత్తువుగా కూలబడి తల్పం వైపు చూశాడు. కుడ్యానికి శరీరాన్ని ఆనించి శూన్యంలోకి చూస్తూ గణపతిదేవుడు. నిశ్శబ్దంగా పడుకుని ఊర్ధ్వముఖంగా చూస్తోన్న నారాంబ.. ఒక్కొక్క మాటే కూడబలుక్కుంటూ ఊపిరితో కలగలిసిన అక్క నారాంబ మాటలు..
“రా జాయా! అక్కడే ఆగిపోయావేం తమ్ముడా.. నా కొడుక్కి ఎవ్వరూ శిక్ష వెయ్యకూడదని.. వేస్తే నువ్వే వెయ్యి అన్నాను. నాకు గుర్తుంది జాయా.. గుర్తుంది. ‘అక్కా! నీ ఆజ్ఞను పాటించి నీ కొడుక్కి శిక్షవేశాను అక్కా!’ అని చెప్పడానికి వచ్చావేమో జాయా.. ఆ శిక్ష నాకు తెలిసింది. నాకు.. తెలి..”
నారాంబ ఆఖరివాక్యం పూర్తవ్వలేదు. పూర్తి నిశ్శబ్దం. భర్త గణపతిదేవుడు, తమ్ముడు జాయసేనాపతి.. ఇద్దరూ కదలలేదు. తల్పం వంక తలతిప్పి చూడలేదు. ఎవరికి వారు కుమిలికుమిలి ఏడుస్తున్న శబ్దం.. వారిద్దరికీ తప్ప మరొకరికి వినిపించడం లేదు.
* * *
అన్నిటికంటే కాలం గొప్పది. దానికి విజయాలు అపజయాలు ఒక్కటే.. అన్నిటికీ మరపు అనే మందు పూసి ఊరడిస్తుంది. మురారి చేసిన రాజ్యద్రోహం, తన చేతులతో ఎత్తుకుని పెంచిన తన మేనల్లుడిని కాకతీయ రాజ్యం కోసం స్వహస్తాలతో ఆంధ్రనగరి ప్రధానద్వారం వద్ద పొడిచి చంపిన జాయసేనాపతి మహోన్నత త్యాగం.. చివరికి.. కేతకిపురం వద్ద తనపై దాడి చేసిన దుండగులతో పోరాడుతూ వచ్చి అనుమకొండ కోట మహాద్వారం బయట రాణి రుద్రమ మట్టుపెట్టడం.. గర్భశోకంతో నారాంబ మరణం..
అన్నీ కాలం రెక్కల కింద ముడుచుకుంటున్న వేళ.. రుద్రమదేవికి అధికారికంగా పట్టాభిషేకం నిర్వహించాలని గణపతిదేవుడు నిర్ణయించాడు. ఈసారి కూడా రుద్రమ అంగీకరించలేదు.
“ఇంతకాలం నేను సింహాసనంపై కూర్చునే యుద్ధాలు చెయ్యలేదు. పరిపాలన చెయ్యలేదు. ఇప్పుడు మాత్రం సింహాసనం అవసరమా తండ్రీ..”
“నిజమే బిడ్డా! స్పష్టమైన నిర్ణయం తీసుకోలేని మా అశక్తతను ఆ రుద్రదేవుడు కోపగించుకున్నాడేమో. ఇన్ని ఘోరాలు మేము బతికి ఉండగానే చూశాం తల్లీ. చాలమ్మా.. ఇక చాలు. ఈ ఘోరాలు ఇక చాలు!” అంతకుమించి ఏమీ అనలేక పోయాడు.
* * *
వారసత్వ పోరులో మురారిదేవుడు మరణించడం తెలిసి తీవ్రంగా బాధపడ్డవాడు దేవగిరి మహాదేవుడు! కాకతీయ సామ్రాజ్య నాశనాన్ని నరనరానా కోరుకునే ఆగర్భశత్రువు దేవగిరి మహాదేవుడు! ముత్తుకూరు యుద్ధంలో గెలిచినా కూడా రాణిరుద్రమ బతికే ఉండటం.. తమ విజయానికి సహకరించిన ప్రాణమిత్రుడు మురారిదేవుడు మరణించడం.. మహాదేవుడు భరించలేకపోతున్నాడు. ఏది ఏమైనా ఆమెను తుదముట్టించాలని.. కాకతీయ రాజధాని అనుమకొండపై దండెత్తి వస్తున్నాడు. కనీస సంధివిగ్రహి మర్యాదలను కూడా తోసిరాజని మహాసైనిక పారావారంతో బయలుదేరాడు. అనుమకొండ కోటపైకి సరాసరి దాడి చేయడానికి కదలి వస్తున్నాడు. వేగులు చెప్పిన సమాచారంతో రాణి రుద్రమ కూడా అందుకు సంతోషించింది.
“రా.. రా.. నీ చావు ఇక్కడ నా కోటలో ఉంది!”
“సింహాసనం అధిష్టించినా లేకున్నా నువ్వే కాకతీయ సామ్రాజ్ఞివి. మా వారసురాలివి. ఆంధ్రప్రజల ధన మాన ప్రాణాలను కాపాడాల్సిన మహానేతవు, యుద్ధయోధవు నువ్వే. ఏం చేస్తావో చెయ్యి. ఇంతకాలం మనం వెళ్లి యుద్ధం చేశాం. ఇప్పుడు మనం బలహీనపడ్డామని, ఆడది పాలిస్తున్నదని, చులకనగా భావిస్తూ మనపైకే దండెత్తి వస్తున్నాడు ఆగర్భశత్రువు దేవగిరి రాజ్యపు ప్రస్తుత పాలకుడు మహాదేవుడు. ఏం చేస్తావో చెయ్యి. నిన్ను నువ్వు నిరూపించుకో! పోరాడు. చరిత్రలో నీకొక స్థానాన్ని సృష్టించుకో..”
తల్పానికే పరిమితమైన చక్రవర్తి గణపతిదేవుడు కలిగించిన ఉద్వేగం రాణిరుద్రమలో ఉద్రేకమయ్యింది. తన ముఖ్య అనుచరులతో మంతనాలు జరిపింది. ఆమెకు ముఖ్య అనుచరులు ప్రసాదిత్యుడు, త్రిపురాంతక దేవుడు, రేచర్ల దామానాయుడు.. తదితర మహాయోధులు.
స్కంధావారం నిర్మించి యుద్ధస్తంభం పాతి తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుని ధర్మయుద్ధం చేయడం వేరు, స్థల దుర్గాలైన రాజధానులపై దాడిచేయడం వేరు. ఎలాంటి చర్చలు లేకుండా వచ్చి పడుతున్నాడు మహాదేవుడు. రుద్రమ పూర్తిగా సిద్ధమైంది. సైన్యాన్ని సిద్ధపరచింది. సేనానులకు, సాహిణులకు, మందడిలకు వారివారి స్థానాలను చెప్పింది. చతురంగ బలగాలతో దళాలను నిర్మించింది. ప్రజలను సమాయత్తపరచింది. అంచె దళాలను హెచ్చరించింది. కోట ద్వారాలు ఎప్పుడు మూసివేయాలో, ఎప్పుడు తెరవాలో ప్రణాళిక రచించింది.
నిర్మాణంలో ఉన్న సౌకర్యాలనన్నింటినీ ఎలా ఉపయోగించుకోవాలో నగర దండనాయకులతో చర్చించి తగిన ఏర్పాట్లు చేసింది. ఆంధ్రనగరి ఓరుగల్లు నగరం ప్రణాళిక ప్రకారం నిర్మించిన మహానగరం. మూడు తరాలుగా నిర్మిస్తోన్న మహాసృష్టి. మొత్తంగా ఏడుకోటలతో బలిష్టమై దుర్భేద్యమైనది. ఇటుకకోట, కంపకోట, కంచుకోట, ఇనుపకోట, మట్టికోట, గవని కోట, రాతికోట అనే ఈ ఏడుకోటల మధ్యలో సమాజం ఉంటుంది. కోట అంటే ప్రాకారం. ప్రతి ప్రాకారం దాదాపు పది గవ్యూతుల ఆవృత్తంలో ఉంటుంది. బయటి ప్రాకారం మట్టికోట అయితే.. లోపల చివరి ప్రాకారం రాతికోట. ప్రతి ప్రాకారానికి నాలుగు ద్వారాలు, డబ్భు రెండు బురుజులు ఉన్నాయి. బురుజులపై ప్రత్యేక సైనికదళం. ఒంటరులు అంటారు వాళ్లను. ఒంటరిగా పోరాడటంలో వారు నిష్ణాతులు. అన్నిరకాల ఆయుధాలనూ ఉపయోగించగలరు.
మొత్తం అన్ని ప్రాకారాలు అభేద్యమైన రక్షణ వ్యవస్థలతో ఉన్నాయి. ప్రతి కోటకు బయటవైపు అగడ్త ఉంటుంది. దానిలో ఉన్న మొసళ్లు నాలుగడుగులు ఎగిరి.. మొత్తం మనిషిని పట్టి మింగివేయగలవు. వాటిని దాటి ప్రాకారం ఎక్కడం కలలో కూడా సాధ్యం కాదు. లోపలివైపు మెట్లు ఉంటాయి. వాటి వెంట వేడినీళ్లు మరిగించే ఏర్పాట్లున్నాయి. ఆ నీటిని పట్టి శత్రువులపై పోయగల వసతులున్నాయి. అత్యంత కట్టుదిట్టమైన ఏడు ప్రాకారాలు దాటి మహారాజును పట్టి బంధించడం దేవతలరాజు ఇంద్రుడి తరం కూడా కాదు. ఎవడైనా శత్రువులాంటి వాడు లోపలికి ప్రవేశిస్తే గందర గోళమై కుక్కచావు చావడం తప్పదు.
ఊహించినట్లుగానే మహా సైన్యంతో ఉప్పెనలా అనుమకొండ పొలిమేరకు చేరాడు మహాదేవుడు.
(సశేషం)