జరిగిన కథ : తక్షణమే అనుమకొండ రావాల్సిందిగా అక్క నారాంబ నుంచి వార్త. మురారి ఏం కొంపలు ముంచాడో అనుకుంటూ.. వాయువేగంతో అనుమకొండకు వచ్చాడు జాయప. అంతఃపురంలోకి ప్రవేశించేసరికి.. దీనంగా పిచ్చిచూపులు చూస్తోంది నారాంబ. ఆమె ఏం చెబుతుందో తెలియక ముఖంలో దిగులు తన్నుకొస్తోంది. రుద్రమ గురించి చెబుతూ.. వెక్కెక్కి ఏడుస్తున్నది. ఆమె అత్తగారు ఉదయాంబికదేవి మహా దుర్మార్గురాలనీ, రుద్రమను చిత్రహింసలు పెడుతోందనీ చెబుతున్నది.
“మీ పురుషుల బుద్ధి ఎప్పుడూ యుద్ధాలు, కత్తులు, కటార్లపైనే ఉంటుంది. మా మహిళల సమస్యలు మీకు పట్టవు గదా. తండ్రిగారు కదా అని వారికి చెబితే.. వారు నీకు చెబుతారు. ‘జాయమామ వీరభద్రుడితో మాట్లాడతాడు. అప్పటివరకూ ఇక్కడే ఉండమ్మా!’ అన్నారు. పాపం ఇక్కడే ఉంది. కానీ, నిన్ననే అల్లుడుగారు విచ్చేశారు. ఇద్దరూ కొలనుపాక వెళ్లారు..”
చెబుతున్న నారాంబ ఏడుపు ఆగింది. కానీ, వెక్కిళ్లు ఆగడం లేదు. ఏడుపు ఉప్పెనలో ఆమె పవిట తడిసి ముద్దయ్యింది.
“అక్కా.. నువ్వు ప్రతి చిన్న అంశానికీ దుఃఖపడుతున్నావు. ముసలమ్మ.. అదే అమ్మమ్మవు అయ్యావుగా.. సహజమే! కాస్త కళ్లు తుడుచుకో..” అంటూ దగ్గరకు తీసుకుని ఊరడించి కన్నీరు తుడిచాడు. ఈ సంఘటన ఆయనలో తీవ్ర ఘర్షణకు కారణమయ్యింది. ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాడు.
* * *
కాకతీయ సార్వభౌముని మొదటి కొలువు సమయం. వందిమాగధుల స్తోత్రపాఠాల నడుమ గణపతిదేవుడు ప్రవేశించి ఆసనాన్ని అధిష్ఠించాడు. ప్రధానులు, మంత్రులు, ముఖ్య సేనానాయకులు ఆసీనులయ్యారు. పక్కన తన ఆసనంలో గజసాహిణి జాయచోడుడు కూడా కూర్చున్నాక.. ఓ యువ యోధుడు సింహద్వారం నుంచి ప్రవేశించి చిరుతపులిలా కదలి వస్తున్నాడు. అంతా విభ్రమగా అటు చూస్తున్నారు.. చక్రవర్తి సహా.
ఆ ఆగంతక యోధుడు వేదికపైకి వచ్చి చక్రవర్తికి నమస్కరించాడు. జాయచోడుడు లేచి.. పక్కన అప్పటికే ఏర్పరచి ఉంచిన మరో సముచితాసనాన్ని చూపాడు సగౌరవంగా. అతడు ఆసనం వరకు వెళ్లాడుగానీ కూర్చోలేదు. సభాముఖంగా తిరిగి అందరికీ వంగి నమస్కరించాడు. అప్పుడప్పుడే సభాముఖ్యులు ఆ ఆగంతకుణ్ని గుర్తిస్తున్నారు. చక్రవర్తి కూడా అప్పుడే గుర్తించాడు.
రుద్రమదేవుడు!! పురుష ఆహార్యంలో యుద్ధవీరుని తలపిస్తున్న రుద్రమదేవి!
పురుష ఆహార్యంలో చూసిన మనిషే అయినా.. ఇప్పుడు ముగ్గురుపిల్లల తల్లిగా వయసు పెరిగి హుందాగా ఉండటంతో వెనువెంటనే గుర్తించలేదు. గుర్తించాక అంతా సంభ్రమంగా చూడసాగారు.
“ఇదేమిటి.. ఈ హఠాత్పరిణామం?” అబ్బురంగా అన్నాడు గణపతిదేవుడు.
ఆయన ముఖంలో దాచుకోలేని ఆనందం వరదకృష్ణమ్మలా సుళ్లు తిరుగుతోంది.
“మామ ఆదేశం..” అంది రుద్రమ.
జాయచోడుడు లేచాడు.
“కాకతీయ సభాసదులందరికీ నమస్సుమనస్సులు! కాకతీయ సభ మరీ వృద్ధవాసన వస్తోంది. అంతా వృద్ధాప్యానికి ఆహ్వానం పలికే వయసుకు వస్తున్నాం. కాస్త యువగాలుల కోసం నేనే రుద్రమదేవులవారిని ఆహ్వానించాను. మగపిల్లవానిగా ప్రకటించిన నాడు రుద్రమదేవుడే యువరాజుగా, వారసుడుగా ప్రకటించారు కూడా. ఇప్పటికీ అదే చెల్లుబాటులో ఉందని సభాసదులకు గుర్తుండే ఉంటుంది. మరికొన్ని రోజులలో యువ మురారి దేవుడు కూడా సభాప్రవేశం చేయనున్నాడు..”
అంతే! సభ నవ్వులతో దద్దరిల్లింది. చాలాసేపు విరామమెరుగక నవ్వుతూనే ఉన్నారు. ఆ నవ్వులలో ఏవేవో ఆలోచనలు అందరిలోనూ సుళ్లు తిరుగుతున్నాయి. అప్పుడే అందరికీ తీపి తినుబండారాలు పంచారు.. సభా ప్రాంగణ నిర్వాహక పరిచారికలు. గణపతిదేవుని మోములో ఆనందతన్మయం తగ్గడంలేదు.
ఆ రాత్రి మధుసేవనానికి ఆహ్వానించాడు గణపతిదేవుడు అంతఃపురంలో.
“ఈ ఆలోచన నీకెలా వచ్చింది? మేమే రుద్రమ గురించి తలపోస్తున్నాం. నువ్వు దానిని నిజం చేశావు ఎట్లా?”
“మీ మనసులో పుడితే నాబుర్రలో పెరుగుతుంది. అక్క మరీ బాధపడుతూ చెప్పింది. కొలనుపాక వెళ్లి ఆహ్వానించాను..” అన్నాడు.
ఆవల తూగుటుయ్యాలపై కూర్చుండి నారాంబ రెట్టించిన ఉత్సాహంతో రుద్రమకు కబుర్లు చెబుతోంది. ముగ్గురు కూతుళ్లకు వేడిబువ్వ ముద్దలుకలిపి తినిపిస్తూ.. పినతల్లి మాటలు ఆత్మీయంగా వింటోంది రుద్రమ. అటూఇటూ సహాయకంగా కదలుతున్నారు పరిచారికలు.
కొడుక్కి పోటీగా కూతురును తమ్ముడు తీసుకొచ్చాడని నారాంబకు అర్థమయ్యే అవకాశమే లేదు!
“కానీ కానీ.. రుద్రమదేవుడు.. రుద్రమదేవి.. ఆనాటి ప్రకటన గుర్తులేదు. ఏమి ప్రకటించామో గుర్తులే..”
“ఈరోజు సభలో స్పష్టం చేశాంగా బావగారూ..”
గొంతు తగ్గించి అన్నాడు గణపతిదేవుడు..
“మరి.. వాడు.. మురారి కూడా వస్తాడని..”
“సందర్భోచితం. మురారి మిత్రులు ఉన్నారక్కడ. అందుకోసమే అలా ప్రకటించాను..”
అప్పుడు కలగజేసుకుంది నారాంబ.
“నా పిల్లలిద్దరూ నా కళ్లముందే ఉంటారు..” అంది అనురాగదేవత.
భార్య వంక మురిపెంగా చూసుకున్నాడు గణపతిదేవుడు. విన్న రుద్రమదేవి మౌనంగా ఉండిపోయింది ఎప్పటిలాగే. ఇప్పుడు స్పష్టంగా ఇద్దరు వారసులూ ఎదురెదురయ్యారు.
‘ఎందుకు ముసుగులో గుద్దులాట. వాళ్లే తేల్చుకుంటారు.. ఎవరు సింహాసనానికి అర్హులో!’
అర్హులకే అందలం అన్న నిర్ణయంలో రాజీపడటానికి సిద్ధంగా లేరు.. బావ, బావమరుదులిద్దరు!
ఎక్కడో దూరాన ఉన్న మురారికి చేరింది రుద్రమదేవునిగా రుద్రమదేవి సభాప్రవేశం. వారసుడిగా గతంలో చేసిన ప్రకటనను జాయచోడుడు ప్రస్తావించినట్లు కూడా చెవిన వేశారు శ్రేయోభిలాషులు. అలా జాయచోడుడు మురారికి ద్వితీయ శత్రువు అయ్యాడు.
* * *
ఆంధ్రసామ్రాజ్య సాధనలో అంతిమ ఘట్టం వచ్చేసింది. అంతర్గత రాజ్యాలన్నీ గణపతిదేవుడి సార్వభౌమాధికారాన్ని అంగీకరించాయి. తెలుగు మాట్లాడే ప్రజల సామ్రాజ్యం స్థాపించాలంటే ఈశాన్యాన కళింగ రాజ్యం, దక్షిణాదిన పాండ్యరాజ్యం జయించి తీరాలి. పడమట హోయసలను దేవగిరి సింఘణదేవుడు ఓడించి దిగువకు చొచ్చుకుపోతున్నాడు. పడమట సరిహద్దులోని తెలుగు ప్రాంతాలను, గ్రామాలను ఇటు పక్కనున్న తెలుగుచోడ రాజ్యాలలో కలపడానికి అనేకానేక ప్రయత్నాలు, యుద్ధాలు.. అందులో ప్రముఖ పాత్ర తిక్కనామాత్యునిది. దక్షిణాన పాండ్యుణ్ని ఓడించడానికి తిక్కన ఆధ్వర్యంలో నెల్లూరు పాలకుడు రెండవ మనుమసిద్ధి తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు.
ఈశాన్యంపై దృష్టి పెట్టాడు గణపతిదేవుడు. యుద్ధ మంత్రాంగమంతా ఇప్పుడు రుద్రమదేవి, మురారిదేవుడు పర్యవేక్షిస్తున్నారు. కళింగరాజులు గాంగ వంశీయులుగా ప్రసిద్ధులు. ప్రస్తుత మహరాజు నరసింహదేవుడు సమయం చూసుకుని కొలనిరాజ్యం వరకూ దండెత్తి చిన్న చిన్న కాకతీయ సామంతరాజ్యాలను గెలుస్తాడు. మళ్లీ కాకతీయులు దండెత్తగా పారిపోతాడు. కాకతీయ రాజ్యంపై ప్రత్యక్షయుద్ధానికి సిద్ధంకాడు.
అక్కడ ఎప్పుడూ నమ్మదగ్గ సామంతుడు అంటే వియ్యమందిన ఇందుశేఖరుడు మాత్రమే. ఇప్పుడు మళ్లీ అవే పరిస్థితులు వచ్చాయి. నరసింహదేవుడు వేంగిని జయించి నిడదప్రోలుపై కూడా దండెత్తాడు.కాకతీయులు యుద్ధభేరి మోగించారు.
“మీరూ, జాయమామ ఇకపై యుద్ధాల నుంచి దూరంగా విశ్రాంతి తీసుకోండి తండ్రీ” అన్నారు పిల్లలు రుద్రమదేవి, మురారిదేవుడు. గ్రంథ రచనపై దృష్టి నిలిపి ఉన్న జాయచోడుడు గజసాహిణి పదవి సహా అన్ని పదవుల నుంచి విముక్తుడై ఉన్నాడు. గణపతిదేవుడు ఎందుకైనా మంచిది అన్నట్లు.. జాయచోడుణ్ని హెచ్చరించాడు.
“కళింగులు గజయుద్ధ నిపుణులు. పిల్లలకు అందుబాటులో ఉండు జాయా..” అన్నాడు.
ఎప్పటిలాగే తల ఊపాడు జాయచోడుడు. మురారిదేవుడు, రుద్రమదేవి యుద్ధముఖ్యులు కాగా.. గణపతిదేవుడు కలపానాయకుడు, దామానేడు, సింగమనేడు, భీమరాజు, సిద్ధయదేవుడు మొదలైన సామంతులను కూడదీసి యుద్ధపటాలం సిద్ధంచేసి రేచర్ల లోక చమూపతి సర్వసైన్యాధ్యక్షునిగా, కోటమరెడ్డిని శూన్యపాలకుడుగా ప్రకటించాడు.
చావో రేవో అన్నట్లుగా మొదలైన యుద్ధం తొలిదశలో కాకతీయులదే పైచేయిగా ఉంది. రుద్రమ, మురారిదేవుడు ఇద్దరూ ఇద్దరేనని సేనానులు స్కంధావారంలో కొనియాడారు. మాసం గడిచేసరికి శత్రు సేనానులు రెచ్చిపోసాగారు. నిజానికి మురారి చెప్పుకొన్నంత యుద్ధయోధుడు కాదు. మామూలు సమయాల్లో పొగడ్తలు వేరు.. నిజంగా యథార్థ యుద్ధభూమిలో శత్రువులను ఎదుర్కోవడం వేరు. ఊహాతీతంగా మురారిదేవుణ్ని తీవ్రంగా గాయపరచి బందీగా తీసుకుపోయారు శత్రువీరులు. ఇది కాకతీయ సైనికశక్తి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. రుద్రమ కూడా నివ్వెరపోయింది.
అప్పటినుంచి కళింగయోధుల దాడులు అధికమయ్యాయి. పైగా వాళ్ల గజబలం అమోఘం. విభిన్న గజతంత్రాలతో కాకతీయులపై విరుచుకుపడుతున్నారు. కాకతీయ గజదళం జాయచోడుని ప్రభావంవల్ల బలిష్టమే కానీ, ప్రస్తుత గజసాహిణి ప్రోలరౌతు యుద్ధ తంత్రాలు చాలడంలేదు. ఇప్పుడు అందరిమదిలో మెదిలే పేరు.. జాయచోడుడు. ఆయన ఉంటే మన పరిస్థితి మరోలా ఉండేది అన్నది అందరి భావన.
కళింగం పైకి యుద్ధమంటే పెద్ద అడ్డంకి గోదావరి మహానది. లక్షల సైన్యం నదులను దాటడంలో ఎంతో నిపుణులైన ప్రత్యేక దళాలు ఉంటాయి. అలాంటి దళాలవల్లే గోదావరికి ఈవల ఉన్న రాజ్యాలను జయిస్తూ ఓడిపోతూ దాగుడుమూతలు ఆడుతున్నారు కళింగులు. నిజానికి కళింగ రాజ్యంలో సగభాగం తెలుగు ప్రజలున్న ప్రాంతాలే. ఈసారి ఆ ప్రాంతాలను జయించి తెలుగు సామ్రాజ్యంలో కలిపేసుకోవాలని గణపతిదేవుని పంతం. రోజురోజుకు యుద్ధంలో కళింగులదే పైచేయి అవుతోంది. కళింగ గజసేనలు కాకతీయులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక తప్పనిసరై జాయ చమూపతికి వార్త పంపింది రుద్రమ.
“మామా.. కళింగుల గజబలాన్ని తక్కువగా అంచనా వేశాం. మురారిని బంధించి తీసుకుపోయారు. మీ సహకారం అవసరం. మీరు వెంటనే ఇక్కడికి చేరాలి..”
అయితే ఆయన అనుమకొండలో లేడు. గోదావరినది మధ్యనున్న కొండలపైన రేఖపల్లికోట వద్ద గిరిజన వాద్యాలపై పరిశోధనలో ఉన్నాడు. వార్త చేరేసరికి అర్ధరాత్రి కావస్తోంది. అనుమకొండతో పోలిస్తే యుద్ధభూమికి దగ్గరగా ఉన్నాడు కానీ పెద్ద అడ్డంకి గోదావరి. యుద్ధతంత్రాలలో ఆరితేరిన మహాయోధుడు జాయచోడునికి పరిస్థితి అవగతమైంది. ఇప్పటికిప్పుడు నదిని దాటడం దుస్సాహసం.
అప్పటికే కళింగ నరసింహుడు అదనపు సైన్యం రాకుండా గోదావరి తీరమంతా సైన్యాన్ని మోహరించాడు. కాకతీయ గజసేనకు జాయచోడుని కాహళిధ్వనుల ద్వారా అందివచ్చే సూచనలు, సంకేతాలు బాగా తెలుసు. ఆయన కాహళి ధ్వని వింటే చాలు అవి ఆనందంతో గంతులు వేస్తాయి. గతంలో ఆయన దూరం నుంచి కూడా కాహళుల ద్వారా సూచనలు, సంకేతాలు ఇవ్వడం.. వాటికి అవి ఎలా స్పందించాలో అభ్యాసం చేయించాడు. ఇప్పుడు ఆ శిక్షణనే నమ్ముకున్నాడు. తీవ్రంగా ఆలోచించి యుద్ధ వేగుల ద్వారా వార్త పంపాడు.
“ధర్మాధర్మాలు ఆలోచించకుండా మన గజదళంతో శత్రు స్కంధావారంపై అర్ధరాత్రి దాడి చేయాలి. వెయ్యి ఏనుగులను వేయిమంది మహావీరులైన ఎక్కట్లకు అందజేయండి. నేనిచ్చే సంకేతాలు మన మత్తగజాలు స్వీకరించి తదనుగుణంగా ప్రవర్తిస్తాయి. అప్పుడు ఎక్కట్లు చెలరేగి విచక్షణారహితంగా శత్రువులను నరికివేస్తూ మురారిని దొరకబుచ్చుకుని రావాలి. ఇదే యుద్ధతంత్రం..”
తక్షణం తన కొత్త కాహళ వాయిద్యాలతో.. వందమంది గిరిజన వాయిద్యకారులతో రేఖపల్లి కోట ఉన్నకొండ శిఖరంపైకి వెళ్లి అక్కడ మోహరించాడు. అత్యున్నత శిఖరం పైకి ఎక్కాక ఇక దగ్గరా దూరం ఏముంది.. మేఘసందేశాలు, ఆకాశ ప్రయాణాలు భారతీయ సాహిత్యంలో ఎన్నో ఎన్నెన్నో. మహాసాహితీవేత్త కూడా అయిన జాయచోడునికి అవన్నీ కరతలామలకం. యుద్ధతంత్రాలలో పావురాల ద్వారా సందేశాలు, సంకేతాలు ఎలా పంపాలో ఆయనకు క్షుణ్ణంగా తెలుసు.
(సశేషం)
– మత్తి భానుమూర్తి
99893 71284