Jaya Senapathi |జరిగిన కథ : విభిన్న కళాకారులను కళాక్షేత్రంద్వారా ఏకంచేసి.. మతయుద్ధాన్ని గెలిచిన ఏకైక పరిపాలకుడు వెలనాడు మండలేశ్వరుడు జాయచోడుడే.. జగన్నాథుడని తెలిశాక యావత్తు వెలనాడు పులకించిపోయింది. అందరూ నిష్క్రమించిన అనంతరం విశ్రాంతిగా శయనతల్పంపై వాలాడు జాయపుడు. అప్పుడే ఎవరో వగరుస్తూ అరుస్తూ పరుగుపరుగున వచ్చి గొల్లెన వద్ద పడిపోయారు. ఆ కలకలం వినిపించగానే లేచి బయటికి వచ్చాడు జాయపుడు. చూస్తే.. పరాశరుడు!
“అరె..
పరాశరా.. ఏమిటి ఏమైంది?”.
“మహాప్రభో.. మువ్వ.. మువ్వను వాడు మళ్లీ.. నన్ను చావగొట్టి మువ్వను బలవంతంగా ఎత్తుకుపోయాడు. ఈసారి వాడు ఆమెను చంపేస్తాడు మహారాజా.. వదలడు. మువ్వను రక్షించాలి మహారాజా!”. వగరుస్తున్నాడు. ఏడుస్తున్నాడు. వణికిపోతున్నాడు పరాశరుడు. పూరి జగన్నాథాలయం వద్ద నాట్య ప్రదర్శనకు కంకుభట్టు బృందంతో మువ్వను తీసుకుని వెళ్లిన పరాశరుడు ఇప్పుడే కనిపించాడు. పరాశరుని మాటలు అర్థంకాక లిప్తలకాలం కొయ్యబారిపోయాడు. తర్వాత ఉద్రేకంతో మండిపోయాడు. మరుక్షణం విక్రమపై జాయపుడు, అతని అశ్వంపై పరాశరుడు ఆ రాత్రివేళ నంగెగడ్డ వైపుగా కదిలారు. పోయి పోయి తెలతెల్లవారుతుండగా నంగెగడ్డ చేరారు. ఎవ్వరూ మువ్వను, కపీశను చూసినట్లు చెప్పలేకపోయారు. హంసలదీవివైపు వెళ్లి ఉండవచ్చునని అటుగా గుర్రాలను దూకించారు.
హంసలదీవి చేరారు కానీ, ఎక్కడని వెతకడం?!
మళ్లీ చుట్టు పక్కల గ్రామాలను, గూడెలను, వాడలను వెతికారు. అడిగారు. ఎవ్వరూ ఏమీ చెప్పలేదు. వచ్చి వచ్చి నీరసించిన శరీరాలతో జలదుర్గపు శిధిలకోట వద్ద కూలబడ్డారు. ఇక్కడే గతంలో వాడి మనుషులు వీళ్లిద్దరిపై దాడి చేశారు. ఈసారి కూడా ప్రతీకారంగా వాడు దాడి చేయవచ్చునని ఊహించి జాగరూకతతో ఉన్నారు.
చీకటి ముసురుకుంటున్నది. ఆరోజు పౌర్ణమి.. మెలమెల్లగా పైకి వస్తున్నాడు చంద్రుడు.. నిండు చందమామ. ఇటు సముద్రంపై.. అటు కృష్ణమ్మపై ఓ వింతవెలుగు కురుస్తున్నప్పుడు కింద సముద్రపు ఘోష.. గుండె పగిలేలా ఏడుస్తున్నట్లు.. ఆవలగా కృష్ణమ్మ కొంగు నోట్లో పెట్టుకుని కుమిలిపోతున్నట్లు.. తెలియబోయే విషాదానికి ముందే దృగ్గోచరమవుతున్న బీభత్స వాతావరణం. ‘గతంలోనే వాణ్ని ఖండఖండాలుగా నరికి చిన్నచిన్న ముక్కలుగా చేసి ఈ తీరమంతా చల్లాల్సింది!’.. క్రోధంతో ఊగిపోతున్నాడు జాయపుడు.
“మహారాజా.. జాయా..” దూరం నుంచి గావుకేక వేశాడు పరాశరుడు. వాడి చావును అతిహీనంగా ఊహించుకుంటూ పళ్లు పటపట కొరుకుతున్న జాయపుడు తలతిప్పి చివ్వున చూశాడు. ఆవలగా కృష్ణపాయ వద్ద నుంచి వెర్రిగా కేకలువేస్తూ చేతులు విహల్వంగా ఊపుతూ.. చేతిలో ఏదో పట్టుకుని గందరగోళంగా కిందా మీదా అవుతూ దుఃఖిస్తూ.. కనిపిస్తున్న పరాశరుని వద్దకు పరుగుపెట్టాడు. అతని చేతిలో తాళపత్రాల ముక్కలు. వాటినే చూస్తూ.. మళ్లీ నీటిలోకి చూస్తూ.. గుండేలు పగిలేలా ఏడుస్తున్నాడు.
“ఏమైంది పరాశరా.. ఏమిటా ముక్కలు.. ఏమైంది.. చెప్పు.. చెప్పు!”.
కీడు శంకించగా ధైర్యం విలోలంబయినప్పటి కీచుక గొంతు.
“ఇక్కడే ఎక్కడో మువ్వ..” అంటూ..
“మువ్వా.. మువ్వా..” అని గొంతెత్తి పిలుస్తూ, అరుస్తూ మెలికలు తిరిగిపోతున్నాడు పరాశరుడు.
మువ్వను చంపేశాడన్న భావన బలపడుతున్నది. ఏమీ చేయలేక పోతున్నాననే నిస్సహాయతతో, క్రోధంతో ఊగిపోతున్నాడు జాయపుడు.
“ఏమైంది పరాశరా.. చెప్పు. ఇది ఏడ్చే సమయం కాదు. మువ్వను రక్షించాలి. వాణ్ని ఖండఖండాలుగా..”
“మువ్వను చంపేశాడు రాజా! ఇక్కడే ఎక్కడో. ఇవి.. ఇవి మువ్వ మీపై కవి కట్టిన గేయాలు, కావ్యాలు.. మధురభక్తి కావ్యం. ముక్కలు ముక్కలుగా చింపినవి నీట్లో తేలుతున్నాయ్.. ఇక్కడే ఎక్కడో..”
నీట్లోకి పరిగెత్తి ఆ చీకటిలో, ఆ మసకవెలుతురులో నీళ్లునిండిన కళ్లు విప్పార్చి వెతుకుతున్నాడు ఆర్తిగా పరాశరుడు. వింటున్న జాయపునికి మాట పెగలడంలేదు. నీటిలో తేలియాడుతున్న తాళపత్రాల ముక్కలు కళ్లముందు.. విఫలమైన ఆమె అరాధనలా.. ఆమె మధురభక్తి ఆ కృష్ణమ్మలో మిళితమై ప్రవహిస్తున్నట్లు.. ఆమె భక్తిలోని ముగ్దత్వంలా.. వెన్నెల వెలుగులో కెరటాల మిలమిల..
అంతలా తను ఎప్పుడూ కదిలిపోవడం జాయపునికి గుర్తులేదు. ఇప్పుడే.. నిన్నమొన్న కొన్నివేలమంది యుద్ధ మరణాలను విజయవంతంగా ఆపాడే.. ఇప్పుడొక్క ప్రాణాన్ని.. ఒక్క ప్రాణాన్ని.. తననే ఆరాధించే ఒక్క ప్రాణాన్ని.. కాపాడలేకపోతున్నాడే.. ఓరి దేవుడా! ఉన్నట్టుండి వెర్రికేక వేశాడు పరాశరుడు. రివ్వున అక్కడికి పరుగుపెట్టాడు జాయపుడు. నీటిలో వంగి వెతుకుతున్నాడు పరాశరుడు. ఉద్వేగంతో గుక్కలు పట్టి ఏడుస్తున్నాడు.
జాయపుడు కూడా వంగి అక్కడ చేయిపెట్టాడు. ఆ చేయికి తగిలింది ఓ చల్లని శరీరం.ఇద్దరికీ అర్థమైంది. అది మువ్వ శరీరం. ఆమెను నీటిలో గొయ్యితీసి సగం వరకు పాతిపెట్టి ఆమె రాసుకున్న తాళపత్రాలను ముక్కలుగా చింపి ఆ నీటిపై గిరాటు వేసి వెళ్లిపోయాడు. పూర్తిగా అర్థమవుతుండగానే ఇద్దరూ గబగబా నీటిలో మునిగి ఆ గొయ్యి తవ్వి.. ఆమె శరీరాన్ని బయటికి గుంజి ఎత్తి పట్టుకుని.. బయటికి పరుగులు పెడుతూ ఒడ్డుకొచ్చి పడ్డారు.ఆమె.. మువ్వ! దాదాపు శవమై ఉంది. తల, చేతులు, కాళ్లు పట్టులేక జారిపోతున్నాయి.
ఇద్దరూ.. “మువ్వా.. మువ్వా..”
వంద పిలుపులు.. మువ్వా మువ్వా..
లక్ష అరుపులు.. మువ్వా మువ్వా..
కోట్ల గొంతుకల ఏడుపులు.. మువ్వా.. మువ్వా..
చటుక్కున కదిలిందామె.
మళ్లీ మళ్లీ పిలుపులు.. అరుపులు..
“మువ్వా.. మువ్వా.. నేను నేను జాయపుణ్ని. అదే.. జగన్నాథుణ్ని! చూడు చూడు.. ఒక్కసారి కళ్లుతెరువు మువ్వా..”
“మువ్వా.. నీ స్వామీ వచ్చాడు. నువ్వు ఇప్పుడు ఆయన ఒడిలోనే ఉన్నావ్. నీ జగన్నాథుడు.. నీ నాథుడు. నువ్వు కొలిచే.. నువ్వు రాసే.. పాడే.. అన్నిటికీ ఆది దేవుడు..”
“మువ్వా.. నీకు అబద్ధం చెప్పాను మువ్వా! నేను జాయచోడుణ్ని.. వెలనాడు..” నిజాయతీగా చెబుతూ ఏడుస్తూ.. అరుస్తూ చెబుతూ.. అప్పుడు కదిలిందామె. కాళ్లూ చేతులు కదిలి శరీరమంతా ఒక్కటిగా జివ్వున కదిలింది జాయపుని ఒడిలో. మెల్లగా శక్తినంతా కూడదీసుకుని కళ్లు తెరిచింది.
వెన్నెల వెలుగంతా సముద్రం నుంచి, కృష్ణమ్మ నుంచి కదిలి ఏకమై మువ్వ కళ్లలో చేరినట్లు.. అవి మిలమిలా మెరుస్తున్నాయి. తదేకంగా జాయపుణ్నే చూస్తున్నది. ఊపిరికి పైయెద ఎగసి ఎగసి పడుతున్నది. జాయపుని కళ్లలోకి తదేకంగా చాలాసేపు.. చాలా చాలాసేపు.. చాలా చాలా చాలాసేపు.. కళ్లల్లో బుగ్గల్లో పెదవుల్లో.. వెలుగు.. నవ్వులాంటి వెలుగు! లక్ష గచ్చపొదలేవో చటుక్కున పూసినట్లు. కదిలి ఏదో చెప్పాలని.. బలవంతంగా నోరు తెరవడానికి యత్నిస్తూ.. గొంతులో అడ్డున్నదేదో తొలగించబోయి.. ఉన్నట్టుండి పెద్దగా శక్తినంతా కూడదీసుకుని అరిచింది.
“గోపాలా..”
అంతే..! దగ్గరగా ఏదో పగిలిన శబ్దం.. కపాల మోక్షం!!
వెనక్కు వాలింది తల. కానీ, ఆ కళ్లు తెరచే ఉన్నాయి. అవి జాయపుణ్నే చూస్తున్నాయి.
* * *
ధనదుపురం కోట సింహద్వారం.. తెల్లవార వస్తున్నది. గాలి వలవలా ఏడుస్తూ.. కన్నీటిని తుడుచుకుంటున్నట్లు చమ్మగా తాకుతున్నది. కోట ద్వారానికి కట్టిన దివిటీలు నీరసంగా వెలుగుతున్నాయి. వాటి దగ్గరగా మూగిన దోమలు మంద్రంగా ముచ్చట్లాడుతున్నాయి. ఓ మంజూషను చేతితో పట్టుకుని దూరంగా చూస్తూ అసహనంగా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు పృథ్వీశ్వరుడు. ఆయన వాలకం చూస్తే చాలాసేపటి నుంచి అక్కడే ఎవరి కోసమో ఎదురుచూస్తున్నట్లుంది. వెనగ్గా మహాద్వారం వద్ద శ్రీవాకిలి సకలేశ్వర, పల్లెకేతు, ఒకరిద్దరు ఎక్కటీలు.. ద్వారపాలకులు. పృథ్వీశ్వరుని నిరీక్షణ ఫలించినట్లు దూరంగా ఎవరో కనిపించారు.
ఆయన ముఖం విప్పారింది. మళ్లీ అంతలోనే విషాద వీచికలతో కనురెప్పలు కొట్టుకున్నాయి. ఆ వ్యక్తి దగ్గరగా వచ్చాడు. చేతిలో గుర్రపు పగ్గాలు పట్టుకుని దాని పక్కన నడుస్తూ వచ్చాడు. వెలనాడు మండలేశ్వరుడు.. తమ్ముడు జాయచోడుడు. ఏదో చెప్పబోయి తమ్ముడి వాలకం చూసి ద్భిగ్బ్రమగా ఆగిపోయాడు పృథ్వీశ్వరుడు. ఓ అద్భుతం సాధించిన ఆత్మవిశ్వాసంతో రాత్రి భోజనాల అనంతరం అందరికీ వీడ్కోలు పలికిన తమ్ముడు.. ఇప్పుడు.. ఈ తెలవారబోయే వేళకు కోటకు వస్తున్నప్పుడు.. ఇదేమిటి.. అంత విషాదభాజనంగా ఉన్నాడూ?! రాత్రంతా ఏమి జరిగిందో..!? నిర్వికారంగా అన్నను చూసి కొన్ని అక్షరాలు పోగుచేసుకున్నట్లు అన్నాడు జాయపుడు.
“ఈ సమయంలో.. ఇక్కడ.. ఏమైంది అన్నా?!”.
తమ్ముడి కోసం సింహద్వారంవద్ద వేచి చూడటానికి కారణం ఉంది.
“జాయా.. అనుమకొండ నుంచి అధికారిక ఉత్తర్వులు. తక్షణం వెలనాడు మండలీశ్వర బాధ్యతలు నాకు అప్పగించి.. నిన్ను అనుమకొండకు రావాల్సిందిగా శ్రీమన్ మహామండలేశ్వరుల అధికారిక ఆదేశాలు..”
అనుమకొండకు వెళ్లడానికి ఉత్సాహం చూపే తమ్మునికి అధికారిక ఆదేశాలు రావడం సంతోషపరుస్తాయని అన్న భావన. మంజూష తెరచి రెండు రాచముద్రలున్న పత్రాలు తీసి జాయపుని వైపు చాపాడు.విన్నాడు. అవి చేతికి తీసుకోలేదు. చమటతో తడిసిన ముఖమంతా నిరాసక్తత!!
“అయితే బయల్దేరతాను అన్నా..” అన్నాడు. చెప్పేది పూర్తి కాకుండానే వెనుదిరిగాడు. మ్రాన్పడిపోయాడు పృథ్వీ. వెనుకనున్న పల్లెకేతు తదితరులు దగ్గరికొచ్చారు.
“అరె.. ఆగాగు. ఇదేమిటి.. ఇప్పుడేనా!? ఇలాగేనా.. ఈ రాత్రి వేళా??” అబ్బురంగా వేగంగా అన్నాడు.
“నాకు రాత్రేమిటి.. పగలేమిటి.. ఈ రెండిటికీ నాకు తేడా ఉందా!?”..
లోలోన అనుకున్నానని అనుకున్నాడు జాయపుడు. కానీ, పూర్తిగా విన్న పృథ్వీ..
“తమ్ముడూ ఏమిటి. ఎమైంది.. ఏమిటా వైరాగ్యపు మాటలు..” వైరాగ్యం.. బావుంది బావుంది.. అన్న మంచిమాట వాడాడు.
విక్రమను వెనక్కి మరల్చి..
“బయల్దేరతాను అన్నా! తీసుకుపోడానికి నాకంటూ ఏమీలేవు కదా! బయల్దేరతాను. మహా మండలేశ్వరులు ఇచ్చిన అధికారలేఖతో వచ్చాను. వెనక్కు పిలుస్తున్న లేఖతో వెళ్లిపోతాను..”
ఆ లేఖలను తీసుకుని చదవకుండానే కంచుకంలో దోపాడు. లోలోన రగులుతున్న అనేకానేక సంఘటనల అగ్నిపర్వతాలు పేలుతూ లావా విరజిమ్ముతుంటే.. అవి బయటికి, అన్నకు కనిపించకుండా లోలోనే అణచుకుంటున్న ఆ మహాపురుషుడు కొన్నిలిప్తలు చుట్టూ చూశాడు.
దగ్గరగా మసకమసక కాగడాల వెలుతురు, ఆవల సాగరపు హోరు, ఈవల కృష్ణమ్మ మౌనంగా ఏడుస్తున్న శబ్దం.. రివ్వురివ్వున చుట్టుముడుతూ వెర్రిగా బిగ్గరగా ఏడుస్తూ తన సహానుభూతిని చెప్పడానికి ఆరాటపడుతున్న తూరుపుగాలి. నిట్టూర్చాడు.
“వెలుగు రాబోతున్నది అన్నా! మరికాసేపట్లో ప్రత్యుషమవుతుంది. చూస్తే పిల్లలు వెంటపడతారు. ఈ బంధాలు, ఆప్యాయతలు తట్టుకోలేకపోతున్నాను అన్నా..”
గొంతులో విహల్వజీర.. అద్భుత విజయాన్ని అందుకున్న తమ్ముడు ఇంతలో ఇలా విహల్వంగా కనిపించడానికి కారణం ఏమిటో తెలియని తోడబుట్టినవాడు గందరగోళమై పోతున్నాడు. అంతే.. ఇక వెనుతిరిగి చూడలేదు జాయపుడు. దిగ్బ్రమ నుంచి పృథ్వీశ్వరుడు తెప్పరిల్లి..
“జాయా.. బావగారు, అక్క నీకు రాసిన మరో..” అన్నాడు కానీ అప్పటికే దూరంగా నడుస్తూ వెళ్లిపోతున్నారు జాయపుడు, విక్రమ. ఆ చీకటిలో.. అనుమకొండ దిశగా.. లిప్త లిప్త కాలానికి దూరమవుతున్న తమ్ముణ్ని నీరునిండిన కళ్లతో చూస్తున్న పృథ్వీశ్వరునికి దూరంగా ఓ వీధినుంచి బయటికి వచ్చిన ఓ మహిళ అతని వెనకే వెళుతున్నట్లు.. గబగబా కళ్లు తుడుచుకుని చూశాడు. మసకమసగ్గా తెలుస్తున్నది. అవును.. ఎవరో.. స్త్రీ ఆకారం!!
* * *
“స్వాగతం మహావీరా.. జాయచోడ దేవా.. స్వాగతం సుస్వాగతం!”.
అనుమకొండ నగర ప్రవేశస్థలం వద్దనున్న ద్వారతోరణం. స్వాగత ద్వారాలు.. దారంతా ఇరువైపులా పువ్వులతో అలంకారాలు.. వేలాది సైనికులు, పౌరులు.. ఉత్సాహంతో, ఉద్వేగంతో ఊగిపోతున్నది అనుమకొండ.
(సశేషం)
– మత్తి భానుమూర్తి
99893 71284