జరిగిన కథ : పురనివాసం మొదటి అంతర్వు వసారాలో నిలబడి వీధులను పరికిస్తున్నాడు జాయపుడు. చిన్నగా వర్షం కురుస్తున్నది. చీకటి, వర్షం కలగలిసిన వింత సవ్వడిలో.. వీధి చివరి నుంచి అశ్వంపైన ఓ మహిళ అటువైపే వస్తుండటం గమనించాడు. ఆమె ఆహార్యం, ఆభరణాల మెరుపు చూస్తే.. కులీన మహిళలాగే ఉన్నది. వచ్చివచ్చి జాయపుని నివాసం దగ్గర గుర్రం దిగింది. తలపై ఉన్న ముసుగు తొలగించి.. తలపైకెత్తి జాయపుణ్ని చూసింది. ఆమెను చూడగానే.. అతని ఒళ్లు జలదరించింది. ఆమెను గుర్తించాడు.
ఆమె ఇంద్రాణి.. గబగబా కిందికి దిగి వచ్చాడు. భవనపు ముందున్న వసారాలోని కాగడా వెలుగులో.. ఆమె.
పూర్తిగా తడిసిన అలంకృత నూతన వధువు. పాపిట నుంచి కారుతున్న నీటిధార నుదుటనున్న కల్యాణ తిలకాన్ని తాకుతున్నది. కళ్ల నుంచి కారుతున్న నీరు.. తుడిచినప్పుడల్లా ఓ చెంప బుగ్గచుక్కను.. మరో చెంప పెదవుల లత్తుకనూ స్పృశిస్తున్నాయి. ఆమె దుఃఖంతో మిళితమైన ఊపిరి పీల్చి వదలినప్పుడల్లా తడిసిన ఎద ఎగసిపడుతున్నది.
“లోపలికి రండి ఇంద్రాణిదేవి!” అన్నాడు జాయప.
బయట వర్షం పెరిగింది. ఇంద్రాణి దుఃఖగీతానికి వాద్య ఘోషలా.. మధ్య మధ్య ఉరుములు మెరుపులు!
ఉత్తరీయం అందించాడు. ఆమె మౌనంగా అందుకుని వినీల కచభరాన్ని ఆ ఉత్తరీయంలో చుట్టింది. జాయపుడు విచిత్రమైన మనఃస్థితిలో ఉన్నాడు. ఈవిడగారు ఎందుకు వచ్చినట్లు?!
ఆమె అన్నది..
“మేము.. నేను వివాహవేడుక నుంచి వచ్చేశాను..”
వర్షంలో మాటలు కూడా తడిసినట్లు.. ఆమె మాటలు అదోలా అనిపిస్తున్నాయి.
వెంటనే అన్నాడు..
“ఏమి? ఎందుకు??”.
“మీకోసం. నేను తప్పుచేశాను. తమరిని నిరాకరించి పెద్ద తప్పు చేశాను. నా తప్పు ఏమిటో తెలుసుకున్నాను. అందుకే, నా ఈ తప్పు బతుకంతా నన్ను.. ఇతరులను బాధ పెట్టకూడదని వచ్చేశాను. మిమ్మల్ని నమ్మి వచ్చేశాను!”.
“ఇప్పుడు ఇలా రావడం అతిపెద్ద తప్పు ఇంద్రాణిదేవి. నేను ఏ విధంగానూ మీకు తగినవాడను కాదు. అప్పుడు మీరు మంచినిర్ణయం తీసుకున్నారు. నన్ను తిరస్కరించారు”.
“అదే.. అదే నేను చేసిన పెద్దతప్పు. మీకు తెలియకుండా నేను మీపై వేగులను నియోగించాను. మీకు.. మీకు ఆ అమ్మాయి వల్ల జరిగిన నష్టం నిన్ననే నా దృష్టికి వచ్చింది. ఇక ఆగలేకపోయాను. పెళ్లిపందిరి నుంచి వచ్చేశాను. నాకు మీరే తగిన భర్త.. ఇది నా అంతిమ నిర్ణయం!”.
కాకతి ఉదంతం ఇంద్రాణికి పూర్తిగా తెలిసింది.
ఏదో చెప్పబోయాడు. నివాసం ముందు కలకలం.. పది పదిహేను గుర్రాలు ఆగాయి. రౌతులు దిగుతున్నారు. ముందు కనిపించినవాడు పుళిందపుడు. భయంభయంగా చూస్తూ వంగి, వంగుతూ చేతులు పిసుక్కుంటూ ముందుకు వచ్చాడు. అతణ్ని చూడగానే జాయపుని దవడలు బిగుసుకున్నాయి.
“క్షమించాలి సేనానీ.. ఇంద్రాణిదేవి ఇలా చేయడం రాజనగరికే అవమానం. మహామండలీశ్వరులు కూడా వివాహానికి హాజరయ్యారు. మీ అభిప్రాయం?”.
“ఇంద్రాణిదేవి ఇలా వచ్చేయడం నేను సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాను. అదే ఆమెకు చెప్పాను. ఆమెను మీరు తీసుకువెళ్లవచ్చు”.
పుళిందపునితో వచ్చిన ఆగంతుకులు లోపలికి వెళ్లి ఇంద్రాణిని పట్టుకోబోయారు. జాయపుడు మెరుపువేగంతో వాళ్లకు అడ్డునిలబడి ఆమెను తాకనివ్వలేదు.
“బయటికి పొండి. నా అనుమతి లేకుండా నా ఇంట్లోకి కాలు పెట్టడానికి ఎన్ని గుండెలు కావాలి?”..
పుళిందపుడు ముందుకొచ్చి వాళ్లను వెనక్కి లాక్కుపోయాడు. జాయపుడు ఆమె దగ్గరగా వెళ్లాడు. ఆమె తలవొంచుకుని వెక్కివెక్కి ఏడుస్తున్నది.
అప్పుడన్నాడు జాయపుడు..
“తమరు బయటికి ఏడుస్తున్నారు. నేను లోపల ఏడుస్తున్నాను ఇంద్రాణిదేవి. మీరు సాహసం చేసి నా వద్దకు వచ్చేశారు. కానీ, నేను ఆహ్వానించే మానసికస్థితిలో లేను. ఆ అమ్మాయి వెళ్లిపోయింది కనుక ఆ స్థానాన్ని భర్తీ చేయగలనని మీరు భావించారేమో. కానీ.. కానీ ఆమె స్థానాన్ని భర్తీ చేయగలవారు ఎవ్వరూ లేరు.. ఉండరు. ఆమె నాతోనే.. నాలోనే ఉంది. దయచేసి మీరు మంచి పట్టమహిషిగా సంతోషంగా ఉంటే నేనెంతో సంతోషిస్తాను”.
చేతులు జోడించి నమస్కరించి ఆమెకు బయటికి దోవ చూపాడు. ఇంద్రాణికి మరోమార్గం లేదు. మరో మాటా లేదు. కళ్లు తుడుచుకుని మౌనంగా బయటికి వెళ్లింది. వాళ్లు తెచ్చిన పల్లకి ఎక్కింది. పల్లకి వెంట అశ్వాలు కదిలాయి.
వాన హెచ్చింది.. ఉరుములు మెరుపులు..
“పుళిందపా..” అరిచి పిలిచాడు జాయపుడు.
చటుక్కున అశ్వం దిగి పరుగున దగ్గరికి వచ్చాడు.
“ఆమె భర్త ఎవడో!?”.
“మన మిత్రుడు ముమ్మడి సేనానులవారు!”.
“ముమ్మడో గుమ్మడో ఎవడో.. నాకు అనవసరం. కానీ ఆమెకు చిన్నపాటి అసహనం కలిగినా వాణ్ని బతికుండగానే తోలు ఒలిచి ఆమెకు పాదరక్షలు కుట్టిస్తానని నా మాటగా చెప్పు. అప్పుడు నిన్ను ఏం చేస్తానో తెలుసా.. కటికులు నీ తోలు వొలుస్తుండగా నీముందు నేను ఆనందనృత్తం చేస్తాను పుళిందపా.. తస్మాత్ జాగ్రత్త!”.
నడి వీధిలో మధ్యగా నిలబడి కాకతీయ మహాయోధ జాయప గజచమూపతి చెయ్యెత్తి వేలు చూపిస్తూ తీవ్ర స్వరంతో చెప్పిన మాటలతో వరుణదేవుడు వణికిపోతూ పిచ్చిపిచ్చిగా అరుస్తున్నట్లు ప్రళయకాల జర్ఝరిత భయంకర ఉరుములకు కాకతీయం లిప్తకాలం కంపించి నిలిచింది.
ఓరోజు ఉదయం తెలతెల్లవారుతున్న సమయాన.. జాయపుని పురనివాసం ముందు ఓ శవం పడేసి ఉంది. శరీరభాగాలు ముక్కలుముక్కలుగా ఖండించి దగ్గరగా పెట్టి, పైన శిరస్సును ఉంచి.. అందరికీ తెలిసేలా జాయపుని పురనివాసానికి ఎదురుగా పెట్టారు. గజశాలకు వెళ్లబోతూ అందరూ మూగి చూస్తున్నదేమిటోనని దగ్గరగా వెళ్లి.. ఆ శవాన్ని చూసి తెల్లబోయాడు జాయపుడు.
ఉదయం మూడోజాము వేళ..
చక్రవర్తి రెండో కొలువు చాలా రద్దీగా జరుగుతున్నది. ఆయన ఓ సమావేశాన్ని ముగించి బయటికి వచ్చాడు. అక్కడే ఉన్న జాయపుణ్ని గుర్తించి క్రీగంట చూస్తూ..
“తమరి పురనివాసాన్ని తిరిగి కళానివాసం చేస్తున్నారట. మా దృష్టికి వచ్చింది. కొనసాగించండి..” అంటూ మరో సమావేశానికై ముందుకు సాగిపోయాడు. తండ్రి అంత్యక్రియలకు తలగడదీవి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత జాయపుడు తిరిగి తన పురనివాసంలోనే ఎక్కువగా గడుపుతున్నాడు. కాకతిని గుర్తు తెచ్చుకోవడానికి అయినా మర్చిపోవడానికి అయినా.. అదే అతని ప్రపంచం.. ఒంటరి కళాప్రపంచం!
వివాహం వద్దన్న తమ్ముణ్ని నారాంబ గద్దించలేకపోతున్నది. సొంత నిర్ణయాలు తీసుకోగలిగిన పూర్తి పరిణిత యువకుడిగా ఆమె పరిగణిస్తున్నది.
కొలువు కూటముల మధ్య తనకు కనిపించాల్సిందిగా గణపతి ఆదేశించాడు. అందుకే నిత్యమూ కొలువుకు వస్తున్నాడు. ఈరోజు కూడా ఆయనకు కనిపించి ఆయన మరో కార్యక్రమంలో నిమగ్నమయ్యాక ఓ ఆసనంలో కూర్చున్నాడు. ప్రధానమందిరం దాదాపు నిర్మానుష్యంగా.. నిశ్శబ్దంగా ఉంది. భర్తృహరి సుభాషితాలు తాళపొత్తం కంచుకంలోంచి తీసి పరికిస్తున్నాడు. ఇటీవల కాస్త విశ్రాంతి లభిస్తే కాకతి ఆలోచనలు రాకుండా భర్తృహరిని ఆశ్రయిస్తున్నాడు. మిత్రులమధ్య, పెద్దల వద్ద సమయానుకూలంగా ఓ సుభాషితం చెప్పడం జాయపునికి మహా ఇష్టం.
‘భాషాసు ముఖ్యా మధురా దివ్యా గీర్వాణ భారతీ
తస్మాద్ధి కావ్యం మధురం తస్మాదపి సుభాషితమ్!’ ఈ ఆర్యోక్తి అతనికి మహా ఇష్టం.
(భాషలలో సంస్కృత భాష ముఖ్యం, మధురం, దివ్యం. దానిలో కావ్యం మధురం, ఆ కావ్యంలో కూడా సుభాషితం మరింత మధురం)
తల ఎత్తినప్పుడు సభామందిరం చివరగా కుడ్యం పక్కగా తెలిసిన మనిషి కనిపించాడు జాయపునికి.
ప్రసాదిత్యుడు!
చాలా ఆశ్చర్యపోయాడు. ఎక్కడో కొలనిపురి స్కంధావారంలో ఉండాల్సిన సర్వసైన్యాధ్యక్షుడు ఇక్కడ రాజనగరులోకి వచ్చాడేమిటి? యుద్ధభూమిలోని వాళ్లు ఏదైనా కావాలంటే వాయువేగంతో పంపిస్తారు. మరి ఎందుకు వచ్చినట్లు?
కాకతీయ రాజ్య ధురంధరుడు గంగాధరుని వృద్ధాప్యం కారణంగా ఆయనకు విశ్రాంతినిచ్చి.. ప్రధానులలో ఒకడైన గోపరాజు రామయను మహాప్రధానిగా నియమించాడు చక్రవర్తి. ఆయన లేఖకులకు రాయడానికి ఏదో ఆదేశిస్తూ.. కొందరికి ఆజ్ఞలు ఇస్తూ.. పక్కన నడుస్తూ వస్తున్న ప్రసాదిత్యునితో నవ్వుతూ కబుర్లు చెబుతూ మందిరంలోకి ప్రవేశించాడు.
కొలనియుద్ధంలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నా.. వీణ్ని గొప్పయోధుడుగా భావిస్తున్నవాడు ఈయనొక్కడే కాబోలు!
అనంతరం కదిలి రాజనగరి లోపలికి వెళ్లసాగాడు ప్రసాదిత్యుడు. ఆశ్చర్యపోతూ వెనగ్గా అనుసరించాడు జాయపుడు. ఆదిత్యుడు వేగులు, రక్షకభటుల కైవారాలు గైకొంటూ పోయి.. అంతఃపురం లోపలికి వెళ్లి మాయమయ్యాడు. దూరంగానే చూసి కొయ్యబారిపోయి అక్కడే నిలబడిపోయాడు జాయపుడు.
కాసేపటికి కదిలి వడివడిగా తన మందిరానికి వచ్చేశాడు. ఏం జరుగుతున్నది రాజనగరి అంతఃపురంలో?!
తిరిగి అంతఃపురాన్ని ఏకంచేసి భార్యలమధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పరచడానికి గణపతిదేవుడు ప్రయత్నిస్తున్నా.. దూరదూరంగా ఉన్నప్పటి రాచరికపు పలకరింపులు దగ్గరయ్యాక తగ్గిపోయాయి. పైగా సవతుల మధ్య చిన్న అంశాలు కూడా భూతాల్లా పెద్దవిగా కనిపిస్తున్నాయి.
నారాంబ, సోమలదేవి మధ్య పిల్లల విషయంలో ఈ వైరుధ్యాలు స్పష్టంగా ఉన్నాయి. రాజనగరి రాజకీయాలతో నాశనమైపోయిన రాజవంశాలెన్నో! భార్యలే కూల్చేసిన రాజ్యాలెన్నో!!
అందుకే కాబోలు సోమలదేవి తనను అవమానించింది. ఇప్పుడు ప్రసాదిత్యుడు అంతఃపురంలోకి వెళ్లాడు. ఇదేదో దృష్టి పెట్టాల్సిన అంశంగా అతనికి తోచింది. అంతఃపురి రాజకీయ, సవతుల సమస్యలు చెవిన పడుతున్న సమయంలో ఓ సంఘటన జరిగింది.
ఓరోజు ఉదయం తెలతెల్లవారుతున్న సమయాన.. జాయపుని పురనివాసం ముందు ఓ శవం పడేసి ఉంది.
శరీరభాగాలు ముక్కలుముక్కలుగా ఖండించి దగ్గరగా పెట్టి, పైన శిరస్సును ఉంచి.. అందరికీ తెలిసేలా జాయపుని పురనివాసానికి ఎదురుగా పెట్టారు. గజశాలకు వెళ్లబోతూ అందరూ మూగి చూస్తున్నదేమిటోనని దగ్గరగా వెళ్లి.. ఆ శవాన్ని చూసి తెల్లబోయాడు జాయపుడు.
ఆ వ్యక్తి ఆస్థానవైద్యుడు తిరునగరిభొట్లు అనుచరుడు. పేరు కొండుభొట్లు. రోజూ ఉదయాన్నే చక్రవర్తి కుటుంబం ఆరోగ్యం పరిశీలించి అవసరమైన సలహాలు, సూచనలుచేసి.. అనారోగ్య సూచనలుంటే తగిన మందులు అందిస్తాడు. గురుశిష్యులు దినమూ వస్తారు. అది కాదు జాయపుణ్ని ఆశ్చర్యపరచింది.
నారాంబ కొడుకు, జాయపుని మేనల్లుడు హరిహరదేవుడు అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఈ కొండుభొట్లే దగ్గరుండి మరీ వైద్యం చేస్తున్నాడు. కొన్నినెలలుగా ఈ వైద్యం జరుగుతున్నది.
ఈ విషయం తెలుసు జాయపునికి. ప్రతిదినమూ ఆరేళ్ల వాడైన మేనల్లుణ్ని చూసి ఆరోగ్యం అడిగి తెలుసుకుని కాసేపు కబుర్లుచెప్పి వస్తున్నాడు. అలాంటిది ఈ వైద్యుడు శవమై ఇలా తన నివాసం ముందే పడిఉండటం.. కాదు కాదు తన నివాసం ముందు చంపి పడవేయడం.. వెంటనే నారాంబ వద్దకు పరిగెత్తాడు. జాయపుడు చెప్పింది విని నిలువెల్లా వణికిపోయింది నారాంబ. అప్పుడు జరిగింది చెప్పింది.
“బంధువుల మరణం కారణంగా రాజనగరికి గత మాసం రోజులుగా రాని ప్రధాన వైద్యుడు తిరునగరిభొట్లు నిన్న వచ్చాడు. బాబును పరిశీలించి క్రోధావేశంతో కొండుభొట్లు చెంప చెళ్లుమనిపించాడు. నేను ఆశ్చర్యపోయి అడిగితే తప్పు మందులు వాడుతున్నాడట. ఆయన నిర్దేశించిన వైద్యం ఈ కొండుభొట్లు మధ్యలో మార్చివేశాడట!”.
సందేహం మరింత పెరిగిందే గానీ తగ్గలేదు జాయపునికి.
“సహాయకుడు తప్పుచేశాడు.. ప్రధానవైద్యుడు దండించాడు. సహజమేకానీ వాడు చచ్చి.. కాదు వాణ్ని చంపి పడేశారు. అలా ఎందుకు ఎవరు చేశారు? తెచ్చి నా నివాసం ముందు నాకు కనిపించేలా ఎవరు పెట్టారు? దీని వెనకాల ఏదో కుట్ర ఉందనిపిస్తున్నది. ఏమై ఉంటుంది?” సాలోచనగా అన్నాడు జాయపుడు. ఈసారి ఆశ్చర్యపోవడం ఆమె వంతయ్యింది.
“ఈ మాత్రానికే కొండుభొట్లును చంపేస్తారా?”. జాయపుడు చాలా ఉద్విగ్నుడయ్యాడు.
(సశేషం)
– మత్తి భానుమూర్తి 99893 71284