పల్లెకిలె: టీ20 ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా ప్రస్థానం అధికారికంగా ముగిసింది. జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య మంగళవారం జరుగాల్సిన గ్రూపు-బీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఎడతెరిపిలేని వర్షంతో కనీసం ఒక్క బంతి పడకుండానే ముగిసింది. మైదానం పూర్తిగా చిత్తడిగా మారడం, ఆటకు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే ఆసీస్ మెగాటోర్నీకి దూరం కాగా, ఒక పాయింట్ ఖాతాలో వేసుకున్న జింబాబ్వే సూపర్-8 బెర్తు దక్కించుకుంది.
గ్రూపు-బీ నుంచి ఆతిథ్య శ్రీలంకతో పాటు జింబాబ్వే తదుపరి రౌండ్‌కు అర్హత సాధించగా, ఆసీస్, ఐర్లాండ్, ఒమన్ ఇంటిబాట పట్టాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో గెలిచి రెండింటిలో ఓడిన కంగారూలు తమ ఆఖరి లీగ్ పోరులో ఈనెల 20న ఒమన్‌తో తలపడనున్నారు. 2009 తర్వాత ఆసీస్ గ్రూపు దశలోనే నిష్క్రమించడం ఇది తొలిసారి.
టోర్నీకి ముందే స్టార్ బౌలర్లు ప్యాట్ కమిన్స్‌తో పాటు జోష్ హాజిల్‌వుడ్ దూరం కాగా, తొలి రెండు మ్యాచ్‌లకు రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ గాయంతో అందుబాటులో లేకుండాపోయాడు. మెగాటోర్నీలో టైటిల్ ఫెవరేట్లలో ఒకటిగా భావించిన ఆసీస్ గ్రూపు దశలోనే వెనుదిరుగడంతో ఆ దేశ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. గ్రూపు-ఏ మినహా అన్ని గ్రూపుల నుంచి సూపర్-8 బెర్తులు ఖాయం కాగా, మిగిలిన ఒక బెర్తు కోసం అమెరికా, పాకిస్థాన్ మధ్య పోటీ కొనసాగుతున్నది.