Fab-4 Bowlers : ప్రపంచ క్రికెట్లో ఫ్యాబ్- 4 ఆటగాళ్లు అందరికీ సుపరిచితమే. తమ సొగసైన బ్యాటింగ్‌తో రికార్డుల దుమ్ముదులిపేస్తున్న ఆ నలుగురు భావితరాలకు స్పూర్తి నిలుస్తున్నారు. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లో టెస్టు క్రికెట్‌కు ఆయువుపట్టుగా మారిన విరాట్ కోహ్లీ (Virat Kohli), జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ (Kane Williamson)లు ఫ్యాబులస్ 4గా గుర్తింపు పొందారు. అంతేకాదు ఈతరంలో దిగ్గజ ఆటగాళ్లుగా ఇప్పటికే ఈ నలుగురు పేరొందారు. అయితే.. ఫ్యాబ్ 4 గురించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆ ట్యాగ్ బ్యాటర్లకేనా? బౌలర్లకు వర్తించదా? అనే అనుమానం అభిమానుల్లో ఉండేది. ఆ వెలితిని పూడుస్తూ.. భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ (Zaheer Khan) ఫ్యాబ్- 4 బౌలర్లను ఎంపిక చేశాడు.
కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న అత్యుత్తమ పేసర్లకు, బౌ బుల్లెట్ వేగంతో ప్రత్యర్థులను వణికిస్తున్న స్పీడ్‌స్టర్లకు అతడు ఈ జాబితాలో చోటిచ్చాడు. ఇంతకూ ఫ్యాబ్ 4 బౌలర్లలో ఎవరెవరు ఉన్నారంటే..? ఫ్యాబ్ – 4లో వరల్డ్ క్లాస్ బ్యాటర్లు ఉండడంతో జహీర్ సైతం వరల్డ్ క్లాస్ బౌలర్లనే ఎంపిక చేశాడు. భారత జట్టు ప్రధాన పేసర్, యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ (Mohammad Shami)లకు ఈ వెటరన్ బౌలర్ తొలి ప్రాధాన్యం ఇచ్చాడు.
గత కొంతకాలంగా టీమిండియా అద్భుతంగా ఆడుతోంది. మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో ముందుంది. అన్ని పరిస్థితుల్లో భారత్ నిలకడగా రాణిస్తోంది. అందుకనే నేను జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలను ఫ్యాబ్ – 4 బౌలర్లుగా తీసుకున్నా. ఇక.. ఇంకా రెండు స్థానాలకు సఫారీ పేసర్ కగిసో రబడ(Kagiso Rabada), జోష్ హేజిల్‌వుడ్(Josh Hazelwood)లను ఎంపిక చేశాను. అయితే.. ప్యాట్ కమిన్స్ సైతం ఫ్యాబ్ – 4 బౌలర్లలో ఉండాల్సినవాడే. ఈ నలుగురు లేదా ఐదుగురు బౌలర్లు టెస్టు క్రికెట్‌పై తమ ముద్ర వేశారు అని క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ జహీర్ ఖాన్ వెల్లడించాడు.
హేజిల్‌వుడ్, షమీ
ఈతరంలో అత్యద్భుత బౌలర్‌గా ప్రశంసలు అందుకుంటున్న బుమ్రా 32 మ్యాచుల్లోనే 164 వికెట్లతో ఔరా అనిపించాడు. షమీ సైతం తగ్గేదేలే అంటూ 64 మ్యాచుల్లో 229 వికెట్లు తీశాడు. రబడ 64 మ్యాచుల్లో 299 వికెట్లు, కమిన్స్ 62 మ్యాచుల్లో 269 వికెట్లు తీయగా.. హేజిల్‌వుడ్ 70 మ్యాచుల్లో 273 వికెట్లు పడగొట్టాడు.