Yuvraj Singh : రాజకీయాలు, సినిమాలు, వ్యాపారంలోనే కాదు క్రికెట్లో వారసత్వం మామూలే. దిగ్గజ, మాజీ ఆటగాళ్ల సంతానం క్రికెటర్లుగా మారడం చూశాం. అయితే.. వాళ్లలో కొందరు విజయవంతం కాగా.. మరికొందరు రెండు మూడు మ్యాచ్‌లకే పరిమితం అయ్యారు. అయినా సరే ప్రతి మాజీ ప్లేయర్ తమ పిల్లల్ని తమలా మైదానంలో చూడాలని ఆశ పడుతుంటారు. కానీ, యువరాజ్ సింగ్ (Yuvraj Singh) మాత్రం తన కుమారుడిని మాత్రం క్రికెటర్‌ను చేయాలనుకోవడం లేదట. ఈ విషయాన్ని యూవీనే స్వయంగా చెప్పాడు. అందుకు కారణం ఏంటో కూడా వివరించాడు.
టీమిండియా గొప్ప ఆల్రౌండర్లలో ఒకడైన యువరాజ్ ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ సందర్బంగా మీ అబ్బాయిని క్రికెటర్ చేస్తారా? మొదటి కోచ్ మీరే అవుతారా? అనే ప్రశ్నలకు ఈ మాజీ ఆల్‌రౌండర్ ఆసక్తికర సమాధానమిచ్చాడు.
April 2, 2011 — the night we did it for a billion people… and for one man who carried Indian cricket on his shoulders for over two decades.
That World Cup wasn’t just a win. It was a thank you to a legend. We grew up watching @sachin_rt . That night, we played to give him the… pic.twitter.com/1U5J8Pt2dM
— Yuvraj Singh (@YUVSTRONG12) April 2, 2025
‘ఈ రోజుల్లో క్రికెట్‌కు ఆదరణ మరింత పెరిగింది. అయితే.. నేను మాత్రం నా కుమారుడు ఓరియన్(Orion)ను క్రికెటర్‌గా చూడాలని అనుకోవడం లేదు. నా తండ్రి యోగ్రాజ్ సింగ్ నాకు కోచింగ్ ఇచ్చినట్టు నేను మావాడికి శిక్షణ ఇవ్వాలనుకోవడం లేదు. మా అబ్బాయి వేరే ఏదైనా కెరియర్ ఎంచుకుంటే బాగుంటుందని భావిస్తున్నా. ఎందుకుంటే .. ప్రస్తుత కాలంలో క్రికెట్ ఆడే పిల్లలపై ఎంతో ఒత్తిడి ఉంటోంది. అంతేకాదు ప్రతి పిల్లాడు తమ తండ్రి వారసత్వాన్ని తలచుకుంటూ ఉంటారు. ఒకవేళ ఒరియన్ క్రికెటర్ అవ్వాలనుకుంటే మాత్రం నేను అడ్డుపడను. అతడికి సంపూర్ణంగా సహకరిస్తాను’ అని యూవీ వెల్లడించాడు.
తండ్రి ప్రోత్సాహంతో క్రికెటర్‌గా మారిన యువరాజ్ 18 ఏళ్లకే భారత జట్టుకు ఎంపికయ్యాడు. ధోనీ నాయకత్వంలో టీమిండియా 2007 టీ20 వరల్డ్ కప్ గెలుపొందడంలో యూవీ పాత్రను మరువలేం. ఈ టోర్నీలోనే ఇంగ్లండ్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్‌ను బలిపశువు చేస్తూ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదాడీ హిట్టర్.
ఇక 2011 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో నోట్లోంచి రక్తం కక్కుతూనే ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు యూవీ. అనంతరం క్యాన్సర్ నిర్ధారణ కావడంతో.. ఆటకు దూరమైన యువరాజ్.. కోలుకున్న తర్వాత పునరాగమనంలోనూ అదరగొట్టాడు. 2019, జూన్ 10న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. కోచ్‌గా రాణిస్తున్నాడు. యువకెరటం అభిషేక్ శర్మ రాటుదేలడంతో యూవీ కీలక పాత్ర పోషించాడు.