Six marriages : ఈ రోజుల్లో పెళ్లంటే లక్షల్లో ఖర్చవుతోంది. సామాన్యులు సైతం పెళ్లిళ్ల కోసం తమ తాహతుకు మించి ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో హర్యానాకు చెందిన ఓ కుటుంబం ఖర్చును తగ్గించుకునేందుకు వినూత్న ప్రయత్నం చేసింది. ఇద్దరు అన్నదమ్ములు తమ పిల్లలకు ఒకే వేదికపై ఒకే ఖర్చుతో పెళ్లిళ్లు చేశారు. వారి ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి పెళ్లిళ్ల వల్ల ఖర్చు తగ్గడమేగాక, కుటుంబంలో ఐక్యతాభావం పెరుగుతుందని ప్రశంసిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని హిసార్ జిల్లాకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు తమ ఆరుగురు పిల్లలకు ఒకేసారి పెళ్లిళ్లు చేశారు. డబ్బులతోపాటు సమయాన్ని కూడా ఆదా చేసుకున్నారు. జిల్లాలోని గవార్ గ్రామంలో ఈ వివాహాలు జరిగాయి. గవార్ గ్రామానికి చెందిన రాజేష్ పూనియా, అమర్‌సింగ్ పూనియా అనే ఇద్దరు అన్నదమ్ములు తమ ఆరుగురు పిల్లలకు ఒకే వేదికపై రెండు రోజుల్లో పెళ్లిళ్లు జరిపించారు.
ఏప్రిల్ 18, 19 తేదీల్లో ఈ వివాహాలు జరిగాయి. ఇద్దరు కుమారుల పెళ్లిళ్లను ఏప్రిల్ 18న, నలుగురు కుమార్తెల పెళ్లిళ్లను ఏప్రిల్ 19న జరిపించారు. వీళ్లంతా నాలుగు వేర్వేరు కుటుంబాలకు కోడళ్లు, అల్లుళ్లు అయ్యారు. కవిత (27), ప్రియాంక (26), సందీప్ (21) ముగ్గురూ రాజేష్ పూనియా పిల్లలు కాగా.. మోనికా (29), ప్రీతి (27), సంజయ్ (30) ముగ్గురూ అమర్‌సింగ్ పూనియా పిల్లలు.
అమర్‌సింగ్ కుమార్తెలు మోనికా, ప్రీతి ఇద్దరూ సొంత అన్నదమ్ములను పెళ్లి చేసుకోగా, రాజేష్, అమర్‌సింగ్‌ల కుమారులు సంజయ్, సందీప్ ఇద్దరూ సొంత అక్కాచెల్లెళ్లను వివాహం చేసుకున్నారు. ఒక పెళ్లి ఖర్చుతో అందరి పెళ్లిళ్లు పూర్తయ్యాయి. మొత్తం నాలుగు ఊర్లలో ఈ పెళ్లిళ్లకు సంబంధించిన ఊరేగింపులు జరిగాయి. ఆరుగురి పెళ్లిళ్లు ఒకేసారి చేసిన అన్నదమ్ములను అంతా పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
అయితే పూనియా కుటుంబం చేసిన కార్యక్రమంపై గ్రామ వాసి రమేశ్ హవల్దార్ మీడియాతో మాట్లాడారు. ‘మేము కూడా అలాగే చేస్తాం. కుటుంబాలు కలిసి వివాహం చేసుకోవడం ద్వారా డబ్బు ఆదా కావడమే కాకుండా, సమాజానికి సోదరభావ సందేశం ఇచ్చినట్లవుతుంది. ద్రవ్యోల్బణం, సమయాన్ని ఆదా చేయడానికి కలిసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో సామాన్యులు సమాజానికి మంచి సందేశం ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.