మంగళవారం 14 జూలై 2020
Sports - Jun 30, 2020 , 00:34:51

ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌లోకి నితిన్‌ మీనన్‌

ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌లోకి నితిన్‌ మీనన్‌

  • ఈ ఘనత దక్కించుకున్న పిన్నవయస్కుడిగా రికార్డు 

దుబాయ్‌: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ఎలైట్‌ ప్యానెల్‌లో భారత యువ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ చోటు దక్కించుకున్నాడు. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా(36) రికార్డును తన ఖాతాలో వేసుకొని.. ఇంగ్లండ్‌కు చెందిన మైకేల్‌ గాఫ్‌(40)ను వెనక్కి నెట్టాడు.  శ్రీనివాస్‌ వెంకట్రాఘవన్‌, సుందరం రవి తర్వాత ప్యానెల్‌లో అడుగుపెట్టిన మూడో భారత అంపైర్‌గా నితిన్‌ మీనన్‌ నిలిచాడు. రవి గతేడాది ఉద్వాసనకు గురికాగా ప్రస్తుతం ప్యానెల్‌లో ఏకైక భారతీయుడిగా మీనన్‌ ఉన్నాడు. 2020-21 సీజన్‌ కోసం వార్షిక సమీక్షలో ఇంగ్లండ్‌ అంపైర్‌ నైజెల్‌ లాంగ్‌ను తప్పించిన ఐసీసీ.. నితిన్‌ మీనన్‌కు చోటు కల్పిస్తూ సోమవారం నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఐసీసీ అంపైర్స్‌ ఎలైట్‌ ప్యానెల్‌లో 12మంది ఉన్నారు.  ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో మూడు టెస్టులు, 24 వన్డేలు, 16 టీ20లకు నితిన్‌ అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వర్తించాడు. ఎలైట్‌ ప్యానెల్‌లో తనకు చోటు దక్కడంపై నితిన్‌ మీనన్‌ హర్షం వ్యక్తం చేశాడు. ‘ప్రముఖ అంపైర్లు, రిఫరీలతో కలిసి నిరంతరం పనిచేయాలని ఎప్పటి నుంచో కలలు కన్నా. ఇప్పుడు సాకారమైంది. ఎలైట్‌ ప్యానెల్‌లో కొంతకాలం మనకు ప్రాతినిధ్యం లేదు. నేను భారత పతాకాన్ని రెపరెపలాడించాలనుకుంటున్నా. మరింత మంది భారత అంపైర్లు ప్యానెల్‌లోకి రావాలని కోరుకుంటున్నా. నా అనుభవాలను పంచుకుంటూ యువ భారత అంపైర్లకు మార్గనిర్దేశం చేసేందుకు  దీన్ని నేను ఓ అవకాశంగా, బాధ్యతగా భావిస్తున్నా’ అని నితిన్‌ మీనన్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 

యాషెస్‌కు అవకాశం! 

కరోనా నేపథ్యంలో విధించిన ఆతిథ్య అంపైర్ల నిబంధనను ఐసీసీ ఎత్తేస్తే.. వచ్చే ఏడాది యాషెస్‌ సిరీస్‌లో అంపైరింగ్‌ చేసే అవకాశం నితిన్‌ మీనన్‌కు దక్కనుంది.  వచ్చే ఏడాది ఇంగ్లండ్‌తో స్వదేశంలో భారత్‌ ఆడాల్సిన ఐదు టెస్టుల సిరీస్‌లో అన్ని మ్యాచ్‌ల్లోనూ అతడు అంపైర్‌గా ఉండే అవకాశం ఉంది. కాగా నితిన్‌ మీనన్‌ తండ్రి నరేంద్ర కూడా అంతర్జాతీయ మాజీ అంపైరే. మధ్యప్రదేశ్‌ తరఫున లిస్ట్‌-ఏ క్రికెట్‌లోనూ నితిన్‌ మీనన్‌ రెండు మ్యాచ్‌లు ఆడాడు. అయితే 22 ఏండ్ల వయసులోనే ఆటకు వీడ్కోలు పలికి ఆ తర్వాతి ఏడాది నుంచే బీసీసీఐ గుర్తింపు పొందిన మ్యాచ్‌లకు అంపైరింగ్‌ చేయడం ప్రారంభించాడు.       


logo