Team India | హైదరాబాద్: ఈ ఏడాది వెస్టిండీస్‌లో ముగిసిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ట్రోఫీ నెగ్గిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి దిగ్గజాలు ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో వారి వారసులెవరా? అన్న చర్చ సాగుతున్న వేళ బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ద్వారా భారత మేనేజ్మెంట్కు ఆ ఖాళీలను పూరించే సదావకాశం దక్కింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో బరిలోకి దిగిన యువ భారత ఆటగాళ్లు తమకు అందివచ్చిన అవకాశాలను రెండు చేతులా వినియోగించుకున్నారు. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం మినహా కుర్రాళ్లు అంచనాలకు మించి రాణించి సెలక్టర్లు, జట్టు యాజమాన్యానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. మయాంక్ యాదవ్ రూపంలో జట్టుకు నిఖార్సైన పేసర్ దొరకగా నితీశ్ రెడ్డి, రియాన్ పరాగ్ ఆల్‌రౌండర్ల స్థానాన్ని భర్తీ చేసేందుకు ‘మేమున్నాం’ అంటూ దూసుకొచ్చారు. ఎన్ని అవకాశాలిచ్చినా వాటిని సరిగ్గా వినియోగించుకోలేక చతికిలపడుతున్న సంజూ శాంసన్.. చివరి మ్యాచ్‌లో శతకంతో చెలరేగి తన స్థానాన్ని పటిష్టపరుచుకున్నాడు.
జడేజా రిటైర్మెంట్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఫిట్నెస్ సమస్యల నేపథ్యంలో భారత్‌ను వేధించే ఆల్‌రౌండర్ల కొరతకు ఈ సిరీస్‌తో ముగింపు పడ్డట్టే! నితీశ్ కుమార్ రూపంలో జట్టుకు పేస్ ఆల్‌రౌండర్ దొరికాడు. ఢిల్లీలో జరిగిన రెండో టీ20లో 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చి అతడు.. 34 బంతుల్లోనే 74 పరుగులతో సత్తా చాటాడు. అంతర్జాతీయ కెరీర్లో రెండో మ్యాచ్ ఆడుతున్నప్పటికీ బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగి జట్టు శాసించే స్థితిలో నిలిపాడు. ఇదే మ్యాచ్‌లో అతడు బంతితోనూ రెండు వికెట్లు పడగొట్టాడు. మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ బ్యాట్‌తో అవకాశాలు రాకపోయినా బౌలింగ్‌లో మాత్రం రాణించాడు. అభిషేక్ శర్మ బ్యాట్‌తో విఫలమైనప్పటికీ బౌలింగ్‌లో తన గురువు యువరాజ్ సింగ్ బాటలో నడుస్తున్నాడు. పెద్దగా అవకాశాలు రాకపోయినా రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్ సైతం ఆల్‌రౌండర్ల స్థానాన్ని భర్తీ చేసే యత్నం చేశారు.
బంగ్లాదేశ్‌తో కాన్పూర్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో సుమారు రెండున్నర రోజుల ఆట వర్షార్పణమైనప్పటికీ దూకుడైన ఆటతో సీనియర్లతో అద్భుతం చేసిన కోచ్ గౌతం గంభీర్.. పొట్టి ఫార్మాట్లో కుర్రాళ్లతోనూ అదే ఫలితాన్ని రాబట్టాడు. కెప్టెన్ సూర్య కూడా సిరీస్ ఆరంభంలో తన జట్టు నిస్వార్థంగా ఆడుతుందని ప్రకటించినట్టుగానే ఆటగాళ్ల ఆటతీరులోనూ మార్పు వచ్చింది. తొలి టీ20లో చేయాల్సింది 128 పరుగులే అయినప్పటికీ ప్రత్యర్థిపై ఏమాత్రం ఉదాసీనత ప్రదర్శించకుండా 11 ఓవర్లలోనే భారత్ మ్యాచ్‌ను ముగించింది. శాంసన్, సూర్య, పాండ్యా ఆది నుంచే ఎదురుదాడికి దిగి భారత్‌కు ఘనవిజయాన్ని అందించారు. రెండో టీ20 ఆరంభంలో తడబడ్డా తర్వాత నిలదొక్కుకున్న భారత్.. భారీ స్కోరుతో ప్రత్యర్థికి చెమటలు పట్టించింది. ఇక హైదరాబాద్ మ్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పన్లేదు. ఆ దూకుడే టీ20లలో భారత్‌కు రికార్డు స్కోరు (297)ను కట్టబెట్టింది. ఒక్క బ్యాటింగ్‌లోనే గాక బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ టీమ్ఇండియా దూకుడు మంత్రాన్ని పటిస్తూ ఫలితాలు రాబడుతోంది.
గత ఐపీఎల్లో గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి ప్రపంచ దిగ్గజ పేసర్లతో ఔరా! అనిపించిన యువ పేసర్ మయాంక్ యాదవ్ తన అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. నిఖార్సైన పేస్‌తో పాటు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసురుతూ బంగ్లా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. సిరీస్‌లో అతడు 4 వికెట్టే పడగొట్టినా ఆరంభంలో పరుగుల కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించాడు. వేగం కంటే కచ్చితత్వంపై దృష్టి పెట్టిన మయాంక్ ఆ విషయంలో పూర్తిగా విజయవంతమయ్యాడు. త్వరలో భారత్.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడనున్న నేపథ్యంలో మయాంక్ ఇదే ప్రదర్శనను పునరావృతం చేస్తే టెస్టులలోనూ అరంగేట్రం చేసే అవకాశాలుంటాయి.
జట్టులోకి వచ్చి దాదాపు పదేండ్లు కావొస్తున్నా సంజూ శాంసన్ ఇప్పటికీ (బంగ్లాతో సిరీస్ ముందువరకూ) తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. టాలెంట్ కొండంత ఉన్నప్పటికీ ఆవగింజంతైనా అదృష్టం లేక భారత క్రికెట్లో మోస్ట్ అన్‌లక్కీయెస్ట్ క్రికెటర్‌గా మిగిలిపోయాడు. ఇటీవలే శ్రీలంకతో ముగిసిన టీ20 సిరీస్‌లో వరుసగా రెండు డకౌట్లతో నిరాశపరిచినా గంభీర్, కెప్టెన్ సూర్య అతడిపై నమ్మకముంచారు. కానీ తొలి రెండు మ్యాచ్‌లలో అతడి ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. దీంతో ఉప్పల్ మ్యాచ్ అతడికి లైఫ్ అండ్ డెత్‌గా మారింది. అయితే మూడో టీ20లో అతడు తన ఆటలో లోతెంతో చూపించాడు. క్రీజులో కుదురుకుంటే తానెంత ప్రమాదకారో ప్రపంచానికి సగర్వంగా చాటిచెప్పాడు. వాస్తవానికి సంజూ భారత్‌కు ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ కాకున్నా ఈ శతకంతో అతడు రిషభ్ పంత్‌కూ పోటీనిచ్చినట్టే. తాజా ప్రదర్శనతో అతడు సౌతాఫ్రికాతో రాబోయే టీ20 సిరీస్‌లో తన స్థానాన్ని నిలుపుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.