Wrestlers Protest | లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్నారు. ‘మా మన్ కీ బాత్ ఎందుకు వినడం లేదు’ అంటూ ప్రధానిని ప్రశ్నించారు. తాము పతకాలు సాధించిన సమయంలో ప్రధాని ఫొటోలు దిగడం, అభినందించారని.. ఇప్పుడు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే స్పందించక పోవడం తమను ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. రియో ఒలింపిక్స్ గేమ్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ మీడియాతో మట్లాడుతూ ‘ప్రధాని మోదీజీ బేటి బచావో-బేటీ పఢవావో గురించి మాట్లాడుతారు.
ప్రతి ఒక్కరి మన్ కీ బాత్ వింటారు. మా మన్ కీ బాత్ వినలేరా? పతకాలు గెలిస్తే ఇంటికి పిలిచి మరీ గౌరవవిస్తారు. ఇవాళ మే మా మన్ కీ బాత్ వినాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ‘కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎందుకు మౌనంగా ఉన్నారని అడగాలనుకుంటున్నా. నాలుగు రోజులుగా దోమల్లో రోడ్డుపైనే నిద్రపోతున్నాం. మేం (ఢిల్లీ పోలీసులు) భోజనం సిద్ధం చేసుకునేందుకు అనుమతించడం లేదు. మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. మీరు ఇక్కడికి వచ్చి మా మాట వినండి’ అని కోరింది.
ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేత రెజ్లర్ వినేష్ ఫోగట్ మాట్లాడుతూ ‘మా వద్ద వారి (సంబంధిత వ్యక్తులు) ఫోన్ నంబర్లు కూడా లేవు. అందుకే సమస్యలను లేవనెత్తాలని మీడియా ద్వారా ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా మొర వింటారని ఆశిస్తున్నాం. బహుశా అధికారులు చూడడం లేదు. కాబట్టి కొంచెం ఇచ్చేందుకు లైట్ ఇచ్చేందుకు కొవ్వొత్తుల ర్యాలీ తీస్తాం. కేవలం రెజ్లర్లే కాకుండా ఎందరో మహిళల స్ఫూర్తికి ప్రాతినిథ్యం వహించే ఈ దేశ ఆడబిడ్డలు వీధుల్లో ఉన్నారని వారు చూడొచ్చు’ అని పేర్కొంది. టోక్యో గేమ్స్ కాంస్య పతక విజేత బజరంగ్ సైతం రెజ్లర్ల గోడు వినాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
ఈ దేశ ఆడబిడ్డలు వేడుకున్నారని, వారికి న్యాయం చేయాలని కోరారు. తాము ప్రాక్టీస్ కోసం రెజ్లింగ్ మ్యాట్లను తీసుకువచ్చామని, అందుకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపాడు. ఇప్పుడు ఊపిరి పీల్చుకునేందుకు సైతం అనుమతి తీసుకోవాలా? అని ప్రశ్నించారు. తమను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, అయినా తాము వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. వినేష్ ఫోగట్ మాట్లాడుతూ ఆటగాళ్లందరికీ ఏకతాటిపై నిలవాలని పిలుపునిచ్చింది. జాతీయ పతక విజేతలు, ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేతలు అందరూ ఒక్కతాటిపైకి వచ్చి ఐక్యంగా నిలబడాలని క్రీడాకారులందరికీ పిలుపునిచ్చింది.