WPL 2023 : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి మ్యాచ్‌లోనే భారీ స్కోర్ నమోదైంది. ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ (65)తో చెలరేగింది. చివర్లో అమేలియా కేర్ (45), పూజా వస్త్రాకర్ ధాటిగా ఆడారు. ఇసీ వాంగ్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టడంతో ముంబై ఇండియన్స్ 207 రన్స్ చేసింది. అమేలియాతో కలిసి హర్మన్‌ప్రీత్ నాలుగో వికెట్‌కు 89 పరుగులు జోడించింది. ఓపెనర్ హేలీ మ్యాథ్యూస్ (47) ధాటిగా ఆడింది. 69 పరుగుల వద్ద నాట్ సీవర్ బ్రంట్ (23) రెండో వికెట్‌గా వెనుదిరిగింది.
టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ బేత్ మూనీ ఫీల్డింగ్ తీసుకుంది. , ఓపెనర్ యస్తి భాటియా(1)ను తనుజా కన్వార్ మూడో ఓవర్లోనే ఔట్ చేసింది. 15 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ముంబైని నాట్ సీవర్ బ్రంట్, మ్యాథ్యూస్ ఆదుకున్నారు. వీళ్లు రెండో వికెట్‌కు 54 రన్స్ చేశారు.
హర్మన్‌ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. 22 బంతుల్లోనే అర్ధ శతకానికి చేరువైంది. ఈ లీగ్‌లో తొలి ఫిఫ్టీ నమోదు చేసింది. మోనికా పటేల్ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టింది. ముంబై కెప్టెన్ గ్యాప్స్‌లో బౌండరీలు కొడుతూ గుజరాత్ జెయింట్స్ బౌలర్లపై విరుచుకు పడింది. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రానా రెండు, తనూజ కన్వర్, జార్జియా వారేహమ్, అషే గార్డ్నర్ తలా ఒక వికెట్ తీశారు.