AUS Vs SL | లక్నో: ప్రపంచకప్ చరిత్రలో మరే జట్టుకు సాధ్యంకాని రీతిలో ఐదు సార్లు ట్రోఫీ చేజిక్కించుకున్న ఆస్ట్రేలియా.. ఈ మెగాటోర్నీలో బోణీ కొట్టేందుకు నానా తంటాలు పడుతున్నది. తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్, దక్షిణాఫ్రికా చేతిలో చావుదెబ్బ తిన్న కంగారూలు.. సోమవారం శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనున్నారు. మరోవైపు మాజీ చాంపియన్ లంక కూడా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి లయ అందుకునేందుకు ఇబ్బంది పడుతున్నది. గాయం కారణంగా కెప్టెన్ దసున్ షనక మెగాటోర్నీ నుంచి తప్పుకోగా.. అతడి స్థానంలో కుషాల్ మెండిస్ జట్టు పగ్గాలు అందుకున్నాడు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆసీస్‌కు వరుస పరాజయాలు ఎదురవుతుండగా.. ప్రస్తుతం పది జట్లు పాల్గొంటున్న ప్రపంచకప్‌లో ఆ జట్టు తొమ్మిదో స్థానానికి పరిమితమై ఉంది. ‘ఇక ఇప్పటి నుంచి అన్నీ మ్యాచ్‌లు మాకు నాకౌట్ లాంటివే’ అని ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ ప్రకటించగా.. ఆసీస్‌ను నిలువరించి టోర్నీ శుభారంభం చేయడమే తమ లక్ష్యమని లంక కొత్త సారథి మెండిస్ పేర్కొన్నాడు. మరి మాజీ చాంపియన్ల మధ్య సమరంలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి!