మళ్లీ అదే సీన్.. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏం జరిగిందో? ఇటీవల ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో ఏం జరిగిందో? అదే సీన్ వెస్టిండీస్‌లో కూడా రిపీట్ అయింది. మరో ఎడంచేతి వాటం పేసర్ భారత బ్యాటింగ్ లైనప్‌ను తుత్తునియలు చేశాడు. ఓబెడ్ మెకాయ్ నిప్పులు చెరగడంతో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి బంతికే రోహిత్ గోల్డెన్ డక్‌గా వెనుతిరగ్గా.. ఆ తర్వాత ఏ క్రమంలోనూ భారత జట్టు కోలుకోలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ విండీస్ ముందు చాలా స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది. దానికతోడు బౌలింగ్ ప్రయోగాలూ భారత్‌ను దెబ్బతీశాయి. భువీని పూర్తి కోటా ఓవర్లు వేయించకపోవటం కూడా ప్రభావం చూపించింది.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి చవిచూసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టును విండీస్ పేసర్ ఓబెడ్ మెకాయ్ ముప్పుతిప్పలు పెట్టాడు. మ్యాచ్ తొలి బంతికే రోహిత్ శర్మ (0)ను పెవిలియన్ చేర్చిన అతను.. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (11)ను కూడా అవుల్ చేశాడు.
శ్రేయాస్ అయ్యర్ (10) మరోసారి విఫలమవగా.. రిషభ్ పంత్ (24) క్రీజులో ఉన్నంతసేపూ ధనాధన్ ఆటతీరు కనబరిచాడు. హార్దిక్ పాండ్యా (31), రవీంద్ర జడేజా (27) ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత వచ్చిన దినేష్ కార్తీక్ (7), రవిచంద్రన్ అశ్విన్ (10), భువనేశ్వర్ (1), ఆవేష్ ఖాన్ (8), అర్షదీప్ సింగ్ (1 నాటౌట్) పరుగులు మాత్రమే చెయ్యగలిగారు.

ఈ క్రమంలో 19.4 ఓవర్లలో 138 పరుగులకు భారత జట్టు ఆలౌట్ అయింది. ఓబెడ్ మెకాయ్ ఏకంగా ఆరు వికెట్లతో చెలరేగగా.. హోల్డర్ రెండు, అకీల్ హొస్సేన్ ఒకటి, అల్జారీ జోసెఫ్ ఒక వికెట్ తీసుకున్నారు. లక్ష్య ఛేదనలో విండీస్ ఓపెన్ బ్రాండన్ కింగ్ (68) అదరగొట్టాడు. అతనితోపాటు డెవాన్ థామస్ (31 నాటౌట్) కూడా రాణించాడు.
కైల్ మేయర్స్ (8), నికోలస్ పూరన్ (14), షిమ్రాన్ హెల్మెయర్ (6), రావ్‌మెన్ పావెల్ (5), ఒడియన్ స్మిత్ (4 నాటౌట్) పరుగులు మాత్రమే చేశారు. అయితే విండీస్ విజయానికి కింగ్ బాటలు వేయగా.. థామస్ పని పూర్తిచేశాడు. మొత్తమ్మీద 19.2 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ 141 పరుగులు చేసి విజయం సాధించింది.
భారత బౌలర్లలో ఏస్ పేసర్ భువనేశ్వర్ రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయడం గమనార్హం. ఆవేష్ ఖాన్ కూడా తన కోటా ఓవర్లు పూర్తి చెయ్యలేదు. అతని చేత కేవలం 2 ఓవర్లు మాత్రమే వేయించిన రోహిత్.. చివరి ఓవర్లో అతనికి బౌలింగ్ ఇచ్చాడు. ఆ ఓవర్ రెండో బంతికే మ్యాచ్ ముగిసింది. అయితే మిగతా బౌలర్లలో అర్షదీప్ సింగ్, జడేజా, అశ్విన్, హార్దిక్ పాండ్యా, ఆవేష్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1తో విండీస్ సమం చేసింది. మూడో మ్యాచ్ మంగళవారం నాడు ఇదే వార్నర్ పార్క్‌లో జరుగుతుంది.