భారత జట్టు తరఫున తొలిసారి ఓపెనర్ అవతారం ఎత్తిన సూర్యకుమార్ యాదవ్ ఆకట్టుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన సూర్య (24) మంచి షాట్లు ఆడాడు. అయితే అకీల్ హొస్సేన్ బౌలింగ్‌లో తడబడిన అతను.. ఐదో ఓవర్లో స్వీప్ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. హొస్సేన్ వేసిన బంతి టాప్ ఎడ్జ్ తీసుకొని షార్ట్ థర్డ్‌మ్యాన్ దిశగా వెళ్లింది.
అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న హోల్డర్ సులభమైన క్యాచ్ పట్టేయడంతో సూర్యకుమార్ పెవిలియన్ చేరాడు. సూర్య అవుటైన తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (0) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఓబెడ్ మెకాయ్ వేసిన ఆరో ఓవర్ ఐదో బంతికి పెవిలియన్ చేరాడు. మెకాయ్ వేసిన ఫుల్ బాల్‌ను ఫ్లిక్ చేయడంలో శ్రేయాస్ విఫలమయ్యాడు.
దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా దూసుకెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హొస్సేన్ స్టన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో శ్రేయాస్ నిరాశగా పెవిలియన్ చేరాడు. పవర్‌ప్లే ముగిసే సరికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది.