PV Sindhu | భారత బ్యాడ్మింటన్ స్టార్, డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు (PV Sindhu) త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. హైదరాబాద్‌కు చెందిన 29 ఏళ్ల వెంకట దత్త సాయి (Venkata Datta Sai)ని సింధు మనువాడనుంది. వీరి వివాహం ఈనెల 22న ఉదయ్‌పూర్‌లో అంగరంగా వైభవంగా జరగనుంది. ఈ విషయాన్ని సింధు తండ్రి పీవీ రమణ వెల్లడించారు.
కాగా, సింధు పెళ్లి చేసుకునే వెంకట దత్త సాయి.. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ రెండు కుటుంబాలకు ఎప్పటినుంచో పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్తా ఇప్పుడు బంధుత్వంగా మారబోతోంది. ‘మా రెండు కుటుంబాలకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. కానీ నెల క్రితమే పెళ్లి ఖాయమైంది. జనవరి నుంచి సింధు వరుస టోర్నీలు ఆడబోతోంది. అందుకే సాధ్యమైనంత తొందరగా పెళ్లి చేయాలని భావించాం. డిసెంబర్ 22న పెళ్లి వేడుక జరిపించేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకుని ముహూర్తం పెట్టించాం. 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుంది. వచ్చే సీజన్ చాలా ముఖ్యమైనది కాబట్టి సింధు త్వరలోనే ప్రాక్టీస్ కూడా మొదలుపెడుతుంది’ అని ఆమె తండ్రి పీవీ రమణ తెలిపారు. ఇక డిసెంబర్ 20న సింధు పెళ్లి వేడుకలు మొదలు కానున్నాయి.
వెంకట దత్త సాయి గురించి..
సింధు పెళ్లి ప్రకటనతో ఆమెకు కాబోయే భర్త గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఆయన ఎవరు, ఏం చదువుకున్నారు..? వంటి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వెంటక దత్త సాయి గురించి ఆసక్తికర విషయాలు మీకోసం.. హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయి ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ నుండి లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో డిప్లొమా పొందారు. 2018లో గ్యాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఫ్లేమ్ యూనివర్సిటీ నుంచి అకౌంటింగ్, ఫైనాన్స్‌లో బీబీఏ పట్టా అందుకున్నారు. ఇక బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డాటా సైన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తోనూ అతడికి అనుబంధం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు.. జేఎస్‌డబ్ల్యూలో (జిందాల్ సౌత్ వెస్ట్) వెంటక దత్త సాయి తన కెరీర్‌ను మొదలు పెట్టినట్లు తెలిసింది. అక్కడ అతను సమ్మర్ ఇంటర్న్‌గా, ఇన్-హౌస్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. తన విధుల్లో భాగంగా జేఎస్‌డబ్ల్యూ యాజమాన్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టుతోనూ కలిసి పనిచేసినట్లు తెలిసింది.
Also Read..
JD Vance | ఇండియన్ ఫ్యామిలీతో అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. పిక్ వైరల్
Donald Trump | అప్పటిలోపు వారిని విడుదల చేయకపోతే.. హమాస్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్
Parliament Winter Session | అదానీ అంశం.. లోక్‌సభలో విపక్ష ఇండియా కూటమి ఎంపీల ఆందోళన