లాహోర్: నాలుగు రోజుల క్రితం రావల్పిండిలో కురిసిన వర్షం కారణంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దవడంతో సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకున్న అఫ్గానిస్థాన్.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందా? లేదా? అన్నది శుక్రవారం తేలనుంది. లీగ్ దశలో ఇంగ్లండ్‌తో జరిగిన హోరాహోరి పోరులో బట్లర్ సేనకు షాకిచ్చి ఆ జట్టును ఇంటికి పంపిన అఫ్గాన్.. నేడు ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా సెమీస్ బెర్తును ఖాయం చేసుకునే అవకాశమున్న నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయం. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను ఓడించినంత పనిచేసిన అఫ్గాన్.. మ్యాక్స్‌వెల్ పోరాటంతో తలవంచక తప్పలేదు.
కానీ స్పిన్‌కు అనుకూలిస్తున్న పాక్ పిచ్‌లపై జట్టునిండా స్పిన్నర్లు కలిగిన అఫ్గాన్.. కంగారూలను కంగారెత్తించి నాటి పరాభవానికి బదులు తీర్చుకోవడమే గాక 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత వరుసగా రెండోసారి ఐసీసీ టోర్నీ సెమీస్ చేరుకోవాలనే పట్టుదలతో ఉంది. స్టార్క్, కమిన్స్, హెజిల్వుడ్ లేని ఆసీస్ బౌలింగ్ విభాగం బలహీనంగా ఉంది. తొలి మ్యాచ్‌లో ఆ జట్టు బౌలర్లు ఇంగ్లండ్‌కు 350కు పైగా పరుగులు సమర్పించుకున్నారు. జద్రాన్, గుర్బాజ్, కెప్టెన్ హష్మతుల్లాతో పాటు ఆల్‌రౌండర్లు గుల్బాదిన్, అజ్మతుల్లా, మహ్మద్ నబీ, రషీద్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే కంగారూలకు కంగారు తప్పకపోవచ్చు. ఇక బౌలింగ్‌లో బలహీనంగా ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో పటిష్టంగా కనిపిస్తోంది. హెడ్, షార్ట్, స్మిత్, లబూషేన్, ఇంగ్లిస్, క్యారీ, మ్యాక్స్‌వెల్ వంటి ప్రపంచ స్థాయి బ్యాటర్లు ఆ జట్టు సొంతం. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మ్యాచ్ మొదలవుతుంది.