BCCI | టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచిన టీమ్ఇండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. 13 ఏండ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించడంతో ఆటగాళ్లతోపాటు సహాయక సిబ్బందికి రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ఇటీవల వాంఖడే స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో దీనికి సంబంధించిన చెక్కును కూడా అందజేసింది. అయితే ఈ మొత్తాన్ని పంచుకునే క్రమంలో ఎవరెవరికి ఎంత దక్కుతుందనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా దానికి సంబంధించి బీసీసీ అధికారుల్లో ఒకరు క్లారిటీ ఇచ్చారు.
ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, రిజర్వ్ ఆటగాళ్లు, ఇతర సిబ్బంది మొత్తం 42 మంది అమెరికా, వెస్టిండీస్ వెళ్లారు. వారిలో 15 మంది జట్టు సభ్యులతోపాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఒక్కొక్కరూ రూ.5 కోట్లు అందుకోనున్నారు. ఇక వరల్డ్ కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ప్లేయర్స్‌కు కూడా రూ.5 కోట్ల చొప్పున ఇవ్వనున్నారు.
కోచింగ్ స్టాఫ్‌కు 2.5 కోట్లు
ఇక ద్రవిడ్ కోచింగ్ స్టాఫ్ విషయానికి వస్తే.. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేకు రూ.2.5 కోట్ల చొప్పున, సహాయక సిబ్బందిలో ముగ్గురు ఫిజియోథెరపిస్ట్‌లు, ముగ్గురు త్రోడౌన్ స్పెషలిస్టులు, ఇద్దరు మసాజర్లు, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌లకు ఒక్కొక్కరికి రూ.2 కోట్లు అందజేస్తారు. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తోసహా సెలక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.కోటి ఇస్తారు. వీరితోపాటు రిజర్వ్ ఆటగాళ్లుగా వెళ్లిన రింకు సింగ్, శుభ్‌మన్ గిల్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లకు రూ.కోటి చొప్పున అందజేయనున్నారు.
కాగా, రూ.125 కోట్ల మొత్తాన్ని ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, కోచ్‌లు, సెలెక్టర్లందరికి పంచుతామని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతోపాటు భారత జట్టు స్వదేశానికి చేరుకున్న తర్వాత ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే.. టీమ్ ఇండియాకు రూ.11 కోట్లు ప్రకటించారు. దానిని అందరికి పంచనున్నారు.