ఇంగ్లండ్ లో జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోరు సాధించడంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ తో పాటు కీలకంగా వ్యవహరించాడు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. తొలి ఇన్నింగ్స్ లో అతడు సెంచరీ (104) చేశాడు. అయితే ఈ టెస్టుకు ముందు జడేజా ఐపీఎల్-15లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ కెప్టెన్ గా నియమితుడై ఆ తర్వాత తప్పుకోవడం.. ఈ క్రమంలో ఫామ్ ను కోల్పోవడం.. సీఎస్కే ఆడిన చివరి నాలుగు మ్యాచుల్లో కనిపించకపోవడంతో పాటు చెన్నై యాజమాన్యంతో జడ్డూకు విభేదాలు తలెత్తాయని గుసగుసలు వినిపించాయి.
ఐపీఎల్ తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికా సిరీస్ ఆడినా జడేజా మాత్రం నేరుగా ఇంగ్లాండ్ పర్యటనతోనే బరిలోకి దిగాడు. అయితే తాజాగా జడేజా-సీఎస్కే విభేదాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈ ఆల్ రౌండర్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. తాను ఐపీఎల్ గురించి పట్టించుకోవడం లేదని.. తన దృష్టి అంతా భారత జట్టుకు ఆడటంపైనే ఉందని స్పష్టం చేశాడు.
తొలి టెస్టు రెండో రోజు మ్యాచ్ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జడేజా మాట్లాడుతూ.. ‘జరిగిందేదో జరిగిపోయింది. ఐపీఎల్ నా మైండ్ లో లేదు. మీరు దేశం తరఫున ఆడుతున్నప్పుడు మీ దృష్టి మొత్తం టీమిండియా మీదే కేంద్రీకరించాలి. నేనూ అదే చేస్తున్నా. భారత జట్టు తరఫున ఉత్తమంగా ప్రదర్శనలివ్వడం కంటే సంతృప్తి మరొకటి ఉండదు..’అని అన్నాడు.
ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 98 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్ కు వచ్చాడు జడేజా. రిషభ్ పంత్ తో కలిపి ఆరో వికెట్ కు 222 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపాడు. ఈ క్రమంలో అతడు టెస్టులలో తన మూడో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వీళ్లిద్దరి వీరబాదుడుతో భారత జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆలౌట్ అయింది.