WFI : ఒలింపిక్స్ ముగియడంతో భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ హై కోర్ట్ ఆర్డర్‌ను సవాల్ చేసేందుకు సిద్ధమైంది. రెజ్లింగ్ సమాఖ్యపై భారత ఒలింపిక్ సంఘానికి చెందిన అడ్ హక్ కమిటీ (Adhoc Committee) జోక్యం కొనసాగుతుందని హైకోర్టు చెప్పడమే అందుకు కారణం. దాంతో, తమపై ఐఓఏ కమిటీ పెత్తనం ఏంటని? రెజ్లింగ్ సమాఖ్య గుర్రుగా ఉంది. ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యామని శుక్రవారం డబ్ల్యూఎఫ్ఏ వెల్లడించింది.
డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల తర్వాత రెజ్లర్ల అభ్యర్థన మేరకు ఢిల్లీ హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. డబ్ల్యూఎఫ్ఐ అధికారాలకు కళ్లెం వేస్తూ నిర్ణయాధికారిన్ని ఐఓఏకు చెందిన అడ్‌హక్ కమిటీకి అప్పగించింది. దాంతో, రెజ్లింగ్ సమాఖ్య సొంతంగా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల కోర్టును ఆశ్రయించాలని సంజయ్ సింగ్ బృందం ఆలోచిస్తోంది.
‘హై కోర్టు ఆర్డర్‌ను మేము ద్విసభ్య ధర్మాసనం దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పటికే అడ్‌హక్ ప్యానెల్‌ను ఐఓఏ రద్దు చేసింది. ఈ విషయమై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, అంతర్జాతీ ఒలింపిక్ కమిటీని కూడా మేము సంప్రదిస్తాం. ఎందుకంటే.. బయటి సంస్థల, వ్యక్తుల జోక్యం కారణంగా అథ్లెట్ల ప్రదర్శనపై ప్రభావం పడుతుందని ఇవి హెచ్చరించాయి’ అని సంజయ్ సింగ్ తెలిపాడు.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా కుస్తీ వీరులు ఉద్యమించిన విషయం తెలిసిందే. వినేశ్ ఫోగాట్, భజ్రంగ్ పూనియా, సాక్షి మాలిక్‌ల పోరాటంతో బ్రిజ్ భూషణ్‌పై వేటు పడింది. అనంతరం జరిగిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో అతడి సన్నిహితుడు సంజయ్ సింగ్ గెలుపొందాడు. దాంతో, ఆందోళన వ్యక్తం చేసిన రెజ్లర్లు భారత ఒలింపిక్ సంఘాన్ని ఆశ్రయించారు. ఫలితంగా ఐఓఏ ఒక అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేసి డబ్ల్యూఎఫ్ఐ ఏకపక్ష ధోరణికి ముకుడతాడు వేసింది.