సిరిసిల్ల రూరల్, ఆగస్టు 16 : టెక్స్టైల్ పార్క్‌లో(Textile park) నెలకొన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే పరిష్కరించి, కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించాలని తెలంగాణ పవర్‌లూం వర్కర్స్ యూనియర్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఐటీయూ(CITU) ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్క్‌లోని పరిశ్రమలను కార్మికులు మూసివేసి, ప్రధాన గేటు ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మూషం రమేశ్ హాజరై మాట్లాడారు. టెక్స్టైల్ పార్క్‌లో మూత పడ్డ పరిశ్రమలను వెంటనే తెరిపించాలని, పూర్తి స్థాయిలో పరిశ్రమలను ప్రారంభించి నిరంతరం ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఆర్డర్లపై టెక్స్టైల్ పార్క్ కార్మికులు ఆధారపడి ఉన్నారని, ప్రభుత్వ శాఖలతోపాటు మిగతా శాఖల ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. 2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన 10 శాతం యారన్ సబ్సిడీని కార్మికులకు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. టెక్స్టైల్ పార్క్ యాజమానులు, ఆసాములు, కార్మికులకు మద్దతుగా నిలివాలని కోరారు. యారన్ సబ్సిడీ డబ్బులను కార్మికుల ఖాతాల్లో జమ చేసి, సంవత్సరం పొడవునూ ఉపాధి కల్పించాలన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.