Virender Sehwag : భారత క్రికెట్లో మరో యువతార దూసుకొస్తున్నాడు. మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ (Aryavir Sehwag) అచ్చం తండ్రిలానే విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ‘శెభాష్’ అనిపించుకుంటున్నాడు. దేశవాళీ టోర్నీల్లో ఒకటైన కూచ్ బెహర్ ట్రోఫీ(Cooch Behar Trophy)లో చెలరేగి ఆడిన ఆర్యవీర్ 3 పరుగుల తేడాతో ట్రిపుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. తనయుడు ట్రిపుల్ సెంచరీ మిస్ అయ్యాక వీరూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు.
పరుగులు సాధించాలనే కసిని అలాగే కొనసాగించాలని, డాడీ కంటే ఎక్కువ సెంచరీలు కొట్టాలని తన సుపుత్రుడిని సెహ్వాగ్ మనఃస్ఫూర్తిగా దీవించాడు. ‘ఆర్యవీర్ సెహ్వాగ్ చాలా అద్భుతంగా ఆడావు. 23 పరుగుల తేడాతో ఫెరారీని మిస్ అయ్యావు. అయినా పర్లేదు చాలా బాగా ఆడావు. నీలోని ఈ కసిని అలాగే కొనసాగించు. మీ డాడీ కంటే ఎక్కువ సెంచరీలు, ద్విశతకాలు, ట్రిపుల్ సెంచరీలు కొట్టు. ఇలానే ఆడుతూ ఉండు’ అని వీరూ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
Well played @aaryavirsehwag . Missed a Ferrari by 23 runs. But well done, keep the fire alive and may you score many more daddy hundreds and doubles and triples. Khel jaao.. pic.twitter.com/4sZaASDkjx
— Virender Sehwag (@virendersehwag) November 22, 2024
కూచ్ బెహర్ ట్రోఫీలో ఢిల్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆర్యవీర్ సెహ్వాగ్ ఎడాపెడా బౌండరీలు దంచేశాడు. మేఘాలయా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ శతకం సాధించాడు. అంతటితో ఆగకుండా తన విధ్వంసాన్ని కొనసాగిస్తూ ట్రిపుల్ సెంచరీకి చేరువయ్యాడు. అయితే.. అనూహ్యంగా 3 పరుగుల దూరంలో బౌల్డ్ అయ్యాడు. ఆర్యవీర్ మెరుపు ఇన్నింగ్స్‌లో 51 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అతడితోపాటు ఓపెనర్ అర్నవ్ బుగ్గ(114), ధన్య నక్రా(130)లు శతకాలు బాదడంతో ఢిల్లీ జట్టు ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 623 పరుగులు చేసింది.