AP News | అక్రమ కేసులతో కూటమి ప్రభుత్వం తన భర్తను వేధిస్తుందని వైసీపీ సోషల్మీడియా కార్యకర్త ఇంటూరి రవికుమార్ సతీమణి సృజన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన్ను కలిసే అవకాశం ఇవ్వకుండా.. పీటీ వారెంట్ల పేరుతో రాష్ట్రమంతటా తిప్పుతున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సృజన మాట్లాడుతూ.. తన భర్తను, తన కుటుంబాన్ని ఇలాగే వేధిస్తే ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.
తన భర్తపై అక్రమంగా 15 కేసులు పెట్టారని వైసీపీ సోషల్మీడియా కార్యకర్త ఇంటూరి రవికుమార్ భార్య సృజన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనపై ఇంకా పెడుతూనే ఉన్నారని.. అసలు ఆయన చేసిన తప్పేంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం తన కుటుంబాన్ని చాలా దారుణంగా ఇబ్బందులు పెడుతుందని కన్నీళ్లు పెట్టుకున్నారు. పీటీ వారెంట్ల పేరుతో రాష్ట్రమంతటా తనను తిప్పుతున్నారని చెప్పారు. కనీసం తన భర్తను కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదని వాపోయారు.
విశాఖలోని తమ నివాసం నుంచి తీసుకెళ్లి తొలుత గుడివాడ, తర్వాత గుంటూరు అరండల్పేట, దువ్వాడలో కేసులు పెట్టారని సృజన తెలిపారు. నా భర్తను తీసుకెళ్తున్న పోలీసుల వెంటనే ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తున్నానని.. కారు ఆపి అందులో గంజాయి పెట్టి నాపై కూడా కేసు పెట్టే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత విశాఖలోని మహారాణి పేట పీఎస్కు పంపించి, అక్కడి నుంచి రాజమండ్రిలో రిమాండ్కు పంపించారని చెప్పారు. అక్కడి నుంచి మాచర్ల, కురుపాం, వైజాగ్ సెంట్రల్ జైలుకు పంపించారని తెలిపారు. పీటీ వారెంట్లు వేసి అక్కడి నుంచి బాపట్ల, ఇంకొల్లు పీఎస్కు ఆ తర్వాత సబ్బవరం జైలుకు పంపారన్నారు. అక్కడి నుంచి శ్రీకాకుళం లావేరు, గాజువాక కోర్టు ఇలా తిప్పి తిప్పి ఇప్పుడు మాచర్ల తీసుకెళ్లారని అన్నారు. రిమాండ్లో ఉన్నారని తెలిసి కూడా పులివెందుల పీఎస్ నుంచి పోలీసులు వచ్చి తమ ఇంటి గోడకు నోటీసులు అతికించి వెళ్లారని మండిపడ్డారు.