పాకిస్తాన్తో ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్లో భారత జట్టును వీరోచిత పోరాటంతో గెలిపించాడు కోహ్లీ. అయితే తన ఇన్నింగ్స్ ఆరంభంలో తనే ఈ మ్యాచ్ను చెడగొడుతున్నానని అనుకున్నాడట. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడీ రన్ మెషీన్.
పాకిస్తాన్ పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. దీంతో 7/1తో భారత జట్టు కష్టాల్లో పడినప్పుడు కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత వెంట వెంటనే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ కూడా పెవిలియన్ చేరారు. దీంతో భారత జట్టు 31/4 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.
అప్పటికి కోహ్లీ 21 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులే చేశాడు. ఈ సమయంలోనే తను అసహనానికి గురైనట్లు తెలిపాడు. ‘నేను 21 బంతుల్లో 12 పరుగులు చేసినప్పుడు నేను మ్యాచ్ చెడగొట్టేస్తున్నానేమో అనిపించింది. బంతిని గ్యాప్స్లోకి పంపలేకపోయా. అయితే అనుభవంతోపాటు చివరి వరకూ క్రీజులో ఉండటం ఎంత అవసరమో నాకు తెలుసు.
భారత జట్టులో నా పాత్ర ఎప్పటి నుంచో అదే. అందుకే చివర్లో భారీ షాట్లు ఆడొచ్చనే నమ్మకంతో ఉన్నా’ అని కోహ్లీ వివరించాడు. కోహ్లీ, పాండ్యా కలిసి ఐదో వికెట్కు 100 పరుగులపైగా భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత పాండ్యా అవుటైనా కోహ్లీ రెచ్చిపోయి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు.