Virat Kohli : ప్రతిష్ఠాత్మక బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ సమరానికి మరో నాలుగు రోజుల్లో తెరలేవనుంది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండుసార్లు ట్రోఫీ గెలుపొందిన భారత జట్టు (Team India) ఈసారి అదే ఫలితంపై కన్నేసింది. నవంబర్ 22న పెర్త్ మైదానంలో కంగారూలతో బిగ్ ఫైట్‌కు ముందు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఆస్ట్రేలియా గడ్డపై తన అత్తుత్తమ సెంచరీ అందరూ అనుకుంటున్నట్టు అడిలైడ్ది కాదని కోహ్లీ చెప్పాడు.
ప్రాక్టీస్ మ్యాచ్‌తో పెర్త్ టెస్టుకు సన్నద్ధమైన భారత బృందం మాట్లాడిన ఓ వీడియోను బీసీసీఐ విడుదల చేసింది. అందులో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో తన ఫేవరెట్ సెంచరీ ఏదో వివరించాడు. ‘ఆస్ట్రేలియాలో నా ఉత్తమ సెంచరీ అడిలైడ్ది కాదు. నా బెస్ట్ శతకం అంటే పెర్త్‌లో కొట్టిందే. 2018-19వ ఏడాదిలో మేము ఆసీస్‌లో ఆడాం.
సుదీర్ఘ ఫార్మాట్లోనే నేను ఆడిన అత్యంత కఠినమైన పిచ్ అదే అని నాకు అనిపించింది. అలాంటి మైదానంలో వంద కొట్టడం చాలా గొప్ప ఫీలింగ్’ అని కోహ్లీ తెలిపాడు. పెర్త్ మైదానంలో సహచరులు తడబడిన చోట క్రీజులో పాతుకుపోయిన విరాట్ 257 బంతుల్లో 123 పరుగులతో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. ఆమ్యాచ్‌లో ఆసీస్ 146 పరుగుల తేడాతో గెలుపొందింది.
కంగారూ గడ్డపై టెస్టు సిరీస్ అంటే ఎంతటి బ్యాటర్‌కు అయినా వణుకే. బౌన్సీ, పేస్ పిచ్లమీద ఆడడం ఏ క్రికెటర్‌కు అయినా శక్తికిమించినపనే. కోహ్లీకి మెరుగైన రికార్డు ఉంది. 13 మ్యాచుల్లో రన్ మెషిన్ తన జోరు చూపిస్తూ 54.08 సగటుతో 1,352 పరుగులు సాధించాడు. అందులో 6 సెంచరీలు, 4 అర్ధ శతకాలు ఉన్నాయి.
Let’s enjoy Virat Kohli maiden test ton against Australia in BGT !!!.
-Kohli’s century was crucial as it showed his ability to handle tough overseas conditions and high-quality Australian bowling.#ViratKholi #AUSvIND #SAvIND #BGT2024 #INDvAUS
— Dilkesh (@one_handed17) November 13, 2024
ఆసీస్ పర్యటనలో కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన అంటే ఎవరికైనా 2014-15 సిరీస్ గుర్తుకు రావడం ఖాయం. అప్పుడు యువకుడైన కోహ్లీ ఉడుకురక్తంతో రెచ్చిపోయాడు. నాలుగు మ్యాచుల్లో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించిన అతడు 86.50 సగటుతో 692 రన్స్ కొట్టాడు. ఆ సిరీస్‌లో కోహ్లీ విధ్వంసానికి నాలుగు సెంచరీలు, ఒక అర్ధ శతకం పరాకాష్ట అని క్రికెట్ పండితులు అభివర్ణిస్తుంటారు.