Srisailam Temple | శ్రీశైలం : ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా మల్లికార్జునుడి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో శ్రీగిరులు కిటకిటలాడాయి. ఎక్కడ చూసినా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి నామస్మరణలతో ఆలయ పరిసరాలన్నీ మార్మోగాయి. వేకువ జాము నుంచే భక్తులు కృష్ణా నదిలో స్నానాలు ఆచరించారు. కృష్ణమ్మకు పసుపు, కుంకుమలతో సారె సమర్పించి.. కార్తీక దీపాలను వదిలారు. అక్కడి నుంచి ఆలయానికి చేరుకొని స్వామి, అమ్మవారలను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఉత్తరమాడవీధిలో, గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగించారు.
కార్తీక మాస వేడుకల్లో భాగంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామివారల ఉత్సవమూర్తులకు సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పుష్కరిణి వద్దకు వేంచేపు చేసి ప్రత్యేక పుష్పాలంకరణతో లక్ష దీపార్చన కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసంలో పుష్కరిణి వద్ద మహిళలు దీపాలు వెలిగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఈవో చంద్రశేఖర ఆజాద్ తెలిపారు.
ప్రతి సోమవారం పుష్కరిణి హారతి అత్యంత వైభవంగా జరిపిస్తున్నట్లు తెలిపారు. పుష్కరణి దశవిధ హారతులు ప్రత్యేక ఆకర్షణ కాగా.. కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివస్తారని శ్రీశైల ప్రభ సంపాదకుడు డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. ఈ దశవిధ హారతులను తిలకిస్తే ఎంతో శుభం కలుగుతుందని పండితులు పేర్కొన్నారు.
ఓంకార హారతి : పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరమే ఓంకారం. ఈ ఓంకార హారతిని దర్శించడంతో కష్టాలన్నీ నివారించబడి సకలుశుభాలు చేకూరుతాయి.
నాగ హారతి : నాగహారతిని దర్శించడంతో సర్పదోషాలు తొలగి సంతాన ప్రాప్తి కలుగుతుంది.
త్రిశూల హారతి : త్రిశూల హారతిని దర్శించడం వల్ల అకాల మరణాలు తొలగిపోతాయి. గ్రహదోషాలు నివారణ అవుతాయి.
నంది హారతి : నంది హారతిని దర్శించడంతో భయం, దుఖం తొలగి ఆనందం.. నూతనోత్సాహం లభిస్తాయి.
సింహ హారతి : సింహ హారతిని దర్శిస్తే శత్రుబాధతలు తొలగి.. మనోధైర్యం పెరుగుతుంది.
సూర్య హారతి : సూర్య హారతిని దర్శనంతో ఆరోగ్యం చేకూరి దీర్ఘాయుష్షు లభిస్తుంది.
చంద్ర హారతి : చంద్ర హారతిని దర్శించడంతో మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ ద్వేషాలు తొలగుతాయి.
కుంభ హారతి : కుంభ హారతిని దర్శనం ద్వారా కోరుకున్న కోర్కెలు నెరవేరి సిరి సంపదలు కలుగుతాయి.
నక్షత్ర హారతి : నక్షత్ర హారతిని దర్శిస్తే జాతక దోషాలు తొలిగిపోయి.. చేపట్టిన పనుల్లో జయం లభిస్తుంది.
కర్పూర హారతి : కర్పూర హారతిని దర్శించడంతో పాపాలన్ని తొలిగి యజ్ఞఫలంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.